బీజేపీని ఓడించేందుకు ఏ పార్టీతోనైనా జట్టు కడుతాం

బీజేపీని ఓడించేందుకు ఏ పార్టీతోనైనా జట్టు కడుతాం

బీజేపీని ఓడించడానికి ఏ పార్టీతోనైనా జట్టు కడుతామని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ ప్రకటించారు. ప్రజా ఉద్యమాలే లక్ష్యంగా చేసుకుని దేశవ్యాప్తంగా గ్రామాల్లో సీపీఐ పోరుబాట పడుతుందని చెప్పారు. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మల్లికా కన్వెన్షన్ లో నిర్వహించిన సీపీఐ రాష్ట్ర మహాసభలు బుధవారంతో ముగిశాయి. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో నారాయణ మాట్లాడారు. కమ్యూనిస్టుల సాయుధ పోరాటం ఫలితంగా నిజాం ప్రభుత్వం పతనమైనందున ముఖ్యమంత్రి కేసీఆర్.. ఈనెల17వ తేదీన అధికారికంగా తెలంగాణ విమోచన దినోత్సవాన్ని జరపాలని డిమాండ్ చేశారు. సీఎం కేసీఆర్ కేవలం ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీకి భయపడే విమోచన దినోత్సవాలు జరిపేందుకు వెనకడుగు వేస్తున్నారని ఆరోపించారు. ఇప్పటికైనా మనసు మార్చుకుని తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా జరపాలని నారాయణ డిమాండ్ చేశారు. 

సినీ హీరో అక్కినేని నాగార్జునపైనా నారాయణ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. డబ్బు సంపాదనే ధ్యేయంగా బిగ్ బాస్ షో పేరుతో యువతను నాగార్జున చెడగొడుతున్నారని, తక్షణమే బిగ్ బాస్ షోను బ్యాన్ చేయాలని డిమాండ్ చేశారు. షో నిలిపివేసేందుకు ఎంతటి పోరాటానికైనా తాను వెనుకడుగు వేసే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు.