బీఆర్ఎస్ సెంటిమెంట్ వ్యాఖ్యలు మానుకోవాలి : నారాయణ

బీఆర్ఎస్ సెంటిమెంట్ వ్యాఖ్యలు మానుకోవాలి : నారాయణ
  • జల వివాదాల పరిష్కారానికి తెలుగు రాష్ట్రాల 

న్యూఢిల్లీ, వెలుగు: నీళ్ల పేరిట రాజకీయం తగదని, అలా చేస్తే తల్లిని అడ్డుపెట్టుకుని రాజకీయం చేసినట్టే అవుతుందని సీపీఐ నేషనల్ సెక్రటరీ నారాయణ అన్నారు. తెలంగాణ సెంటిమెంట్ కనుమరుగవడానికి కారణమే కేసీఆర్ అని‌‌ గుర్తుంచుకోవాలన్నారు. తన కేబినెట్‌‌లో తెలంగాణను వ్యతిరేకించిన వాళ్లు 12 మందికి కేసీఆర్ అవకాశం ఇచ్చారన్నారు. అవన్నీ మభ్యపెట్టి ఇప్పుడు సెంటిమెంట్ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు. శుక్రవారం ఢిల్లీలో మీడియాతో ఆయన మాట్లాడుతూ.. జల వివాదాల పరిష్కారానికి తెలుగు రాష్ట్రాల సీఎంల భేటీ.. ప్రతిఒక్కరూ స్వాగతించాల్సిన అంశమన్నారు. పంచాయితీలు అవసరం లేదని, ఇద్దరు సీఎంలు కూర్చుని మాట్లాడుకుంటే సమస్యకు పరిష్కారం దొరుకుతుందని చెప్పారు.

 నీళ్లను సృష్టించలేమని, ఉన్న వాటిని ప్రణాళికతో సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. జల వివాదాల పరిష్కారానికి కమిటీ వేయడం మంచి విషయమన్నారు. జల వివాదాలు పరిష్కారం కాకుండా కొత్త ప్రాజెక్టులు నిర్మించడం సరికాదని అభిప్రాయపడ్డారు. రెండు రాష్ట్రాలు కూర్చుని మాట్లాడుకుంటే నీటిని సమృద్ధిగా వినియోగించుకొని, ఏపీ, తెలంగాణను సస్యశ్యామలం చేయొచ్చని పేర్కొన్నారు. రేవంత్ రెడ్డి ప్రజలు ఎన్నుకున్న సీఎం అని, ఆయనను అనవసరంగా బ్లేమ్ చేయడం సరికాదన్నారు. తెలంగాణ ప్రయోజనాల కోసమే ఆయన పనిచేస్తున్నారని తెలిపారు.