
న్యూఢిల్లీ, వెలుగు: ఫోన్ వాడినంత మాత్రాన పేదరికం లేనట్లా? అని కేంద్ర ప్రభుత్వాన్ని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ ప్రశ్నించారు. దేశంలో సెల్ ఫోన్లు, కార్లు ఉపయోగించే వారి సంఖ్య పెరిగిందన్నారు. ఫుట్ పాత్‌పై పడుకునే వాడు కూడా సెల్ ఫోన్ వాడుతున్నారని తెలిపారు. శనివారం ఢిల్లీలో తెలంగాణ భవన్‌లో మీడియాతో ఆయన మాట్లాడారు. ప్రస్తుతానికి దేశంలో బీజేపీ రాజకీయాలు దారుణంగా మారాయని ఫైర్ అయ్యారు.
కేంద్ర ప్రభుత్వం అన్ని వ్యవస్థలను కంట్రోల్ చేస్తోందని ఆరోపించారు. ముఖ్యంగా అదానీ గ్రూప్‌కి సెబీ క్లీన్ చిట్ ఇచ్చిందని గుర్తుచేశారు. అలాగే, అండమాన్ నికోబర్ దీవులను ఆదానీకి అప్పగించారని, ఆయనకు మద్దతుగా ప్రధాని మోదీ నిలుస్తున్నారన్నారు. కేంద్ర ప్రభుత్వ సంస్థలను కూలదోసి కార్పొరేట్ ప్రయోజనాలను బీజేపీ కాపాడుతోందని విమర్శించారు. సీపీఐ ఆధ్వర్యంలో ఆదివారం నుంచి 25వ తేదీ వరకు చండీగఢ్‌లో జాతీయ మహాసభలు నిర్వహిస్తున్నట్లు నారాయణ తెలిపారు. ఈ సభల్లో దేశవ్యాప్తంగా దాదాపు 750 మంది ప్రతినిధులు హాజరవుతారని చెప్పారు.