పేదల గుడిసెలు కూల్చడం దుర్మార్గం : మాజీ ఎమ్మెల్యే చాడ వెంకట్ రెడ్డి,

పేదల గుడిసెలు కూల్చడం దుర్మార్గం : మాజీ ఎమ్మెల్యే చాడ వెంకట్ రెడ్డి,

హనుమకొండ, వెలుగు : పేదల గుడిసెలను కూల్చివేయడం దుర్మార్గం అని సీపీఐ జాతీయ మాజీ  కార్యవర్గ సభ్యుడు, మాజీ ఎమ్మెల్యే చాడ వెంకట్ రెడ్డి, రాష్ట్ర సహాయ కార్యదర్శి తక్కళ్లపల్లి శ్రీనివాసరావు విమర్శించారు. హనుమకొండ జిల్లా పరిధిలోని గుండ్ల సింగారం సురవరం సుధాకర్ రెడ్డి నగర్ లో ఇండ్లు, గుడిసెలు తొలగించడాన్ని నిరసిస్తూ బాధితులు శుక్రవారం చేపట్టిన వంటా-వార్పు కార్యక్రమానికి వారు హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఇండ్లు వస్తాయన్న ఆశతో నిరుపేదలు కాంగ్రెస్‌‌కు ఓట్లేసి గెలిపిస్తే, ఇప్పుడు వారిని రోడ్డున పడేస్తున్నారని మండిపడ్డారు.

హనుమకొండ గుండ్ల సింగారంలో  174, 175 సర్వే నెంబర్లలో చెరువు శిఖం భూమి  లేదని, వైఎస్ హయాంలో 1,360 మంది పేదలకు ఇండ్ల స్థలాలు ఇచ్చారని గుర్తు చేశారు. సీపీఐ ఆధ్వర్యంలో పేదలు ఐదేండ్లుగా భూ పోరాటం నిర్వహించి గుడిసెలు వేసుకొని ఉంటున్నారన్నారు. గుండ్ల సింగారంలో అర్హులైన ప్రతి పేద కుటుంబానికి ఇండ్ల స్థలాలు కేటాయించి, పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. లేకపోతే రాష్ట్రవ్యాప్తంగా భూపోరాటాలను తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో సీపీఐ జిల్లా కార్యదర్శి కర్రె భిక్షపతి, రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు నేదునూరి జ్యోతి, జిల్లా సహాయ కార్యదర్శులు తోట భిక్షపతి, మద్దెల ఎల్లేశ్ పాల్గొన్నారు.