ఉమ్మడి వరంగల్ జిల్లా సంక్షిప్త వార్తలు

ఉమ్మడి వరంగల్ జిల్లా సంక్షిప్త వార్తలు

వరంగల్​సిటీ, వెలుగు: వరంగల్ బొల్లికుంటలో పేదల గుడిసెల్ని కాల్చివేయడం హేయమైన చర్య అని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గసభ్యులు తక్కళ్లపల్లి శ్రీనివాస్ రావు మండిపడ్డారు. భూకబ్జాదారులు, రియల్ ఎస్టేట్ వ్యాపారులతో పోలీసులు, ఆఫీసర్లు కుమ్మక్కై, గుడిసెల్ని కాల్చుతున్నారని ఆరోపించారు. మంగళవారం పోచమ్మ మైదాన్ సెంటర్​లో సీపీఐ లీడర్లు, పేదలతో కలిసి మహాధర్నా నిర్వహించారు. ఈసందర్భంగా శ్రీనివాస్ రావు మాట్లాడుతూ.. అర్ధరాత్రి దాటక ఒక్కసారిగా మీదపడి గుడిసెల్ని తగలబెట్టడం దొరల పాలనకు నిదర్శనమన్నారు. పేదలను భయపెడుతూ, భయభ్రాంతులకు గురి చేయడం అప్రజాస్వామికమన్నారు. బాధితులకు రూ.లక్ష పరిహారంతో పాటు అదే స్థలంలో ఇండ్ల పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. లేదంటే ఆందోళన ఉధృతం చేస్తామన్నారు.

ఈటల కుటుంబానికి పరామర్శ

కమలాపూర్, వెలుగు: మాజీ మంత్రి, ఎమ్మెల్యే ఈటల రాజేందర్  కుటుంబాన్ని మంగళవారం సినీనటి పూనం కౌర్ పరామర్శించారు. కమలాపూర్​లోని ఈటల నివాసంలో ఈటల మలయ్య చిత్రపటానికి పూలమాల వేసి, నివాళి అర్పించారు. ఈటల కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. అలాగే జమ్మికుంట ఆర్ఎంపీలు, కమలాపూర్ హమాలీ సంఘం నాయకులు కూడా ఈటలను పరామర్శించారు. కార్యక్రమంలో కార్పొరేటర్ గురుమూర్తి శివ కుమార్, నరహరి లక్ష్మారెడ్డి తదితరులున్నారు.

మట్టి గణపతుల పంపిణీ..

హసన్ పర్తి: హసన్ పర్తిలోని కనకదుర్గ గ్రూప్స్ ఆధ్వర్యంలో మట్టి గణపతుల పంపిణీ చేపట్టగా.. చీఫ్ గెస్టుగా సినీ నటి పూనమ్  కౌర్ హాజరయ్యారు. ప్రజలకు మట్టి గణపతులు అందజేశారు. పర్యావరణాన్ని పరిరక్షించే బాధ్యత అందరిపై ఉందన్నారు. కార్యక్రమంలో కొండం కమలాకర్ రెడ్డి, కార్పొరేటర్​ శివ కుమార్, శ్రీనివాస్ తదితరులున్నారు.

కబ్జా చేస్తే కఠిన చర్యలు
జాలు బంధం కాలువ వద్ద హెచ్చకరిక బోర్డు ఏర్పాటు చేసిన ఆఫీసర్లు

నర్సంపేట, వెలుగు: నర్సంపేట టౌన్​ పరిధిలోని సర్వాపురం శివారు జాలు బంధం కాలువను కబ్జా చేయడంపై ‘వెలుగు’లో కథనం రాగా, ఆఫీసర్లు స్పందించారు. వరంగల్  కలెక్టర్ డాక్టర్ గోపి, ఇరిగేషన్ ఎస్ఈ వెంకటేశ్వరరావు ఆదేశాల మేరకు.. నర్సంపేట తహసీల్దార్  వాసం రాంమూర్తి, ఐబీ ఏఈఈ స్నేహిత, సిబ్బంది మంగళవారం జాలు బంధం కాలువను పరిశీలించారు. కాలువ వద్ద హెచ్చరిక బోర్డు ఏర్పాటు చేశారు. ఈసందర్భంగా ఆయా శాఖల ఆఫీసర్లు మాట్లాడుతూ.. జాలుబంధం కాలువ ఐబీ రికార్డులో ఉందని, ఈ స్థలాన్ని ఎవరు ఆక్రమించినా చర్యలు తప్పవని హెచ్చరించారు. అమాయకులు ఈ స్థలాన్ని కొని, మోసపోవద్దని సూచించారు. కాలువను ఎట్టి పరిస్థితుల్లో అన్యాక్రాంతం కానివ్వమని, కాపాడుతామని స్పష్టం చేశారు. ఇదిలా ఉండగా, నర్సంపేటలో గత వారం రోజులుగా వెలుగు చూస్తున్న భూదందాలపై నిఘా వర్గాలు ఆరా తీస్తున్నట్లు తెలిసింది. ఎస్బీ, ఇంటలిజెన్స్ ఆఫీసర్లు భూదందాలో ఎవరెవరి పాత్ర ఏ ముందనే విషయంపై కూపీ లాగుతున్నారు. భూదందాలో ఉన్న అధికార పార్టీ లీడర్ల హిస్టరీని పరిశీలిస్తున్నారు.

వాగులో కొట్టుకుపోయిన ఆటో
నీటిలో మునిగి డ్రైవర్ మృతి

పాలకుర్తి (కొడకండ్ల), వెలుగు: వాగులో వరద ఉధృతికి ఆటో కొట్టుకుపోవడంతో డ్రైవర్​కు గాయాలై నీటిలో మునిగి చనిపోయాడు. ఈ విషాద సంఘటన జనగామ జిల్లా కొడకండ్ల మండలం మొండ్రాయి గ్రామంలో జరిగింది. స్థానికుల వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన వినోద్(50) ఆటో నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. మంగళవారం ఉదయం గ్రామ సమీపంలో టాయిలెట్ కోసమని ఆటోలో వెళ్తున్నాడు. వరద ఉధృతికి ఆటోతో సహా కొట్టుకుపోయాడు. మత్తడి దగ్గర్లో ఆటో చెట్ల మధ్య ఇరుక్కుపోయింది. డ్రైవర్ వినోద్ నీటిలో మునిగి చనిపోయాడు. 

వాగులో వృద్ధుడి గల్లంతు

శాయంపేట, వెలుగు: వాగులో వృద్ధుడు గల్లంతైన సంఘటన హనుమకొండ జిల్లా శాయంపేట మండలం గట్లకానిపర్తిలో జరిగింది. ఎస్సై వీరభద్రరావు వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన సముద్రాల మల్లయ్య(75) మంగళవారం ఉదయం తన కోడలితో కలిసి పొలం పనికి వెళ్లాడు. మార్గమధ్యలో వాగు దాటుతుండగా.. తన కోడలు గల్లంతైంది. వెంటనే మల్లయ్య ఆమెను కాపాడి, తాను కూడా బయటకు వచ్చే ప్రయత్నం చేశాడు. వరద ఉధృతికి కొట్టుకుపోయాడు. మలయ్య ఆచూకీ కోసం గజ ఈతగాళ్లు గాలిస్తున్నారు.

అంకితభావంతోనే గుర్తింపు

జనగామ అర్బన్, వెలుగు: విధుల పట్ల అంకితభావంతో పనిచేస్తేనే గుర్తింపు లభిస్తుందని జనగామ ఏసీపీ గజ్జి క్రిష్ణ అన్నారు. మంగళవారం కలెక్టర్​ ఆఫీస్​లో బదిలీపై వెళ్తున్న క్రిష్ణను కలెక్టర్ శివలింగయ్య, డీసీపీ సీతారాం సన్మానించారు. ఈ సందర్భంగా క్రిష్ణ మాట్లాడుతూ.. పోలీసు శాఖ తనకు అప్పగించిన పనుల్ని చిత్తశుద్ధితో చేశానన్నారు. నిస్వార్థంగా చేసే  పనులు.. మంచి పేరు తెచ్చి పెడతాయని తెలిపారు. కార్యక్రమంలో అడిషనల్​ కలెక్టర్​ అబ్దుల్​ హామీద్, ఆర్డీవో మధుమోహన్, ఏసీపీ కె. దేవేందర్​ రెడ్డి, సీఐలు, ఎస్సైలు ఉన్నారు.

మొక్కల్ని కాపాడడం తెల్వదా?
ఆఫీసర్లపై కలెక్టర్ సీరియస్

రేగొండ, వెలుగు: జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగొండ మండల ఆఫీసర్లపై కలెక్టర్ భవేశ్ మిశ్రా సీరియస్​అయ్యారు. మంగళవారం మండలకేంద్రంలోని జాతీయ రహదారి వెంట నాటిన మొక్కలను కలెక్టర్ పరిశీలించారు. మొక్కలు ఎండిపోవడం, ఎత్తు పెరగకపోవడం పట్ల అసంతృప్తి వ్యక్తం చేశారు. నిర్లక్ష్యంగా డ్యూటీ చేస్తే సస్సెండ్​ చేస్తానని హెచ్చరించారు. ఏపీవో, జీపీ సెక్రటరీకి మెమోలు జారీ చేయాలని ఆఫీసర్లను ఆదేశించారు. మొక్కలు ఎండిపోకుండా తగిన జాగ్రత్తలు పాటించాలని సూచించారు. ఆయన వెంట డీఆర్డీఏ పీడీ పురుషోత్తం, ఎంపీపీ పున్నం లక్ష్మి, ఎంపీవో సురేశ్​కుమార్ తదితరులున్నారు.

యాక్సిడెంట్లను నివారించాలి
స్పీడ్ బ్రేకర్లు, సైన్ బోర్డులు ఏర్పాటు చేయాలి

ములుగు, వెలుగు: ములుగు జిల్లాలో రోడ్ యాక్సిడెంట్లను అరికట్టేందుకు తగిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ కృష్ణ ఆదిత్య సూచించారు. అవసరమైన చోట్ల స్పీడ్ బ్రేకర్లు, సైన్ బోర్డులు ఏర్పాటు చేయాలన్నారు. మంగళవారం కలెక్టరేట్​లో రవాణా శాఖ ఆఫీసర్లతో ఆయన రివ్యూ చేశారు. జాతీయ రహదారిపై నిత్యం రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని, నివారణ చర్యలు చేపట్టాలని ఆదేశించారు.నిర్మాణంలో ఉన్న రోడ్డు పనులు సెప్టెంబర్ నాటికి పూర్తి చేయాలని, ఓవర్ లోడ్ తో వెళ్లే లారీలపై నిఘా పెట్టాలన్నారు. చెక్ పోస్ట్ వద్ద షిఫ్టుల వారీగా సిబ్బందిని నియమించాలన్నారు. రివ్యూలో అడిషనల్ కలెక్టర్ వైవీ గణేశ్, డీఆర్వో కె.రమాదేవి, ఆర్ అండ్ బీ ఈఈ వెంకటేశ్వర్లు తదితరులున్నారు.

పల్లెప్రగతితో గ్రామాల అభివృద్ధి

పర్వతగిరి, వెలుగు: పల్లిప్రగతి కార్యక్రమంతో గ్రామాలు అభివృద్ధి చెందుతున్నాయని వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేశ్ అన్నారు. మంగళవారం వరంగల్ జిల్లా పర్వతగిరి మండలంలో ఆయన విస్తృతంగా పర్యటించారు. ఇస్లావత్ తండా, చెరువుకొమ్ము తండా, ఏబీ తండా, దౌలత్ నగర్ గ్రామాల్లో శ్మశానవాటికలు, విలేజ్ పార్కులు, డంపింగ్ యార్డులు, సీసీ రోడ్లు ప్రారంభించారు. లబ్ధిదారులకు కల్యాణలక్ష్మీ, ఆసరా పెన్షన్ కార్డులు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం గ్రామాల అభివృద్ధే లక్ష్యంగా పనిచేస్తోందన్నారు. ప్రతి నెలా జీపీలకు ప్రత్యేక నిధులు విడుదల చేస్తున్నామన్నారు. పల్లెప్రగతి కార్యక్రమం నిరంతరం కొనసాగుతుందన్నారు. ఇదిలా ఉండగా, ఇస్లావత్ తండా నుంచి ఏబీ తండాకు బైక్ వెళ్తున్న ఎమ్మెల్యేను ధరంసోత్ తండా వాసులు అడ్డుకున్నారు. తమకు రోడ్డు వేయాలని కోరగా.. ఎమ్మెల్యే స్పందించి, నడుచుకుంటూ వెళ్లి వివరాలు తెలుసుకున్నారు. త్వరలోనే రోడ్డు వేయిస్తానని హామీ ఇచ్చారు.

ఓర్వలేకనే బీజేపీపై ఆరోపణలు

ములుగు, వెలుగు: బీజేపీకి వస్తున్న ఆదరణను చూసి, ఓర్వలేకనే మంత్రి సత్యవతి రాథోడ్ పసలేని ఆరోపణలు చేస్తున్నారని బీజేపీ ములుగు జిల్లా అధ్యక్షుడు చింతలపూడి భాస్కర్ రెడ్డి ఆరోపించారు. బండి సంజయ్ పై మంత్రి చేసిన వ్యాఖ్యలకు నిరసనగా మంగళవారం మీడియాతో మాట్లాడారు. పగటి వేషగాళ్లు ఎవరు అనేది ప్రజలకు తెలుసని, రాష్ట్ర అభివృద్ధి కేంద్ర పథకాలతోనే జరుగుతోందని స్పష్టం చేశారు. టీఆర్ఎస్ ప్రభుత్వం ఏపాటి అభివృద్ధి చేసిందో చూపించాలన్నారు. బండి సంజయ్ పై చేసిన వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు.