వరంగల్ జిల్లా సంక్షిప్త వార్తలు

వరంగల్ జిల్లా సంక్షిప్త వార్తలు

వరంగల్, వెలుగు: కార్పొరేషన్ అవినీతిపై సీబీఐ విచారణ చేపట్టాలని కాంగ్రెస్ పార్టీ వరంగల్, హనుమకొండల జిల్లా అధ్యక్షుడు నాయిని రాజేందర్​ రెడ్డి డిమాండ్ చేశారు. గురువారం హనుమకొండలోని ఆయన నివాసంలో మీడియాతో మాట్లాడారు. టీఆర్ఎస్ ఎమ్మెల్యేల అవినీతికి ‘గ్రేటర్ వరంగల్ కార్పొరేషన్’ కేరాఫ్ గా మారిందన్నారు. హర్టికల్చర్ ఆఫీసర్ సునీత నర్సరీ కుంభకోణంలో అధికార పార్టీ ఎమ్మెల్యేల హస్తం ఉందని ఆరోపించారు. బల్దియాలో లేని మనుషుల పేరుతో జీతాలు.. కనిపించని నర్సరీల పేరుతో నిధులు మాయం చేస్తున్నారని విమర్శించారు. గ్రేటర్ అభివృద్ధి కోసం సీఎం కేసీఆర్ చెప్పినట్లు ఏటా రూ.300 కోట్లు ఇవ్వడం లేదని.. ఉన్న కాస్త బడ్జెట్​ను టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు దోచుకు తింటున్నారని ఫైర్ అయ్యారు. లోకల్ ఎమ్మెల్యేలు అవినీతి అధికారులకు అండగా ఉంటూ రూ.20 కోట్ల కుంభకోణానికి పాల్పడ్డారని పేర్కొన్నారు.

దీనిపై ఎంక్వైరీ వేయకుండా వార్నింగులు ఇస్తున్నట్లు చెప్పారు. రైట్ టూ ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద సమాచారమడిగితే అధికార టీఆర్ఎస్ పార్టీ  నేతల బండారం బయటపడుతుందనే భయంతో నెలల తరబడి తాము అడుగుతున్న సమాచారం ఇవ్వడం లేదని మండిపడ్డారు. ఇప్పటికైనా గ్రేటర్ కమిషనర్ విచారణ కమిటీకి చీఫ్ గా ఉండి అవినీతి అధికారుల చిట్టా విప్పాలని కోరారు. కారకులపై కేసులు పెట్టి, నిధులను రికవరీ చేయాలని డిమాండ్ చేశారు. అధికార పార్టీ ఎమ్మెల్యేలు కబ్జాదారులు లేదంటే కాంట్రాక్టుల అవతారం ఎత్తుతున్నారని కామెంట్ చేశారు. వివిధ శాఖల్లో జరుగుతున్న అవినీతిపై జిల్లాకు చెందిన ఇద్దరు మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, సత్యవతి రాథోడ్ కనీసం రివ్యూ నిర్వహించకపోవడాన్ని తప్పు పట్టారు. అవినీతి అధికారులపై చర్యలు తీసుకోకుంటే ఈనెల 20 లోపు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కార్పొరేషన్ ను ముట్టడిస్తామని హెచ్చరించారు. సమావేశంలో కాంగ్రెస్ నేతలు ఇనుగాల వెంకట్రామిరెడ్డి, నమిండ్ల శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.

శానిటేషన్ పక్కాగా చేపట్టాలి

ఏటూరునాగారం, వెలుగు: ఐటీడీఏ ఆశ్రమ పాఠశాలలు, హాస్టల్స్​లో శానిటేషన్​కార్యక్రమాన్ని ప్రతిరోజూ చేపట్టాలని పీవో అంకింత్ ఆదేశించారు. గురువారం ఆయన ములుగు జిల్లా తాడ్వాయి మండలం కొడిశాలలో పర్యటించారు. ఆశ్రమ పాఠశాలను తనిఖీ చేశారు. వంట గదులు, క్లాస్ రూములు పరిశీలించారు. స్టూడెంట్లతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. పిల్లలకు మెనూ ప్రకారం నాణ్యమైన భోజనం పెట్టాలని సూచించారు. పిల్లల ఆరోగ్యం, పరిసరాల పరిశుభ్రతపై దృష్టిపెట్టాలన్నారు. అనంతరం గ్రామంలోని పీహెచ్​సీని విజిట్ చేశారు. మెడిసిన్ వివరాలు, రోజూ వారీ పేషెంట్ల వివరాలు తెలుసుకున్నారు.

హాస్టల్స్ ఫండ్స్ మింగేస్తున్నారా?

ఏటీడీవోపై ఎమ్మెల్యే ఆగ్రహం

గూడూరు, వెలుగు: స్టూడెంట్లకు నాణ్యమైన ఫుడ్ పెట్టాలని ప్రభుత్వం ఇస్తున్న ఫండ్స్ మింగేస్తున్నారా? అంటూ ఎమ్మెల్యే శంకర్ నాయక్ ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువారం గూడూరు మండలకేంద్రంలో ఎంపీపీ సుజాత అధ్యక్షతన జనరల్ బాడీ మీటింగ్ నిర్వహించగా.. చీఫ్ గెస్టుగా ఎమ్మెల్యే హాజరై మాట్లాడారు. మండలంలో హాస్టళ్ల నిర్వహణ సరిగా లేదని ఏటీడీవో భాస్కర్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఐటీడీఏ పరిధిలో నడుస్తున్న హాస్టళ్లు, గురుకులాల్లో ఆఫీసర్లే నిధులు కాజేస్తున్నారని ఆరోపించారు. నాణ్యమైన భోజనం అందక స్టూడెంట్లు అనారోగ్యం పాలవుతున్నారని పేర్కొన్నారు. అన్ని హాస్టళ్లలో మినరల్ వాటర్ ప్లాంటులు ఏర్పాటు చేయాలన్నారు. సీజనల్ వ్యాధుల దృష్ట్యా ఊర్లలో మెడికల్ క్యాంపులు పెట్టాలన్నారు. జడ్పీ కోఆప్షన్ మెంబర్ కాసీం, తహసీల్దార్ అశోక్, ఎంపీడీవో విజయలక్ష్మి, ఎంపీవో ప్రసాద్  ఉన్నారు.

పేదలకు మెరుగైన వైద్యం అందించాలి

స్టేషన్ ఘన్ పూర్, వెలుగు: ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చే పేదలకు మెరుగైన వైద్యం అందించాలని డీసీహెచ్​ఎస్ డా.సుగుణాకర్ రాజు కోరారు. గురువారం డీఎంహెచ్ వో మహేందర్ తో కలిసి ఆయన స్టేషన్​ఘన్​పూర్ క్లస్టర్ హాస్పిటల్ ను తనిఖీ చేశారు. హాస్పిటల్​లోని వార్డులు, ల్యాబ్​లు, ఫార్మసీ విభాగాన్ని చెక్ చేశారు. పేషెంట్లకు అందుతున్న సౌకర్యాలపై ఆరా తీశారు. పేషెంట్లకు మెనూ ప్రకారం భోజనం పెట్టాలన్నారు. వజ్రోత్సవాల్లో భాగంగా ఈ ఆసుపత్రిలో ఈ నెల 17న నియోజకవర్గ స్థాయిలో బ్లడ్ డొనేషన్ క్యాంప్ నిర్వహిస్తున్నట్లు చెప్పారు. అలాగే 19న పేషెంట్లకు భోజనం, స్వీట్లు పంపిణీ చేయనున్నట్లు వివరించారు. కార్యక్రమంలో డిప్యూటీ డీఎంహెచ్​వో సుధీర్​కుమార్, మెడికల్​ ఆఫీసర్లు డా.రవి రాథోడ్, డా.శ్రీవాణి, సీహెచ్​వో సాంబయ్య ఉన్నారు.

బైండోవర్ ఉల్లంఘించిన వ్యక్తికి రూ.లక్ష ఫైన్ 

నర్సింహులపేట, వెలుగు: మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేట మండలం బొడ్డి తండాకు చెందిన గుగులోతు బాలు బైండోవర్ ఉల్లంఘించినందుకు గాను ఆఫీసర్లు రూ.లక్ష ఫైన్ విధించారు. బాలు గతంలో నల్లబెల్లం, నాటు సారా విక్రయిస్తూ పట్టుబడ్డగా తహసీల్దార్ ముందు బైండోవర్ చేశారు. మళ్లీ అదే వ్యాపారం చేస్తుండగా ఎక్సైజ్ ఆఫీసర్లు పట్టుకుని, రూ.లక్ష ఫైన్ విధిస్తూ నోటీసు జారీ చేశారు.

సీసీ రోడ్లకు రిపేర్లు చేపట్టాలి

పరకాల, వెలుగు: పరకాల పట్టణంలో మిషన్​ భగీరథ పనుల వల్ల సీసీ రోడ్లు, సైడ్ డ్రైన్లు ధ్వంసం అయ్యాయని, వెంటనే వాటికి రిపేర్లు చేపట్టాలని బీజేపీ కౌన్సిలర్ ఆర్పీ జయంత్ లాల్ కోరారు. ఈమేరకు గురువారం కమిషనర్ శేషుకు వినతిపత్రం సమర్పించారు. తన వార్డులో భగీరథ పైప్​లైన్ల కోసం చాలాచోట్ల రోడ్లు, డ్రైనేజీలు తవ్వారని, వాటిని అలాగే వదిలేయడం వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. రిపేర్లు చేయకుంటే ఆందోళన  చేస్తామని తెలిపారు.

ఘనంగా తీజ్ వేడుకలు

వర్ధన్నపేట, రాయపర్తి, వెలుగు: వరంగల్ జిల్లాలోని వర్ధన్నపేట, రాయపర్తి మండలాల్లో గురువారం తీజ్ ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. గిరిజనులు సంప్రదాయం ప్రకారం.. తమ ఆరాధ్య దేవతలకు, దేవుళ్లకు ప్రత్యేక పూజలు చేశారు. పాడి, పంటలు సమృద్ధిగా పండాలని కోరుకున్నారు. వర్ధన్నపేటలో జరిగిన తీజ్ వేడుకల్లో ఎమ్మెల్యే అరూరి రమేశ్ పాల్గొని, గిరిజనులతో కలిసి డాన్స్ చేశారు.

పని దొరకక కూలీ ఆత్మహత్య 

మొగుళ్లపల్లి, వెలుగు: ఆర్థిక ఇబ్బందులతో ఓ వ్యక్తి సూసైడ్ చేసుకున్న సంఘటన జయశంకర్​భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండలకేంద్రంలో జరిగింది. ఎస్సై శ్రీధర్ వివరాల ప్రకారం.. మొగుళ్లపల్లి శివారు ఆరెపల్లికి చెందిన ఎరబాటి మల్లయ్య(45) అనే వ్యక్తి, కూలి పనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. కొద్దిరోజులుగా పని దొరక్కపోవడంతో అప్పులయ్యాయి. కుటుంబ పోషణ కూడా భారంగా మారింది. దీంతో జీవితంపై విరక్తి చెంది, పాయిజన్ తాగాడు. అతన్ని వరంగల్ ఎంజీఎంకు తరలించగా.. చికిత్స పొందుతూ గురువారం చనిపోయాడు. దీంతో ఆ కుటుంబంలో విషాదం నెలకొంది.

డ్యూటీకి రాని టీచర్ సన్పెన్షన్

నర్సింహులపేట, వెలుగు: మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేట మండలం మధు తండా ప్రైమరీ స్కూల్​లో డ్యూటీకి రాని టీచర్ పై సస్పెన్షన్ వేటు పడింది. స్కూల్​కు చెందిన టీచర్ శ్రీకాంత్ తరచూ విధులకు డుమ్మా కొడుతున్నాడు. ఆఫీసర్లు ప్రశ్నిస్తే పొంతన లేని సమాధానాలు చెప్తున్నాడు. గతంలోనూ అతనికి మెమోలు జారీ చేసినా, తీరు మారలేదు. దీంతో ఎంఈవో గుగులోతు రాము, శ్రీకాంత్​ను సస్పెండ్ చేశాడు.