ఆర్టీసీ బిల్లును గవర్నర్ కావాలనే ఆపుతున్నరు: కూనంనేని

ఆర్టీసీ బిల్లును గవర్నర్ కావాలనే ఆపుతున్నరు: కూనంనేని

హైదరాబాద్, వెలుగు: ఆర్టీసీ ఉద్యోగులను రాష్ట్ర ప్రభుత్వంలో విలీనం చేస్తూ అసెంబ్లీ, మండలి ఆమోదించిన బిల్లుపై సంతకం పెట్టకుండా గవర్నర్ తమిళిసై కావాలనే ఆలస్యం చేస్తున్నట్లు అనిపిస్తోందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివ రావు ఆరోపించారు. ఇటీవల పార్లమెంట్‌‌లో ఆమోదించిన పలు బిల్లులకు ఇప్పటికే రాష్ట్రపతి సంతకాలు చేశారని, అవి చట్ట రూపం కూడా దాల్చాయని గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. 
అంతకుముందే అసెంబ్లీలో ఆమోదం పొందిన బిల్లులపై సంతకాలు పెట్టకపోవడం వెనుక రాజకీయ కారణాలు ఉన్నట్టు తెలుస్తోందన్నారు. దీంతో సుమారు 43 వేల మందికి పైగా ఆర్టీసీ ఉద్యోగులు, కార్మికుల కుటుంబాలు ఆందోళనకు గురవుతున్నాయని చెప్పారు. గవర్నర్ కోటాలో నామినేటెడ్ ఎమ్మెల్సీ స్థానాల కోసం రాష్ట్ర కేబినేట్ ఆమోదం తెలిపి పంపిన ఫైల్‌‌ను కూడా ఆమె పక్కన పెట్టడం సరికాదన్నారు.