- సీఎం రేవంత్ పాలనపై దృష్టి పెట్టాలి
- సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు
వరంగల్, వెలుగు: హైదరాబాద్లో హైడ్రా మిస్ ఫైర్ అయినట్లు కనిపిస్తోందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అన్నారు. ఎన్ కన్వెన్షన్ వంటి బడా బాబుల ఆక్రమణలు కూల్చినప్పుడు ప్రజామోదం లభించిందని, కానీ.. పేదల ఇండ్లు కూల్చాక అభిప్రాయం మారిందన్నారు.
హనుమకొండ బాలసముద్రంలోని సీపీఐ జిల్లా ఆఫీసులో మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. హైదరాబాద్ కే హైడ్రాను పరిమితం చేయాలని, జిల్లాలకు విస్తరించొద్దని పేర్కొన్నారు. హైడ్రాపై రాష్ట్ర ప్రభుత్వం తన వైఖరేంటో స్పష్టం చేయాలన్నారు. రాష్ట్రంలో ఎన్ని చెరువులు, కుంటలు ఉన్నాయో.. ఆక్రమణలు ఎక్కడ జరిగాయో శ్వేతపత్రం ప్రకటించాలన్నారు.
సీఎం రేవంత్ రెడ్డి పాలనపై దృష్టి పెట్టాలన్నారు. పేదలకు జీవో 58,59 ప్రకారం ఇండ్లు క్రమబద్ధీకరించాలని ఆయన డిమాండ్ చేశారు. హైడ్రా కూల్చివేతలపై బీఆర్ఎస్, బీజేపీ మాటలు దెయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉన్నాయని ఎద్దేవా చేశారు.
బీజేపీ నేతలపై ఈడీ, ఐటీ దాడులు ఎందుకు జరగట్లేదని ప్రశ్నించారు. పార్టీ రాష్ట్ర సహాయ కార్యదర్శి తక్కళ్లపల్లి శ్రీనివాసరావు, కార్యవర్గ సభ్యురాలు నేదునూరి జ్యోతి, జిల్లా కార్యదర్శి కర్రె భిక్షపతి, జిల్లా మాజీ కార్యదర్శి కర్ణాకర్ తదితరులు పాల్గొన్నారు.