- సీపీఐ(ఎం) రౌండ్‌టేబుల్ సమావేశంలో వక్తలు
హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర బడ్జెట్‌లో విద్య, వైద్య రంగాలకు అత్యధిక ప్రాధాన్యతనిచ్చి నిధుల కేటాయింపును మరింత పెంచాలని ప్రభుత్వాన్ని పలువురు మేధావులు, వామపక్ష నేతలు డిమాండ్ చేశారు. శనివారం హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ అధ్యక్షతన ‘బడ్జెట్ - కేటాయింపులు’ అనే అంశంపై రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది.
ఈ సందర్భంగా ఆర్థిక విశ్లేషకులు ప్రొఫెసర్ పాపారావు మాట్లాడుతూ..కేంద్ర ప్రభుత్వం సెస్‌లు, సర్ ఛార్జీల రూపంలో ట్యాక్స్ వసూళ్లు చేస్తూ రాష్ట్రాల వాటాను దెబ్బతీస్తోందని విమర్శించారు. ఎన్డీయే ప్రభుత్వం 'డబుల్ ఇంజిన్ సర్కార్' ఉంటేనే నిధులు ఇస్తామన్నట్లుగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. గత పదేండ్లలో కేసీఆర్ సర్కార్ రూ. 6 లక్షల కోట్లు అప్పు చేస్తే.. కాంగ్రెస్ ప్రభుత్వం కేవలం రెండేండ్లలోనే రూ. 3.49 లక్షల కోట్లు అప్పు చేసిందని వివరించారు.
ఆరు గ్యారంటీలకు చట్టబద్ధత కల్పించలేని స్థితిలో ప్రభుత్వం ఉందని ఆరోపించారు. ప్రొఫెసర్ హరగోపాల్ మాట్లాడుతూ..స్వీడన్ వంటి దేశాల్లో ధనికులపై 60 శాతం పన్ను వేసి విద్య, వైద్యం ఉచితంగా ఇస్తున్నారని తెలిపారు. మన దగ్గర పేదలకు, ధనికులకు ఒకేలా 30 శాతం పన్ను ఉండటం అన్యాయమన్నారు. బడ్జెట్ అనేది సామాజిక మార్పుకు ఆయుధంగా ఉండాలని చెప్పారు. టీజేఎస్ అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం మాట్లాడుతూ...ఉపాధి హామీ, సర్వశిక్షా అభియాన్ వంటి పథకాల్లో కేంద్రం కోతలు పెడుతోందని, దీనివల్ల రాష్ట్రాలపై భారం పెరుగుతోందని తెలిపారు.
బడ్జెట్‌లో ఎక్కువ భాగం అప్పులు, వడ్డీలకే పోతే సంక్షేమం ఎలా సాధ్యమని జాన్‌వెస్లీ ప్రశ్నించారు. ఇందిరమ్మ ఇండ్లు, కొత్త రేషన్ కార్డులకు కేటాయించిన నిధులు ఏమాత్రం సరిపోవని, దళిత సంక్షేమం, సాగునీటి రంగాలను ప్రభుత్వం విస్మరించిందని విమర్శించారు. కార్యక్రమంలో రైతు సంఘం నేత సారంపల్లి మల్లారెడ్డి, సాగర్, భూపాల్, అరుణజ్యోతి తదితరులు పాల్గొన్నారు.
