కమ్యూనిస్టు కాలనీల్లో .. బీఆర్ఎస్​కు ఎర్రజెండే!

కమ్యూనిస్టు కాలనీల్లో .. బీఆర్ఎస్​కు ఎర్రజెండే!
  • సర్కారు ‘డబుల్’​ ఇండ్లు ఇవ్వకపోవడంతో రెండేండ్లుగా లెఫ్ట్​ పార్టీల​ భూపోరాటాలు
  • వివిధ జిల్లాల్లో వెలసిన వందల కాలనీలు.. 
  • ఒక్క పిలుపుకే వేలాదిగా తరలివస్తున్న పేదలు
  • అసంఘటిత రంగ కార్మికుల తరపునా ఉద్యమాలు
  • సింగరేణిలోని 9 నియోజకవర్గాల్లో    గెలుపోటములను శాసించే స్థితిలో కామ్రేడ్స్​
  • ఇన్నాళ్లూ ఈ ఓట్లన్నీ తమవేనని సంబరపడ్డ బీఆర్ఎస్​ నేతలు
  • హైకమాండ్‍ తీరుతో ఆశలు ఆవిరి 

వరంగల్‍, వెలుగు:  బీఆర్‍ఎస్‍ అభ్యర్థులకు ఎర్రజెండాల టెన్షన్‍ పట్టుకున్నది. మునుగోడు ఎన్నికల్లో కామ్రేడ్​ల మద్దతుతో గట్టెక్కిన గులాబీ పార్టీ నేతలు ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లోనూ పొత్తులుంటాయని, దీంతో ఆయా  నియోజకవర్గాల్లో తమ గెలుపును ఎవరూ ఆపలేరని భావించారు. తీరా కేసీఆర్​ వైఖరి వల్ల పొత్తు చిత్తు కావడం, కమ్యూనిస్టులు కాస్తా కాంగ్రెస్​కు దగ్గరవుతుండడంతో గులాబీ క్యాండిడేట్లు ఆందోళన చెందుతున్నారు.2018 ఎన్నికలకు ముందు నామమాత్రంగా ఉన్న కమ్యూనిస్టులు ఐదేండ్లలో రాష్ట్ర సర్కారు​ తీరువల్లే పుంజుకున్నారు. పేదలకు డబుల్​బెడ్​రూం ఇండ్లు ఇవ్వకపోవడంతో ఇదే అదనుగా కమ్యూనిస్టులు భూపోరాటం చేసి లక్షలాది పేదలను సమీకరించారు. కాంట్రాక్ట్​, ఔట్​సోర్సింగ్​కార్మికులకు ఇచ్చిన హామీల అమలుకోసం కామ్రేడ్స్​ కదన రంగంలోకి దూకారు. అసంఘటిత రంగ కార్మికుల ఉద్యమాలకూ నాయకత్వం వహించారు. ఇలా గడిచిన రెండేండ్లలో కమ్యూనిస్టులకు మద్దతు పెరుగుతూ వచ్చినా, చివరికి ఆ ఓటు బ్యాంకు తమ ఖాతాలోనే పడ్తుందని బీఆర్ఎస్​ నేతలు ఆశించగా, చివరికి ఉల్టా అయ్యింది. 

వందల్లో కమ్యూనిస్టు కాలనీలు..

రాష్ట్రంలో కమ్యూనిస్టు పార్టీల బలాబలాల సంగతి ఎలా ఉన్నా ఎర్రజెండా పోరాటాలను తక్కువగా అంచనా వేయలేని పరిస్థితి. గడిచిన నాలుగేండ్లలో రూలింగ్​ పార్టీ తీరువల్ల క్షేత్రస్థాయిలో కమ్యూనిస్టులు వివిధ వర్గాల్లో పట్టు సాధించారని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా మెజార్టీ జిల్లాలు, 
నియోజకవర్గాల్లో సీపీఐ, సీపీఎం పోరాటాల ఫలితంగా వెలిసిన  వందలాది కాలనీలు చాలా ఏండ్ల నుంచి ఉన్నాయి. దీనికితోడు కేసీఆర్​ ప్రభుత్వం ఇచ్చిన హామీ ప్రకారం పేదలకు డబుల్‍ బెడ్‍రూం ఇండ్లు నిర్మించి ఇవ్వకపోవడంతో ఏడాది, ఏడాదిన్నరగా కమ్యూనిస్టుల ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా వందలాది కొత్త కాలనీలు వెలిశాయి. ముఖ్యంగా ఉమ్మడి వరంగల్​, నల్గొండ, ఖమ్మంలాంటి జిల్లాల్లో ప్రభుత్వ భూములు, చెరువులను ఆక్రమించి వేలాది మంది గుడిసెలు వేసుకున్నారు. రాష్ట్రంలో సుమారు 10 లక్షల కుటుంబాలకు ఇండ్లు లేవని భావిస్తుండగా, అందులో ఏం తక్కువ 5 లక్షల  మంది ఈ భూపోరాటాల్లో పాల్గొన్నట్లు కమ్యూనిస్టులు చెప్తున్నారు.  వీరంతా ఎర్రజెండా పార్టీల నేతల ఆధ్వర్యంలో ముందుకు సాగుతున్నారు.  ఇక అసంఘటిత రంగ కార్మికుల విషయంలో సర్కారు అవలంభించిన విధానం వల్ల రాష్ట్రవ్యాప్తంగా కమ్యూనిస్టులు ఆయా వర్గాల్లో పట్టు సాధించారు. ముఖ్యంగా పంచాయతీ, మున్సిపల్​ కార్మికులు, అంగన్​వాడీలు ఆశా వర్కర్లు, ఇతరత్రా కాంట్రాక్ట్​, ఔట్​సోర్సింగ్​ఉద్యోగుల హక్కుల కోసం ముందుండి పోరాడారు. కమ్యూనిస్టులతో పొత్తులు ఖాయమైతే ఆయా వర్గాలు బీఆర్ఎస్​కు ఔట్​రైట్​గా మద్దతు పలికేవి. ఇప్పుడా పరిస్థితి లేదంటున్నారు. 

సింగరేణి పరిధిలోని నియోజకవర్గాలపైనా ఎఫెక్ట్​

సింగరేణి విస్తరించిన మంచిర్యాల, కుమ్రంభీం ఆసిఫాబాద్​, పెద్దపల్లి, జయశంకర్​ భూపాలపల్లి, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాల్లో లెఫ్ట్​ పార్టీలకు బలమైన కేడర్​ ఉంది. ఈ జిల్లాల పరిధిలో 43వేల మంది కార్మిక కుటుంబాల్లో సుమారు 2లక్షల మంది ఓటర్లు ఉంటారు.  30వేల మంది కాంట్రాక్ట్​ కార్మికులు, 50వేల మంది రిటైర్డు ఉద్యోగుల కుటుంబాలను కలుపుకుంటే 5లక్షల మంది వరకు ఓటర్లుంటారు. ఈ  కార్మికుల మద్దతుతో సీపీఐ అనుబంధ ఏఐటీయూసీ బలమైన యూనియన్​గా కొనసాగుతోంది. మంచిర్యాల, చెన్నూరు, బెల్లంపల్లి, రామగుండం, భూపాలపల్లి, కొత్తగూడెం, సత్తుపల్లి, ఇల్లెందు, పినపాక నియోజకవర్గాల్లో కమ్యూనిస్టులు గెలుపోటములను శాసించగలిగే స్థితిలో ఉన్నారు. కమ్యూనిస్టులతో పొత్తుల కారణంగా 2018 ఎన్నికల్లో భూపాలపల్లి, భద్రాచలం, పినపాక, ఇల్లందు, కొత్తగూడెం, ఆసిఫాబాద్​ అసెంబ్లీ సెగ్మెంట్లలో కాంగ్రెస్​ గెలిచింది. రామగుండం​లో ఏఐబీఎఫ్​ అభ్యర్థి, సత్తుపల్లిలో టీడీపీ అభ్యర్థి గెలుపొందారు. మంచిర్యాల, చెన్నూరు, బెల్లంపల్లి  నియోజకవర్గాల్లో మాత్రం బీఆర్​ఎస్​ విజయం సాధించింది. ఈసారి కమ్యూనిస్టులతో పొత్తు పెట్టుకుంటే 9 నియోజకవర్గాల్లో తమ గెలుపును ఎవరూ ఆపలేరని బీఆర్ఎస్​అభ్యర్థులు ఆశించారు. కానీ పొత్తు కుదరకపోవడంతో ఆందోళన చెందుతున్నారు.  

హైదరాబాద్‍ తర్వాత అంతే పెద్ద సిటీగా భావించే గ్రేటర్‍ వరంగల్​లో వరంగల్‍ తూర్పు, వరంగల్‍ పశ్చిమ, వర్ధన్నపేట నియోజకవర్గాల్లో పాతవి, కొత్తవి కలిపి దాదాపు 100కు పైగా కమ్యూనిస్ట్ కాలనీలు ఉన్నాయి. ఇందులో ఒక్కో కాలనీలో కనిష్ఠంగా 250,  గరిష్ఠంగా వెయ్యి నుంచి 1200 గుడిసెలు ఉన్నాయి. ఏ లెక్కనచూసినా 50వేలకుపైగా ఓటర్లు ఉంటారు. కమ్యూనిస్టులతో ఎలాగూ పొత్తులు ఉంటాయనే ఆలోచనతో ఇన్నిరోజులు సిట్టింగ్‍ ఎమ్మెల్యేలు వీళ్లను తమ ఓటు బ్యాంకుగా భావించారు. కానీ సీఎం కేసీఆర్‍ కామ్రేడ్లను దూరం పెట్టడంతో ఈ ఓట్లు ఎక్కడ చేజారిపోతాయోనని బీఆర్ఎస్​క్యాండేట్లు ఆందోళన చెందుతున్నారు.