కౌలు రైతులకు వానాకాలం నుంచే రైతు భరోసా ఇవ్వాలి

కౌలు రైతులకు వానాకాలం నుంచే రైతు భరోసా ఇవ్వాలి
  • సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గం డిమాండ్ 

హైదరాబాద్, వెలుగు: ఇచ్చిన హామీ ప్రకారం కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ప్రభుత్వం కౌలు రైతులకు ఈ వానాకాలం నుంచే రైతు భరోసా అమలు చేయాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గం డిమాండ్ చేసింది. సోమవారం ఎంబీభవన్​లో సీపీఎం నేత జ్యోతి అధ్యక్షతన రాష్ట్ర కార్యదర్శివర్గ సమావేశం జరిగింది. రాష్ట్రంలో 20 లక్షలకు పైగా కౌలురైతులు 30 శాతానికి పైగా వ్యవసాయం చేస్తున్నారని నేతలు చెప్పారు.

రైతుల ఆత్మహత్యల్లో సగం మంది కౌలు రైతులేనని గుర్తుచేశారు. గత రెండేండ్లుగా  రాష్ట్రంలో పంటల బీమా సౌకర్యం లేదని, ప్రీమియం మొత్తం సర్కారే చెల్లించే విధంగా పంటల బీమా అమలు చేయాలని కోరారు. గతంలో ఇచ్చిన హామీ ప్రకారం.. రూ.2లక్షల వరకు రుణాన్ని ఏకకాలంలో మాఫీ చేయాలన్నారు. రుణమాఫీ వెంటనే అమలు చేయగలిగితే వానాకాలం సాగు పెట్టుబడికి రైతులకు ఉపయోగం జరుగుతుందని, లేకపోతే రైతులు ప్రైవేట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వ్యాపారుల దగ్గర అధిక వడ్డీలకు అప్పులు తెచ్చుకోవాల్సి వస్తుందని చెప్పారు.

స్టూడెంట్లకు రావాల్సిన ఫీజు రీయింబర్స్ మెంట్ బకాయిలను వెంటనే రిలీజ్ చేయాలని, ఎంప్లాయీస్​కు రావాల్సిన సప్లిమెంటరీ బిల్లులు, గ్రాట్యూటీ, జీపీఎఫ్, సరెండర్ లీవ్స్ తదితర వాటి బిల్లులను రిలీజ్ చేయాలని కోరారు. సమావేశంలో సీపీఎం పోలిట్ బ్యూరో సభ్యులు ఏ.విజయరాఘవన్, బీవీ రాఘవులు, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, వీరయ్య తదితరులు పాల్గొన్నారు.