కమ్యూనిస్టులు ఖాతా తెరిచేనా?

కమ్యూనిస్టులు ఖాతా తెరిచేనా?

హైదరాబాద్, వెలుగు :  గత అసెంబ్లీ ఎన్నికల్లో ఒక్క సీటూ గెలవని కమ్యూనిస్టులు.. ఈ ఎన్నికల్లోనైనా ఖాతా తెరుస్తారా? లేదా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈసారి కూడా సీపీఎం, సీపీఐ వేర్వేరుగా పోటీ చేశాయి. కాంగ్రెస్​తో కలిసి కొత్తగూడెంలో సీపీఐ పోటీ చేయగా, సీపీఎం ఒంటరిగా బరిలో నిలిచింది. రాష్ట్రంలో ఉమ్మడి ఖమ్మం, నల్గొండ జిల్లాల్లో కమ్యూనిస్టులకు కొంత పట్టు ఉంది. మునుగోడు ఉప ఎన్నికలో సీపీఎం, సీపీఐ మద్దతుతో బీఆర్​ఎస్​ విజయం సాధించింది. దీంతో అసెంబ్లీ ఎన్నికల్లోనూ కలిసే పోటీ చేస్తారని అంతా భావించారు. కానీ, చివరి నిమిషంలో కేసీఆర్​.. ఈ రెండు పార్టీలకు హ్యాండ్ ఇచ్చి, అభ్యర్థులను ప్రకటించారు. 

ఈ క్రమంలో కాంగ్రెస్​ ఆ రెండు పార్టీలతో చర్చలు జరిపింది. ఈ చర్చల్లో కొత్తగూడెం సీటుతో పాటు రెండు ఎమ్మెల్సీ స్థానాలను ఇస్తామనే కాంగ్రెస్ ప్రతిపాదనకు సీపీఐ అంగీకరించింది. సీపీఎం మాత్రం పొత్తుల చర్చలు వికటించడంతో 19 స్థానాల్లో పోటీ చేసింది. అయితే, కొత్తగూడెంలో కాంగ్రెస్​తో కలిసి పోటీ చేస్తున్న సీపీఐ గెలిచే అవకాశాలున్నట్టు తెలుస్తోంది. కానీ, ఆ స్థానంలో మాజీ ఎమ్మెల్యే జలగం వెంకట్ రావు ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ నుంచి గట్టిపోటీ ఇస్తున్నారు. మరోపక్క సీపీఎం పోటీ చేస్తున్న 19 స్థానాల్లో ఎక్కడా గెలిచే అవకాశాలు కనిపించడం లేదు. 

కానీ, భద్రాచలం, పాలేరు, మధిర, మిర్యాలగూడ, ఇబ్రహీంపట్నం స్థానాల్లో పదివేల వరకు ఓట్లు సాధించే అవకాశముందని ఆ పార్టీ వర్గాలు చెప్తున్నాయి. ఈ క్రమంలో ఆయా స్థానాల్లో పోటీ చేస్తున్న ఇతర పార్టీల అభ్యర్థుల్లో సీపీఎం ఎవరి ఓట్లను చీల్చుతుందనే ఆందోళన మొదలైంది. కాగా, 2014 ఎన్నికల్లో దేవరకొండ నియోజకవర్గంలో సీపీఐ నుంచి రవీంద్రకుమార్ విజయం సాధించగా, భద్రాచలం నుంచి సీపీఎం నేత సున్నం రాజయ్య గెలుపొందారు.