కాల్పుల విరమణలో మధ్యవర్తిత్వం అనవసరం : ఎంఏ బేబీ

కాల్పుల విరమణలో మధ్యవర్తిత్వం అనవసరం : ఎంఏ బేబీ
  • ఉగ్రవాదాన్ని కేంద్రం అణచివేయాలి
  • ఆపరేషన్ సిందూర్ వాస్తవాలను ప్రజలకు వివరించాలని డిమాండ్
  • నేడు, రేపు రాష్ట్ర కమిటీ మీటింగులు

హైదరాబాద్, వెలుగు: పాకిస్తాన్​తో కాల్పుల విరమణలో మూడో దేశం మధ్యవర్తిత్వం అనవసరం అని సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి ఎంఏ బేబీ అన్నారు. ఇండియా, పాకిస్తాన్ సీజ్ ఫైర్​పై అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌‌ ప్రకటన చేయడం సరికాదని తెలిపారు. ఉగ్రవాదాన్ని అణిచివేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆయన కోరారు. పహల్గాం ఉగ్రదాడి, ఆపరేషన్ సిందూర్ అంశాలపై వాస్తవాలను ప్రజలకు వివరించేందుకు పార్లమెంట్ స్పెషల్ సెషన్ ఏర్పాటు చేయాలన్నారు. హైదరాబాద్​లోని ఎంబీ భవన్ లో బుధవారం సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సమావేశం జరిగింది. గురు, శుక్రవారాల్లో రాష్ట్ర కమిటీ సమావేశాలు నిర్వహించనున్నారు. 

సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఎంపికైన తర్వాత తొలిసారిగా రాష్ట్రానికి వచ్చిన ఎంఏ బేబీకి పార్టీ శ్రేణులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. ‘‘వామపక్ష, ప్రజాతంత్ర పార్టీలు, సామాజిక శక్తులను ఏకం చేస్తాం. పార్టీ బలోపేతంపై దృష్టిపెడ్తాం. అంతర్జాతీయ స్థాయి వేదికల్లో పాకిస్తాన్​పై ఒత్తిడి పెంచేలా కేంద్ర ప్రభుత్వం వ్యవహరించాలి. కాల్పుల విరమణ ప్రకటనను అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. రెండు దేశాల మధ్య మూడో దేశం జోక్యం ఉండొద్దు. ఆపరేషన్ సిందూర్ అమలవుతున్న టైమ్​లో మత కలహాలు రెచ్చగొట్టేలా కొన్ని మీడియా సంస్థలు వ్యవహరించాయి. 

ప్రజలంతా ఐక్యంగా ఉండాల్సిన సమయంలో ఇలాంటి వార్తలు ప్రసారం చేయడం సరికాదు. పార్లమెంట్ ప్రత్యేక సెషన్ ఏర్పాటుపై మోదీ వెంటనే తేదీలను ప్రకటించాలి. ఎంపీలు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వంపై ఉంది’’అని ఎంఏ బేబీ అన్నారు. బీహార్ ఎన్నికల్లో కలిసి పోటీ చేసేందుకు ఆర్జేడీతో సంప్రదింపులు జరుపుతున్నామని తెలిపారు. వచ్చే ఏడాది అస్సాం, కేరళ, తమిళనాడు, వెస్ట్​బెంగాల్​లో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయని, కేరళలో మళ్లీ ఎల్డీఎఫ్ సర్కార్ అధికారంలోకి వస్తుందని వివరించారు.

కేంద్రం చర్చలు జరపాలి: బీవీ రాఘవులు

ఆపరేషన్ సిందూర్ తాత్కాలికంగా ముగిసిందని, ఇదే సమయంలో ఆపరేషన్ కగార్ ను కూడా కేంద్రం ఆపేసిందని సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు అన్నారు. ఇది మంచి పరిణామమని తెలిపారు. చర్చలకు సిద్ధమంటూ మావోయిస్టులు ప్రకటించారని, కేంద్ర ప్రభుత్వం షరతుల్లేకుండా మావోయిస్టులతో చర్చలు జరపాలని డిమాండ్ చేశారు.