విదేశీ పత్తి దిగుమతితో రైతులకు నష్టం : సీపీఎం స్టేట్‌ సెక్రటరీ జాన్‌ వెస్లీ

విదేశీ పత్తి దిగుమతితో రైతులకు నష్టం : సీపీఎం స్టేట్‌ సెక్రటరీ జాన్‌ వెస్లీ

భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : కేంద్ర ప్రభుత్వం విదేశీ పత్తిని దిగుమతి చేయండ వల్లే రాష్ట్రంలో రైతులు నష్టపోతున్నారని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్‌ వెస్లీ విమర్శించారు. కొత్తగూడెంలోని మంచికంటి భవన్‌లో బుధవారం మీడియాతో మాట్లాడారు. పత్తికి మద్దతు ధర ఇవ్వడంలో విఫలమైన ప్రభుత్వం తేమ శాతం కోతలు విధిస్తూ రైతులను నిండా ముంచుతుందని మండిపడ్డారు. యాప్‌లో తప్పనిసరిగా రిజిస్ట్రేషన్‌ చేసుకోవాలని చెప్పడం, ఏడు క్వింటాళ్ల పత్తిని మాత్రమే కొంటామనడం అన్యాయమన్నారు.

 ఎక్కువగా పండిన పంటను ఏం చేయాలో పాలకులే చెప్పాలని డిమాండ్‌ చేశారు. ఇటీవల కురిసిన వర్షాలతో పత్తిలో తేమ శాతం పెరిగిందని, తడిసిన పత్తిని ప్రభుత్వమే కొనాలన్నారు. నిరుద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లకు అడ్డు పడ్తున్నది బీజేపీయేనని ఆరోపించారు. రెండు రాష్ట్రాల మధ్య నీటి వాటాలు తేలే వరకు బనకచర్లకు అనుమతులు ఇవ్వొద్దని కోరారు. సమావేశంలో నాయకులు పోతినేని సుదర్శన్​, మచ్చా వెంకటేశ్వర్లు, అన్నవరపు కనకయ్య, లిక్కి బాలరాజు, అన్నవరపు సత్యనారాయణ పాల్గొన్నారు.