ప్రధాని మోడీ రాకను వ్యతిరేకిస్తున్నం:తమ్మినేని వీరభద్రం

ప్రధాని మోడీ రాకను వ్యతిరేకిస్తున్నం:తమ్మినేని వీరభద్రం

బ్రిటీష్ కాలంనాటి గవర్నర్ వ్యవస్థను రద్దు చేయాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం డిమాండ్ చేశారు.  తెలంగాణలో కాషాయ రాజకీయాలు ప్రవేశపెట్టడానికి మునుగోడు ఉప ఎన్నికను బీజేపీ తీసుకొచ్చిందని ఆరోపించారు. రాష్ట్రంలో రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయం కాంగ్రెస్ కాదని..బీజేపీ అని మునుగోడు ఉప ఎన్నిక ద్వారా చెప్పే ప్రయత్నం చేసిందన్నారు. దక్షిణ తెలంగాణ లో బలహీనంగా ఉన్న బీజేపీ పార్టీని బలపర్చడానికి జరిగిన కుట్ర అని ఆరోపించారు. 

ఎస్సీ ఎస్టీ,బీసీ, మైనారిటీ లకు బీజేపీ వ్యతిరేకమని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం తెలిపారు. కుల వివక్షకు వ్యతిరేకంగా ఒక్క బీజేపీ నాయకుడైనా మాట్లాడగలరా అని ప్రశ్నించారు. ప్రజాస్వామ్యబద్దంగా ఎన్నుకోబడిన రాష్ట్రాల్లో ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి ప్రభుత్వాలను పడగొట్టడానికి ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. అదానీ, అంబానీల కోసమే ప్రధాని మోడీ, అమిత్ షా పనిచేస్తున్నారని విమర్శించారు. బీజేపీ అగడాలను సమర్థవంతంగా ఎదుర్కొంటామని తెలిపారు. ఏడాది నుంచి నడుస్తున్న రామగుండం ఎరువుల ఫ్యాక్టరీని రీ ఓపెన్ చేయడానికి ప్రధాని మోడీ తెలంగాణకు రావడం వెనుక ఉన్న ఆంతర్యం ఏంటో ప్రజలకు సమాధానం చెప్పాలన్నారు. మోడీ రాకను సీపీఎం తీవ్రంగా వ్యతిరేకిస్తుందన్నారు.