కాంగ్రెస్ వస్తే సీపీఎస్ రద్దు: ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి

కాంగ్రెస్ వస్తే  సీపీఎస్ రద్దు: ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి

హైదరాబాద్, వెలుగు ఉద్యోగుల కుటుంబాలకు శాపంగా మారిన కొత్త పింఛన్ విధానం (సీపీఎస్​)రద్దు చేసి పాత పిం ఛన్ విధానాన్ని పునరుద్ధరించాలని ఉపాధ్యా సం ఘాల పోరాట కమిటీ (యూఎస్​పీసీ) సర్కారును డిమాండ్ చేసింది. అలాగే రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 20వేల టీచర్ పోస్టును భర్తీ చేయాలని, జులై ఒకటో తేదీ నుంచి ఐఆర్ ప్రకటించాలంది. శుక్రవారం ఇందిరాపార్కు వద్ద సీపీఎస్​ రద్దు, టీచర్ల సమస్యల పరిష్కారం కోరుతూ యూఎస్​పీసీ ఆధ్వర్యంలో మహాధర్నా నిర్వహించారు. ఈ ధర్నాకు టీజేఎస్ చీఫ్ ప్రొఫెసర్ కోదండరాం, కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి తదితరులు మద్దతు ప్రకటించారు. ప్రొఫెసర్ కోదండరామ్ మాట్లాడుతూ... రాష్ట్రంలో అప్రకటిత ఎమర్జెన్సీ పాలన కొనసాగుతుందని, దీన్ని ప్రతిఘటించాలని కోరారు. ఇష్టానుసారంగా అప్పులు చేయడంతో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దెబ్బతిన్నదని మండిపడ్డారు. అప్పులు రాష్ట్ర జీడీపీలో 30శాతానికి మించిపోయాయన్నారు. ఉద్యోగులకు సకాలంలో జీతాలు వచ్చే పరిస్థితి లేదన్నారు. 

బీఆర్​ఎస్​పాలనలో విద్యారంగం ధ్వంసం

జీవన్ రెడ్డి మాట్లాడుతూ... రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే సీపీఎస్ విధానాన్ని రద్దు చేస్తామని చెప్పారు. ఉద్యోగాల భర్తీకి క్యాలెండర్ రిలీజ్ చేస్తామన్నారు. ప్రభుత్వం టీచర్ల భర్తీ సరిగా చేపట్టడం లేదని, దీంతో గతేడాదితో పోలిస్తే రెండు లక్షల మంది విద్యార్థులకు సర్కారు బడుల్లో తక్కువగా చేరారని తెలిపారు. ప్రొఫెసర్ హరగోపాల్ మాట్లాడుతూ.. బీఆర్ఎస్ సర్కారు రాష్ట్రంలో విద్యారంగాన్ని ధ్వంసం చేసిందని, సీఎం కేసీఆర్ రాష్ట్రంలో చదువులు పూర్తిగా నిర్లక్ష్యం చేశారని చెప్పారు. ప్రపంచ బ్యాంకు షరతుల్లో భాగంగానే సీపీఎస్ విధానాన్ని తీసుకొచ్చారనీ తెలిపారు. పింఛన్ తో టీచర్లకు ఆత్మగౌరవం వస్తుందన్నారు. సజయ, సంధ్య మాట్లాడుతూ... సమస్యల పరిష్కారానికి ఐక్యంగా పోరాడాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో యూఎస్​పీసీ స్టీరింగ్ కమిటీ నేతలు జంగయ్య, చావ రవి, అశోక్ కుమార్, సోమయ్య, షౌకత్ అలీ, దాముక కమలాకర్, పోచయ్య, కొమ్ము రమేశ్, వెంకట్రావ్, జాడి రాజన్న, కొం డయ్య, నాగిరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.