- డ్రైవర్, క్లీనర్ సేఫ్
షాద్ నగర్, వెలుగు: రంగారెడ్డి జిల్లా కొత్తూరు పోలీస్ స్టేషన్ పరిధిలో శనివారం పటాకుల లారీ దగ్ధమైంది. తమిళనాడు రాష్ట్రంలోని శివకాశి నుంచి మహేశ్వరం, నిజామాబాద్ జిల్లాకు పటాకుల లోడ్‌తో వెళ్తోంది. పెంజెర్ల రోడ్ నుంచి మణిక్యమ్మగూడ రోడ్ వైపు వెళ్తున్న పటాకుల లారీకి విద్యుత్ వైర్లు తగలడంతో మంటలు చెలరేగాయి.
ప్రమాదం జరిగిన సమయంలో లారీలో ఉన్న డ్రైవర్ అయ్యప్పన్, క్లీనర్ సట్టివేల్ సురక్షితంగా బయటపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ప్రమాదంలో లారీ పూర్తిగా దగ్ధమైంది. ఈ ప్రమాదంలో రూ.60 లక్షల ఆస్తి నష్టం జరిగింది. డీసీపీ శిరీష, ఏసీపీ లక్ష్మీనారాయణ,ఇన్స్పెక్టర్ నర్సయ్య ఘటనా స్థలాన్ని పరిశీలించారు.
