24వ అంతస్తు నుంచి పడి క్రేన్ ఆపరేటర్ మృతి

24వ అంతస్తు నుంచి పడి క్రేన్ ఆపరేటర్ మృతి

కూకట్​పల్లి, వెలుగు: నిర్మాణంలో ఉన్న ఓ భారీ భవనం పైనుంచి పడి క్రేన్​ ఆపరేటర్​ మృతిచెందాడు. మధ్యప్రదేశ్​కు చెందిన యువరాజ్​పటేల్(22) కొంతకాలంగా కూకట్​పల్లిలోని హానర్​ హోమ్స్​ కన్​స్ట్రక్షన్​ కంపెనీలో క్రేన్(టవర్​భూమ్​) ఆపరేటర్​గా పనిచేస్తున్నాడు. ఈ మెషీన్​ ద్వారా పైఅంతస్తులకు కాంక్రిట్​ మిక్సర్​ సరఫరా చేస్తుంటారు. గురువారం రాత్రి క్రేన్​తో 24వ అంతస్తు వద్ద పని చేస్తుండగా మెషీన్​లో ప్రాబ్లమ్​ వచ్చి రివర్స్​ కొట్టింది. దీంతో మెటీరియల్​ అతని మీద పడటంతో పైనుంచి కింద పడి స్పాట్​లో మృతి చెందాడు.

క్రేన్​ ఢీకొని మహిళ..

మూసాపేటలో నివసించే దాసరి లావణ్య(29) హౌస్​కీపర్​గా పనిచేస్తోంది. శుక్రవారం మధ్యాహ్నం ఒంటిగంట సమయంలో మూసాపేట నుంచి ప్రశాంత్​నగర్​ వైపు రోడ్డు దాటుతుండగా క్రేన్​ఢీకొట్టింది. స్థానికులు గాంధీ దవాఖానకు తరలించగా, చికిత్స పొందుతూ మృతిచెందింది.

బోనాల పండుగకు వస్తూ..

జీడిమెట్ల: బోనాల పండగ కోసం కూతురు ఇంటికి వస్తూ రోడ్డు ప్రమాదంలో ఓ మహిళ మృతిచెందిన ఘటన బాచుపల్లి పీఎస్​ పరిధిలో జరిగింది. మెదక్​ జిల్లా రామాయంపేటకు చెందిన రేణుక(43) బాచుపల్లిలోని తన కూతురు ఇంట్లో బోనాల పండుగ కోసం శుక్రవారం ఇంటి నుంచి  బయల్దేరింది. మధ్యాహ్నం విజ్ఞాన్​ జ్యోతి కాలేజీ వద్ద రోడ్డు దాటుతుండగా ఓ బైక్​ ఆమెను ఢీకొట్టింది. దీంతో కిందపడగా పైనుంచి కారు వెళ్లడంతో అక్కడికక్కడే మృతిచెందింది.