సోషల్ మీడియాలో ‌ఫేక్ అకౌంట్లు సృష్టించి, చాటింగ్ చేస్తూ అవతలి వారిని నమ్మిస్తూ లక్షల్లో వసూలు

సోషల్ మీడియాలో ‌ఫేక్ అకౌంట్లు సృష్టించి, చాటింగ్ చేస్తూ అవతలి వారిని నమ్మిస్తూ లక్షల్లో వసూలు
  • పెద్ద మనుషుల్లో పెట్టడంతో రూ. 8 లక్షలు జరిమానా  
  • సైబర్ మోసగాడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు 
  • ఖమ్మం జిల్లా మద్దులపల్లిలో ఆలస్యంగా తెలిసిన ఘటన

కామేపల్లి, వెలుగు: సోషల్ మీడియాలో ‌ఫేక్ అకౌంట్లు సృష్టించి, చాటింగ్ చేస్తూ అవతలి వారిని నమ్మిస్తూ.. రూ. లక్షల్లో వసూళ్లకు పాల్పడుతున్న మోసగాడిని ఖమ్మం జిల్లా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వివరాల్లోకి వెళ్తే.. కామేపల్లి మండలం మద్దులపల్లి గ్రామానికి చెందిన ఓ యువకుడు కొంతకాలంగా అందమైన యువతులు, మహిళల‌ ఫొటోలతో సోషల్ మీడియాలో ఫేక్ అకౌంట్లు సృష్టించి.. ఆర్థిక కష్టాల్లో ఉన్నానని, కుటుంబసభ్యులకు ఆరోగ్యం బాగోలేదని చెప్పి నమ్మిస్తూ.. అక్రమంగా డబ్బులు చేస్తున్నాడు. అదే గ్రామానికి చెందిన ఓ మహిళ ఫొటోను మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో పెట్టడడంతో, అది చూసిన ఆమె అన్న ఐదు నెలల కింద కంప్లయింట్ చేయడంతో కామేపల్లి పోలీసులు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.

కాగా అతడు  తన బుద్ధి మార్చుకోకపోవడంతో పాటు మరింతగా రెచ్చిపోయాడు. తన ఫ్రెండ్ అయిన ఆటో డ్రైవర్ బ్యాంక్ అకౌంట్ ను తీసుకుని, అక్రమంగా డబ్బులు వసూలు చేస్తూ అందులో వేయించుకుంటున్నాడు. దీంతో ఆటోడ్రైవర్ కు అనుమానం వచ్చి  రెండు రోజుల కింద మద్దులపల్లిలో పెద్ద మనుషుల్లో పెట్టాడు.  గ్రామ పెద్దలు అతడికి రూ. 8 లక్షల జరినామా విధించారు.

కాగా.. ఆ డబ్బుల్లో రూ. 6 లక్షలు గ్రామ పంచాయతీకి, మరో రూ. 1.20 లక్షలు కాలనీవాసులకు, రూ. 80 వేలు ఆటోడ్రైవర్ కు ఇచ్చేటట్టు తీర్మానించారు. దీనిపై పోలీసులకు సమాచారం అందడంతో కామేపల్లి పోలీసులు ఆదివారం మోసగాడిని  అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. అతడు చెప్పే వివరాల ఆధారంగా పెద్ద మనుషులపై కూడా కేసు నమోదుకు పోలీసులు సిద్ధమైతున్నట్టు తెలిసింది.