రిటైల్​ అప్పులు తలనొప్పే

రిటైల్​ అప్పులు తలనొప్పే
  • రిటైల్​ అప్పులు తలనొప్పే
  • లెండర్లు జాగ్రత్తపడాలి : సిబిల్​ సీఈఓ

ముంబై : రిటైల్​ అప్పులు తలనొప్పిగా మారే ఛాన్స్​ ఉందని క్రెడిట్​ బ్యూరోలు హెచ్చరిస్తున్నాయి. కొవిడ్‌​ తర్వాత భారీగా  పెరిగిన  అన్​సెక్యూర్డ్​ లోన్లుతో కొంత ఇబ్బందులుండొచ్చని సూచిస్తున్నాయి. అన్​సెక్యూర్డ్​ లోన్లు తీసుకుని వస్తువులను కొనడం బాగా ఎక్కువైందని, ఇలాంటి అప్పులు మార్చి 2021 –మార్చి 2023 మధ్య కాలంలో  ఏకంగా  ఏటా 47 శాతం చొప్పున పెరిగాయని డేటా వెల్లడిస్తోంది. మరోవైపు క్రెడిట్​ కార్డ్​ డెలిన్​క్వెన్సీలు (గడువు ముగిశాక కూడా చెల్లింపులు జరపకపోవడం) ఎక్కువవుతున్నాయని పేర్కొంటోంది. 

రిటెయిల్​ లోన్లు ఇచ్చే విషయంలో పోర్ట్​ఫోలియోను ఎప్పటికప్పుడు గమనించుకోవడం ఆవశ్యకమని, రిస్క్​ను సరిగ్గా బేరీజు వేసుకోవడం తప్పనిసరని ట్రాన్స్​యూనియన్​ సిబిల్​ సీఈఓ రాజేష్​ కుమార్​ చెప్పారు. రిటైల్​ క్రెడిట్​ ట్రెండ్స్​పై ఈ సంస్థ ఒక రిపోర్టును తెచ్చింది. డిజిటల్​, ఇన్ఫర్మేషన్​ ఓరియెంటెడ్​ లెండింగ్​ వల్లే ప్రధానంగా రిటైల్​ అప్పులు ఇబ్బడిముబ్బడిగా పెరుగుతున్నాయని రాజేష్​ కుమార్​ వెల్లడించారు. రిటైల్​అప్పులు నిలకడగా జోరందుకుంటున్నాయని పేర్కొన్నారు. 

కొన్ని ప్రొడక్టులలో ఎలాంటి ఇబ్బందులు లేకపోయినా, మరికొన్ని ప్రొడక్టుల విషయంలో జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం కనబడుతోందని వివరించారు. డిమాండ్​, సప్లయ్, కన్జూమర్​ బిహేవియర్​, పెర్​ఫార్మెన్స్​ వంటి నాలుగు అంశాల ఆధారంగా తమ రిపోర్టును రూపొందించినట్లు వెల్లడించారు. న్యూ టు క్రెడిట్​ (ఎన్​టీసీ) కస్టమర్ల విషయంలో లెండర్లు ఇప్పటికే కొన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారని, మార్చి 2020 లో అలాంటి కన్జూమర్లకు ఇస్తున్న అప్పుల శాతం 34 అయితే, మార్చి 2021 నాటికి 28 శాతానికి, మార్చి 2023 నాటికి 23 శాతానికి అప్రూవల్స్​ తగ్గిపోయినట్లు చెప్పారు.