క్రెడిట్ కార్డు అప్పులు రూ.2 లక్షల కోట్లు.. ఆల్ టైం రికార్డ్

క్రెడిట్ కార్డు అప్పులు రూ.2 లక్షల కోట్లు.. ఆల్ టైం రికార్డ్

దేశ వ్యాప్తంగా క్రెడిట్ కార్డుల అప్పులు. పాపాలు పెరిగిపోతున్నట్లు పెరిగిపోతున్నాయి. జనాలు రోజు రోజుకు క్రెడిట్ కార్డుల మీద అప్పులు చేస్తున్నారు.  రికార్డు స్థాయిలో 2023  ఏప్రిల్ నెలలో  క్రెడిట్ కార్డు బకాయిలు రూ. 2 లక్షల కోట్ల మార్కును దాటినట్లు రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియా ప్రకటించింది. ఏప్రిల్లో క్రెడిట్ కార్డు బకాయిలు రూ. 2,00,258 కోట్లకు పెరిగినట్లు వెల్లడించింది. 2022 ఏప్రిల్లో క్రెడిట్ కార్డు బకాయిలతో పోలిస్తే..ప్రస్తుతం 29.7 శాతం పెరిగిందని పేర్కొంది. క్రెడిట్ కార్డు స్వైప్ లేదా ఆన్ లైన్ క్రెడిట్ కార్డు ఆన్ లైన్ లావాదేవీల మొత్తం విలువ 2023 ఏప్రిల్ లో రూ. 1.3 లక్షల కోట్లు దాటిందని వెల్లడించింది. 

కారణం ఏంటంటే..

క్రెడిట్ కార్డు అప్పులు పెరగడానికి కారణం రుణాలు మాత్రమే కాదు. ధరలు పెరుగుతున్న క్రమంలో ప్రత్యక్ష చెల్లి్ంపులు చేయలేక ప్రజలు..  క్రెడిట్ కార్డుల ద్వారా చెల్లింపులు చేస్తున్నారని యాక్సిస్ బ్యాంకు ప్రెసిడెంట్  సంజీవ్ మోఘే అన్నారు. వినియోగదారుల క్రెడిట్ కార్డు బ్యాలెన్స్ ఎక్కువ ఉండటం కూడా మరోక కారణమన్నారు. 

2008  ప్రపంచ ఆర్థిక సంక్షోభానికి ముందు  క్రెడిట్ కార్డ్ బకాయిల వాటా 1.2 శాతంగా ఉండేది. ఆ తర్వాత చిన్న వ్యక్తిగత రుణాల చెల్లింపులు, పలు తదుపరి దిద్దుబాటు చర్యల తరువాత  క్రెడిట్ కార్డ్ బకాయిల వాటా గత పదేళ్లలో 1 శాతం కంటే తక్కువగా నమోదైంది. అయితే 2019 ఆగస్టులో క్రెడిట్ కార్డు బకాయిల వాట  మళ్లీ 1 శాతం మార్కును దాటింది.  అప్పటి నుండి ప్రతీ ఏడాది  క్రమంగా పెరుగుతూ వస్తోంది. 

దేశంలో బ్యాంకుల అప్పుల పరంగా క్రెడిట్ కార్డుల అప్పులు మూడో స్థానంలో ఉన్నాయి. గృహ రుణాల 14.1 శాతం, వాహన రుణాలు 3.7 శాతం ఉండగా..క్రెడిట్ కార్డు బకాయిలు 1.4 శాతంగా ఉన్నాయని ఆర్బీఐ ప్రకటించింది.