
పూర్నియా: ప్రతి నెలా ఉచితంగా ఐదు కిలోల రేషన్, మొబైల్ ఫోన్లు చౌకగా లభించడం వంటి ఘనతలు తన తండ్రి రామ్ విలాస్ పాశ్వాన్కే దక్కుతాయని లోక్ జనశక్తి పార్టీ (రామ్ విలాస్) ప్రెసిడెంట్, కేంద్ర మంత్రి చిరాగ్ పాశ్వాన్ తెలిపారు. బిహార్లోని పూర్నియా జిల్లాలో ‘నవ సంకల్ప్ సభ’ పేరుతో ఎల్జేపీ ర్యాలీని నిర్వహించింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు.‘‘కేంద్ర మంత్రి వర్గంలో వివిధ పదవులు చేపట్టినప్పుడు బిహార్, రాష్ట్ర ప్రజల కోసం రామ్ విలాస్ పాశ్వాన్ తాను చేయగలిగినదంతా చేశారు.
ఆ నాయకుడి కొడుకుగా ఉన్నందుకు నేను గర్విస్తున్నాను. దేశంలోని 81 కోట్ల మందికి ఉచిత రేషన్ లభించడానికి ఆయన విజనే కారణమని నేను నమ్ముతున్నాను. ప్రస్తుతం ప్రతి యువకుడు మొబైల్ పోన్లను వాడటం చూస్తే నాకు గర్వంగా అనిపిస్తుంది. వంకాయల మాదిరిగా మొబైల్ ఫోన్లు చౌకగా లభించాలని ఆయన కలలు కనడం వల్లే ఇది సాధ్యమైంది” అని పేర్కొన్నారు.