
న్యూఢిల్లీ: మొన్న ఎస్‌వీబీ, నిన్న సిగ్నేచర్ బ్యాంక్ ..నేడు యూరోపియన్ బ్యాంక్ క్రెడిట్ స్వీస్?..అమెరికన్ బ్యాంకుల బాటలో యూరోపియన్ బ్యాంకులు కూడా నడిచేటట్టు కనిపిస్తున్నాయి. ఈ స్విస్ బ్యాంక్ షేర్లు బుధవారం 23 శాతం మేర నష్టపోయి ఏడాది కనిష్టానికి పడిపోయాయి. ‘మార్కెట్‌లో తీవ్ర హెచ్చుతగ్గులు కనిపిస్తున్నాయి. అమెరికన్ బ్యాంకుల సమస్యల నుంచి యూరోపియన్ బ్యాంకుల సమస్యల వైపు షిఫ్ట్ అవుతున్నాం. ఈ లిస్టులో మొదట క్రెడిట్ స్వీస్ ఉంది’ అని బాన్కా ఇఫిగెస్ట్‌కు చెందిన కార్లో ఫ్రాంచిని అన్నారు. కొన్ని తప్పులను గుర్తించామని ఈ నెల 14 న ప్రకటించిన యాన్యువల్ రిపోర్ట్‌లో క్రెడిట్ స్వీస్ పేర్కొంది. వివిధ స్కాండల్స్‌తో ఇన్వెస్టర్లు, కస్టమర్ల కాన్ఫిడెన్స్ కోల్పోయిన ఈ బ్యాంక్, తాజాగా ఈ ప్రకటన చేయడం ఆందోళనకు గురి చేస్తోంది. కస్టమర్లు తమ డిపాజిట్లను వెనక్కి తీసుకోవడం పెంచారు. మరోవైపు క్రెడిట్ స్వీస్ తన షార్ట్ టర్మ్ డిపాజిట్లపై 7 శాతం వరకు వడ్డీ ఇవ్వడానికి ముందుకొచ్చింది. ఈ నిర్ణయంతో బ్యాంక్ డిపాజిటర్లు పెరిగినా, బ్యాంక్ లాభాలు తగ్గిపోతాయి. ఈ ఎఫెక్ట్ బ్యాంక్ షేరులో కనిపిస్తోంది. కాగా, ఎస్‌వీబీ 1.8 బిలియన్ డాలర్ల లాస్‌లో అమ్మిన 21 బిలియన్ డాలర్ల బాండ్లను క్రెడిట్ స్వీసే కొనుగోలు చేసింది.
సౌదీ ఇన్వెస్ట్‌మెంట్లకు బ్రేక్..
క్రెడిట్ స్వీస్‌లో సౌదీ అరేబియా అతి పెద్ద షేరు హోల్డర్‌గా ఉంది. సౌదీ నేషనల్ బ్యాంక్ ద్వారా ఈ బ్యాంక్‌లో 10 శాతం వాటాను మెయింటైన్ చేస్తోంది. తన వాటాను మరింతగా పెంచుకోవడానికి రెగ్యులేటరీ అడ్డంకులు ఉన్నాయని, వాటా పెంచుకోలేమని సౌదీ నేషనల్ బ్యాంక్ ప్రకటించింది. దీంతో క్రెడిట్ స్వీస్ షేర్లు భారీగా పడుతున్నాయి.