సెల్ఫీ ఇవ్వలేదని పృథ్విషా కారుపై దాడి

సెల్ఫీ ఇవ్వలేదని పృథ్విషా కారుపై దాడి

భారత యువ క్రికెటర్ పృథ్వి షా పై జరిగిన దాడికి సంబంధించిన వీడియో బయటికి వచ్చింది. అందులో ఓ యువతి కూడా ఉన్నట్లు తెలుస్తోంది. కొందరు యువకులతో పాటు ఆమె కూడా పృథ్విషాని సెల్ఫీ అడిగినట్లు తెలుస్తోంది. సెల్ఫీలు దిగేందుకు అంగీకరించలేదన్న కోపంతో కొందరు యువకులు పృథ్వి షాని దూషించడమే కాకుండా.. అతడు ప్రయాణించిన కారుపై బేస్ బాల్ బ్యాట్లతో దాడి చేశారు. అనంతరం నిందితులతో కలిసివున్న ఓ యువతి పృథ్వి షాను డబ్బులు డిమాండ్ చేసిందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం దాడి జరిగిన దృశ్యాలు సోషల్‌ మీడియాలో వైరలవుతున్నాయి.

బుధవారం సాయంత్రం పృథ్వీ షా అతని స్నేహితుడు ఆశిష్ సురేంద్రతో కలిసి శాంతాక్రూజ్‌లోని ఓ ఫైవ్‌స్టార్‌ హోటల్‌కు డిన్నర్ కు వెళ్లాడు. అదే సమయంలో కొందరు సెల్ఫీ కోసం పృథ్వి షా వద్దకు వచ్చారు. అభిమానుల మాటను కాదనలేకపోయిన షా వారిలో ఇద్దరితో సెల్ఫీలు దిగాడు. అయితే, వెంటనే మిగతావారు కూడా వచ్చి సెల్ఫీ అడగటం, అందుకు అతడు అంగీకరించకపోవడంతో గొడవ మొదలైంది. ఈలోపు పక్కనే ఉన్న పృథ్వీ షాస్నేహితుడు హోటల్‌ సిబ్బందికి జరుగుతున్న విషయాన్ని వివరించగా.. సిబ్బంది నిందితులను హోటల్‌ బయటకు గెంటేశారు.

దీన్ని అవమానంగా భావించిన నిందితులు పార్కింగ్ ప్లేస్ కు వచ్చి..  షా ప్రయాణిస్తున్న​ బీఎండబ్ల్యూ కారుపై బేస్‌బాల్‌ బ్యాట్లతో దాడికి దిగారు. ఆ సమయంలో షా, అతని స్నేహితుడు కారులోనే ఉన్నట్లు సమాచారం. ఈ ఘటన అనంతరం షా మరో కారులో ఇంటికి బయలుదేరాడు. అయినప్పటికీ వదలని నిందితులు అతడు ప్రయాణిస్తున్న కారును ఛేజ్‌ చేసి మరోసారి అటకాయించారు. ఓ యువతిని పంపి రూ. 50 వేలు ఇస్తే ఇక్కడితో ఈ విషయాన్ని వదిలేస్తామని.. లేనిచో కేసులు పెడతామని బెదిరించారు. అక్కడి నుంచి ఎలాగోలా తప్పించుకున్న షా నేరుగా పోలీసుల వద్దకు వెళ్లి ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.