
హైదరాబాద్: ఆసియా కప్ ఫైనల్ హీరో, తెలుగు క్రికెటర్ తిలక్ వర్మకు శంషాబాద్ ఎయిర్ పోర్టులో గ్రాండ్ వెల్కమ్ లభించింది. ఆసియా కప్ ముగించుకుని ఢిల్లీ నుంచి సోమవారం (సెప్టెంబర్ 29) రాత్రి శంషాబాద్ ఎయిర్ పోర్టుకు చేరుకున్న తిలక్ వర్మకు ఎయిర్ పోర్టులో కుటుంబ సభ్యులు, స్నేహితులు, అభిమానులు ఘన స్వాగతం పలికారు. భారీ గజమాలతో అదిరిపోయే వెల్కమ్ పలికారు.
తెలంగాణ ప్రభుత్వం తరుఫున రాష్ట్ర స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేనా రెడ్డి తిలక్ వర్మకు ఎయిర్ పోర్టులో స్వాగతం పలికి అనంతరం సన్మానించారు. తిలక్ వర్మను చూసేందుకు భారీ సంఖ్యలో అభిమానులు శంషాబాద్ విమానాశ్రయానికి తరలివచ్చిన నేపథ్యంలో పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు. తిలక్ తన సొంత కారు సన్ రూఫ్ నుంచి ఫ్యాన్స్‌కు అభివాదం చేస్తూ ఇంటికి వెళ్లిపోయారు.
ఈ సందర్భంగా శివసేనా రెడ్డి మాట్లాడుతూ.. పాకిస్తాన్‌తో జరిగిన ఆసియా కప్ ఫైనల్లో అద్భుతమైన ప్రతిభ ప్రదర్శించి
హైదరాబాద్ తెలంగాణకే కాదు యావత్ దేశానికి కీర్తి ప్రతిష్టలు తీసుకొచ్చిన తిలక్ వర్మను అభినందించారు. క్లిష్ట పరిస్థితుల్లో తిలక్ వర్మ జట్టును గెలిపించిన విధానం యువ క్రీడాకారులకు స్ఫూర్తిగా నిలుస్తుందని ఆయన అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి తిలక్ వర్మను ప్రత్యేకంగా అభినందించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు.
ఇండియా–పాక్ మధ్య మ్యాచ్ ఎలా ఉండాలని సగటు అభిమాని కోరుకుంటాడో ఆదివారం (సెప్టెంబర్ 28) దుబాయ్ వేదికగా జరిగిన ఫైనల్ పోరు అచ్చం అలానే సాగింది. అనూహ్య మలుపులు తిరుగుతూ ఉర్రూతలూగించింది. ఆధిపత్యం చేతులూ మారుతూ తీవ్ర ఉత్కంఠను రేకెత్తించింది. తొలి పది ఓవర్లలో బ్యాటింగ్‌లో ఓ రేంజ్‌లో విజృంభిస్తున్న పాక్‌ను ఇండియా స్పిన్నర్లు చుట్టేశారు.
180 స్కోరు పక్కా అనుకుంటే 150 కూడా దాటకుండా పడగొట్టేశారు. 147 రన్స్ చిన్న టార్గెట్ ఛేజింగ్ ఇండియాకు నల్లేరు మీద నడకే అనుకుంటే.. నాలుగు ఓవర్లు తిరిగే సరికి టాప్–3 బ్యాటర్లు పెవిలియన్ బాట పట్టేశారు. పాక్ చేతిలో ఓడిపోతే ఎలా అన్న భయం మెల్లగా మొదలైంది.
హార్ట్‌బీట్ అమాంతం పెరిగింది. అప్పుడొచ్చాడు మన హైదరా‘బాద్‌షా’ తిలక్ వర్మ. క్రికెట్ వరల్డ్‌లోనే అతి పెద్ద మ్యాచ్‌లో .. అత్యంత ఒత్తిడిలోనూ నిర్భయంగా.. అద్భుతంగా ఆడుతూ పాక్ బౌలింగ్‌ను చీల్చి చెండాడాడు. ఇటుకా ఇటుకా పేరుస్తూ తన కెరీర్‌లో చిరకాలం నిలిచిపోయే ఇన్నింగ్స్‌తో జట్టును గెలిపించి హీరో అయ్యాడు తెలుగు క్రికెటర్ తిలక్ వర్మ.