
- రాష్ట్రంలో పెరుగుతున్న క్రైం
- 2020లో 800 హత్యలు, 2021లో 1,026
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో నేరాలు పెరిగిపోతున్నాయి. 2019తో పోలిస్తే భారీగా నమోదయ్యాయి. దేశవ్యాప్తంగా మూడేండ్లలో నమోదైన కేసుల వివరాలను నేషనల్ క్రైం రికార్డ్స్ బ్యూరో ఆదివారం విడుదల చేసింది. దీని ప్రకారం రాష్ట్రంలో 2020లో 1 లక్షా 47 వేల 504 నేరాలు రిపోర్ట్ కాగా.. గతేడాది 1,58,809 కేసులు నమోదయ్యాయి.
పెరుగుతున్న క్రైం
హత్యలు, మహిళలపై దాడులు, అత్యాచారాలు, చిన్నారులపై లైంగిక దాడులు, కిడ్నాపులు, వృద్ధులపై దాడులు, సూసైడ్స్ పెరిగాయని ఎన్‌సీఆర్‌బీ వెల్లడించింది. గతేడాది 21,315 రోడ్డు ప్రమాదాలు జరగ్గా.. 7,447 మంది మృతి చెందారు. రోజూ 20 మంది చనిపోతున్నారు. రాష్ట్రంలో గతేడాది 10,171 మంది సూసైడ్ చేసుకోగా అందులో కుటుంబ కలహాలు, అనారోగ్యంతో సూసైడ్ చేసుకున్న వారి సంఖ్య 4,464. ఇందులో 45 నుంచి-60 ఏండ్ల వారే ఎక్కువగా ఉన్నారు.
ఆత్మహత్యల్లో దేశంలోనే మొదటిస్థానంలో మహారాష్ట్ర నిలవగా తమిళనాడు, ఎంపీ, బెంగాల్, కర్నాటక, తెలంగాణ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. 2020లో 802 హత్యలు జరిగితే 2021లో ఆ సంఖ్య 1,026కు పెరిగింది. ఇక కిడ్నాపులు 2,056 నుంచి 2,760కు పెరిగాయి. మహళలపై దాడుల సంఖ్య గణనీయంగా పెరిగింది. 2020లో 17,791గా నమోదైతే.. 2021లో అది 20,865కు చేరింది. చిన్నారులపై దాడులు కూడా 4,200 నుంచి 5,667కు పెరిగాయి.