ఖమ్మంలో కొన్ని ప్రైవేట్ హాస్పిటళ్ల తీరుపై విమర్శలు

ఖమ్మంలో కొన్ని ప్రైవేట్ హాస్పిటళ్ల తీరుపై విమర్శలు
  • ప్రాణం కంటే పైసలే ముఖ్యం
  • ఖమ్మంలో కొన్ని ప్రైవేట్ హాస్పిటళ్ల తీరుపై విమర్శలు 
  • టెస్ట్​లు, స్కానింగ్​లు అంటూ పేషంట్ల నిలువు దోపిడీ
  • హాస్పిటళ్లపై ఐటీ దాడులను సమర్థిస్తున్న ప్రజలు

ఖమ్మం, వెలుగు: ఖమ్మం నగరంలోని ప్రైవేట్ హాస్పిటళ్ల నిర్వహణ తీరు, వాటిలో టెస్టులు, స్కానింగ్​ల పేరుతో వసూళ్ల దందా జోరుగా సాగుతోంది. జనం ప్రాణాల కంటే పైసలకే ముఖ్యం అన్నట్లుగా వ్యవహరిస్తున్నాయి. జిల్లాలో 300కు పైగా ప్రైవేటు హాస్పిటళ్లు ఉండగా కొన్ని హాస్పిటళ్లు ఆర్ఎంపీలను మార్కెటింగ్ ఏజెంట్లుగా మార్చుకొని వ్యాపారం నడిపిస్తున్నాయి. ఈ దందాలో రోగులను నిలువు దోపిడీ చేస్తున్నారు. చిన్న రోగమైనా టెస్ట్​లు, స్కానింగ్​లు అంటూ రూ.వేలల్లో గుంజుతున్నారు.  అయినప్పటికీ సరైన ట్రీట్​మెంట్​జరుగుతుందన్న నమ్మకం లేదు. అసలు వ్యాధి ఏంటో కూడా సరిగా నిర్ధారించకుండానే ట్రీట్​మెంట్​పేరిట రూ.వేలల్లో డబ్బు గుంజుతున్న హాస్పిటల్స్​ ఉన్నాయి.  

ఆర్ఎంపీలే కీలకం... 

ఈ దందాలో ఆర్ఎంపీలే కీలకంగా ఉంటున్నరు. గ్రామంలో ఎవరికైనా చిన్న హెల్త్​ ఇష్యూ వచ్చినా, పెద్ద జబ్బు అంటూ భయపెడుతూ ఖమ్మంలో వారికి లింక్​  ఉన్న  హాస్పిటల్​కు తీసుకొస్తారు. అక్కడ టెస్ట్​లు, స్కానింగ్​లు అంటూ రూ.వేలల్లో డబ్బు గుంజుతారు. చివరికి ఏదో ఓ వ్యాధి ఉందని చెప్పి మందులు రాసి పంపిస్తున్నారు. ఈ దందాలో ఆర్ఎంపీలకు మొత్తం ఫీజులో 20 నుంచి 50 శాతం  దాకా ముడుతోంది. మరికొన్ని హాస్పిటల్స్​కార్పొరేట్​ స్థాయిలో పెద్ద భవనాలు కట్టి, పేషంట్ల నుంచి రూ.లక్షల్లో వసూలు చేస్తున్నాయి. ఇవేమీ రూల్స్​పాటించవు. నిబంధనల ప్రకారం హాస్పిటళ్లలో ట్రీట్​మెంట్, ఫీజుల వివరాలను బోర్డుపై డిస్ ప్లే చేయాల్సి ఉండగా, వాటిని పట్టించుకున్న వారే లేరు. ఈ వసూళ్లపై ఇన్​కమ్ ​ట్యాక్స్​ డిపార్ట్​మెంట్ కు ఫిర్యాదులు వెళ్లే వరకు స్థానిక హెల్త్​అధికారులు పట్టించుకోకపోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. 

ఎంవోయూ ఉన్నా ట్రీట్​మెంట్​ చేయట్లే.. 

కొన్ని హాస్పిటళ్లు ఎంప్లాయిస్​ హెల్త్ స్కీమ్​, జర్నలిస్ట్ హెల్త్ కార్డులను లైట్ తీసుకుంటున్నాయి. ఈ కార్డులతో ట్రీట్​మెంట్​చేయడం కుదరదని, డబ్బు కడితేనే ట్రీట్​మెంట్​అంటూ ముఖం మీదే చెప్పేస్తున్నాయి.  ప్రాణాపాయ పరిస్థితుల్లో ఉన్నా డబ్బే ముఖ్యమనేలా ప్రవర్తిస్తున్నాయి. దీంతో ఖమ్మంలోని ప్రైవేట్ ఆస్పత్రుల మేనేజ్​ మెంట్ల తీరుపై సామాన్య జనంలో ఆగ్రహం వ్యక్తమవుతోంది.  ఖమ్మంలో రెండు, మూడు రోజులుగా జరుగుతున్న ఇన్​కమ్​ట్యాక్స్​ దాడులపై జనాలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇక మిగిలిన ప్రైవేట్ హాస్పిటళ్లపై కూడా జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు దాడులు చేసి, అధిక ఫీజులు వసూలు చేస్తున్న వారిపై, నిబంధనలను పాటించని వారిపై చర్యలు తీసుకోవాలన్న డిమాండ్లు వినిపిస్తున్నాయి. 

ఖమ్మం నగరానికి చెందిన శ్రీధర్​ ఇటీవల జ్వరం, దగ్గు ఉండడంతో ట్రాఫిక్​ పోలీస్​స్టేషన్​​సమీపంలోని ఓ ప్రైవేటు హాస్పిటల్​కు వెళ్లాడు. రెండ్రోజుల ట్రీట్ మెంట్ తర్వాత కూడా జ్వరం తగ్గకపోవడంతో మరో హాస్పిటల్​లో అడ్మిట్ కాగా, చెస్ట్ స్కానింగ్ చేసి కొవిడ్ పాజిటివ్​ అని చెప్పారు. రెమిడిసివిర్​ ఇంజిక్షన్​ కూడా వేశారు. అయినా తగ్గకపోవడంతో హైదరాబాద్​కు తరలించారు. అక్కడ టెస్ట్​లు చేసి స్వైన్​ ఫ్లూగా నిర్ధారణ చేసి ట్రీట్ మెంట్ ఇచ్చారు. వారం రోజుల్లో పూర్తిగా కోలుకున్నాడు. 

ప్రైవేట్ హాస్పిటళ్ల కారణంగా నా బిడ్డ చనిపోయాడు

నిండు గర్భిణిగా ఉన్న నా భార్యను 'ఆరోగ్య భద్రత' స్కీమ్​లో ఉన్న ఖమ్మం బిలీఫ్ హాస్పిటల్​కు తీసుకువెళ్లా. కాన్పు చేయాలంటే రూ.2 లక్షలు డిపాజిట్ కట్టాలని సిబ్బంది చెప్పారు. నా దగ్గర డబ్బులు లేవని రూ.40 వేలు కడతానని బతిమిలాడా. చేర్చుకోకపోవడంతో మరో హాస్పిటల్​కు తీసుకెళ్లా. ఈనెల 8న కాన్పు చేశారు. అప్పటికే కాన్పు ఆలస్యం  కావడంతో బిడ్డ ఉమ్మనీరు తాగడంతో హెల్త్​ఇష్యూస్​వచ్చాయి. బిడ్డను సైతం 'ఆరోగ్య భద్రత' స్కీమ్ లో ఉన్న మరో హాస్పిటల్ కు తీసుకెళ్లాను. అక్కడ కూడా అదే పరిస్థితి. రూ.30 వేలు కట్టించుకొని సరైనా ట్రీట్​మెంట్​చేయకుండా వేరే హాస్పిటల్​కు తీసుకెళ్లమన్నారు. అక్కడా మరో రూ.30వేలు డిపాజిట్ చేయమన్నారు. చికిత్స చేయిస్తుండగా బిడ్డ చనిపోయాడు. నా బిడ్డ మృతికి ఖమ్మంలోని ప్రైవేట్ హాస్పిటళ్ల డబ్బు యావే కారణం. 

పోలీస్​ కానిస్టేబుల్, బాధితుడు, కొత్తగూడెం