ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఫ్రెండ్లీ కాదు.. కరప్షన్ పోలీసింగ్

 ఉమ్మడి నల్గొండ జిల్లాలో  ఫ్రెండ్లీ కాదు.. కరప్షన్ పోలీసింగ్

నల్గొండ జిల్లా: రాష్ట్ర ప్రభుత్వం ఫ్రెండ్లీ పోలీసింగ్ అంటుంటే, ఉమ్మడి నల్గొండ జిల్లాలో కరప్షన్ పోలీసింగ్ నడుస్తోంది. కొందరు పోలీసులు సివిల్ సెటిల్మెంట్ చేస్తున్నారు. మరికొందరు రియల్ ఎస్టేట్ దందా చేస్తున్నారు. ఇంకొందరు హత్యా కేసులను తారుమారు చేస్తున్నారు. ఇవన్నీ ఆరోపణలు కావు.. కొన్ని నెలలుగా ఉమ్మడి జిల్లాలో సస్పెన్షన్లు, VR కి ఏటాచ్ అయిన వారిని చూస్తుంటే తెలుస్తున్న విషయాలు.  ఉమ్మడి నల్గొండ జిల్లాలో 6 నెలల్లో దాదాపు 20 మందికి పైగా పోలీసులపై చర్యలు తీసుకున్నారు. వీరిలో 18 మంది ఎస్ఐలు, నలుగురు సీఐలు, ఓ ఏసీపీ ఉన్నారు. మరికొందరిపై చర్యలకు సిద్ధమవుతున్నారు పోలీస్ఉన్నతాధికారులు. ఇటీవల సంచలనం సృష్టించిన మరియమ్మ లాకప్ డెత్ పై సీఎం కేసీఆర్ కూడా పోలీసు శాఖపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ ఘటనలో యాదాద్రి జిల్లాకు చెందిన ఎస్ఐ మహేష్ తో పాటు ఇద్దరు కానిస్టేబుళ్లను ఏకంగా విధుల్లో నుంచి శాశ్వతంగా తప్పించారు. ఇదే జిల్లాలో భూ వివాదంలో జోక్యం చేసుకుని భాదితులను ఇబ్బందులకు గురి చేసిన ఘటనలో చౌటుప్పల్ ఏసీపీ సత్తయ్య, ఎస్ఐ నర్సయ్యను సీపీ కార్యాలయానికి అటాచ్ చేశారు. మహిళపై అత్యాచారం ఘటనలో నిర్లక్ష్యంగా వ్యవహరించి, నిందితులకు అండగా నిలబడ్డారంటూ రామన్నపేట సీఐ శ్రీనివాస్, ఎస్ఐ చంద్రశేఖర్ ను సస్పెండ్ చేశారు. సివిల్ వివాదంలో తల దూర్చారంటూ మోత్కూర్ ఎస్ఐ హరి ప్రసాద్ పై చర్యలు తీసుకున్నారు. 

భూ వివాదాలు, సెటిల్ మెంట్లు, సివిల్ మ్యాటర్స్, అక్రమ దందాలకు అండగా నిలిచారని నల్గొండ జిల్లా పోలీసులపై ఆరోపణలున్నాయి. మిర్యాలగూడ రూరల్ ఎస్ఐ పరమేష్, గుడిపల్లి ఎస్ఐ గోపాల్ రావు, మర్రిగూడ ఎస్ఐ క్రాంతికుమార్, నేరడుగొమ్ము ఎస్ఐ నరేశ్ కుమార్ ను వీఆర్ కు పంపించారు ఎస్పీ రంగనాథ్. అక్రమ వసూళ్లకు పాల్పడుతూ రియల్ ఎస్టేట్ వ్యవహారాల్లో తలదూర్చారన్న అభియోగాలపై నాంపల్లి సీఐ శ్రీనివాస్ రెడ్డిపై వేటు పడింది. భూ సెటిల్మెంట్ లతో పాటు సామాన్య రైతులపై ఇష్టానుసారంగా మాట్లాడుతాడని మర్రిగూడ ఎస్సై క్రాంతి కుమార్ పై ఆరోపణలున్నాయి. చాలా కేసుల్లో ఫిర్యాదుదారులనే నిందితులుగా చేర్చారని చండూరు ఎస్ఐ ఉపేందర్ రెడ్డిపై ఆరోపణలు ఉన్నాయి. అక్రమ వసూళ్లకు పాల్పడుతారని, శాంతిభద్రతల్లో నిర్లక్ష్యంగా ఉంటారని, భూ వివాదాల్లో తలదూరుస్తారని, ఎన్నో ఫిర్యాదులు ఆయనపై ఉన్నాయి. వీటిపై విచారణ జరిపి ఎస్ఐ ఉపేందర్ ను వీఆర్ కు ఎటాచ్ చేశారు ఎస్పీ రంగనాథ్. ఇసుక మాఫియాకు అండగా నిలిచాడంటూ నిడమనూరు ఎస్ఐ కొండల్ రెడ్డిపై వేటు పడింది. లంచం ఇవ్వని రైతును చితక బాదినందుకు ఆయన్నువీఆర్ కు పంపారు ఎస్పీ రంగనాథ్.  ప్రజలకు అండగా ఉండాల్సిన పోలీసులు గాడి తప్పుతుండడంతో విమర్శలు వస్తున్నాయి.