ముగిసిన పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమాలు

ముగిసిన పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమాలు
  • ‘ప్రగతి’ పైపైనే!
  • ముగిసిన పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమాలు
  • గ్రామాలు, పట్టణాల్లో మురుగు కాల్వలు, చెత్త కుప్పలు ఏడియాడనే..
  • ఫండ్స్ లేక కొత్త పనులు చేపట్టని అధికారులు 
  • విద్యుత్ సమస్యలూ..  పెండింగ్ లోనే ..


ఆదిలాబాద్, వెలుగు :  గత 15 రోజులుగా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా  నిర్వహించిన  పల్లె, పట్టణ  ప్రగతి  కార్యక్రమాలు నామ్​కే వాస్తే  ముగించారనే విమర్శలు వస్తున్నాయి. ప్రభుత్వం ప్రత్యేక నిధులు కేటాయించకపోవడంతో పైపైనే పారిశుధ్య పనులతో  సరిపెట్టారనే ఆరోపణలు వస్తున్నాయి. గ్రామాల్లో, పట్టణాల్లో  మరమ్మతు పనులు తప్ప కొత్త పనులు  చేపట్టలేదని, దీంతో సమస్యలు ఏడియాడనే ఉన్నాయని ఆయా గ్రామాల ప్రజలు వాపోతున్నారు. గతంలో పల్లె ప్రగతిలో వైకుంఠ ధామాలు, నర్సరీలు, పల్లె ప్రకృతి వనాలు, డంపింగ్ యార్డు నిర్మాణాలు చేపట్టినా.. ఈ సారి వాటి జోలికి వెళ్లకుండా.. అక్కడక్కడ పల్లె, పట్టణ క్రీడా ప్రాంగణాలు మాత్రమే ప్రారంభించారని చెప్తున్నారు.

 అన్నీ సగం.. సగం పనులే..

ఉమ్మడి జిల్లాలో పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమాల్లో పారిశుధ్య పనులు పక్కాగా చేశామని అధికారులు లెక్కలు చెప్తున్నప్పటికీ   చాలా గ్రామాలు, మండల కేంద్రాలు, పట్టణాల్లో ఏడి చెత్త ఆడనే దర్శనమిస్తోంది. పలు చోట్ల ఇండ్ల మధ్యగా వెళ్లే మురుగు కాల్వల్లో కనీసం పూడిక తీయలేదు.  విద్యుత్ సమస్యలు సగానికి పైగా పెండింగ్ లో ఉన్నాయి. ఆదిలాబాద్ జిల్లాలో వైకుంఠ ధామాలకు 398 కరెంట్ కనెక్షన్లు ఇవ్వాల్సి ఉండగా 10 మాత్రమే ఇచ్చారు. థర్డ్ లైన్ కు సంబంధించి 2,271 విద్యుత్  స్తంభాలు ఏర్పాటు చేయాల్సి ఉండగా 1,079 మాత్రమే ఏర్పాటు చేశారు.  వంగిన స్తంభాలు, విద్యుత్ వైర్లు మీటర్లు బిగించడం వంటి పనులు సగానికి పైగా పెండింగ్ లోనే ఉన్నాయి. ఇప్పటికీ ఇండ్ల పై నుంచి వెళ్లే కరెంట్​ తీగలు అక్కడక్కడ వేలాడుతూనే ఉన్నాయి.  

పట్టణ ప్రగతి ఎక్కడా కనిపించలే..

మున్సిపాలిటీలో పట్టణ ప్రగతి అంటూ ఆఫీసర్లు, లీడర్లు హడావుడి  తప్ప.. ఏమీ చేయలే. ఆఫీసర్లు, ప్రజాప్రతినిధులు వస్తేనే పట్టణ ప్రగతి నిర్వహిద్దామని వార్డు ప్రజలు బహిష్కరిస్తే ఇప్పటి వరకు ఎవరూ ఇటువైపు రాలే. ఓసీపీ ముంపు  ప్రాంతమని మా వార్డులో అభివృద్ధి పనులు చేస్తలేరు. 

- సంధ్యారాణి, కౌన్సిలర్, నస్పూర్ 

పల్లె ప్రగతిని గాలికి వదిలేసిన్రు..


బీమారంలో 150 మీటర్ల మేర డ్రైనేజీ లు నిండి ఇండ్ల ముందు నీరు నిలవడంతో రోగాల బారిన పడుతున్నాం.   పల్లె ప్రగతి పనుల్లో భాగంగా అధికారులు, ప్రజాప్రతినిధులు అసలు మా కాలనీకే రాలేదు. ఇటీవలే ఓ బాలుడు డ్రైనేజీలో పడడంతో అక్కడే ఉన్న పంచాయతీ సెక్రటరే  కాపాడారు. ‘పల్లె ప్రగతి’ ఎక్కడ చేసిండ్రో ఏమో వాళ్లకే 
తెలియాలి.                                                      - 

బానోత్ మధుకర్, బీమారం