
రాష్ట్రంలో వర్షాలు దంచికొడుతున్నాయి. వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. ఎడతెరిపిలేని వర్షాల కారణంగా తెలంగాణ ప్రభుత్వం రెండు రోజుల పాటు స్కూళ్లకు సెలవులు ప్రకటించింది. జులై 20వ తేదీ గురువారం, జులై 21వ తేదీ శుక్రవారం రెండు రోజుల పాటు అన్ని విద్యాసంస్థలకు సెలవులు ప్రకటిస్తున్నట్లు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ట్వీట్ చేశారు. అయితే ఈ ప్రకటనపై విద్యార్థులు తల్లిదండ్రులు, నెటిజన్లు, విపక్షాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.
రాష్ట్రంలో మూడ్రోజులుగా కుండపోత వర్షాలు కురుస్తుంటే..జులై 20వ తేదీ సెలవులు ఇస్తున్నట్లు ప్రకటించటంపై తీవ్రంగా మండిపడుతున్నారు. అది కూడా పిల్లలు స్కూల్‌కు వెళ్లిన తర్వాత సెలవుల ప్రకటన చేయడంపై విమర్శలు వస్తున్నాయి.
స్కూళ్లకు వెళ్లిన తర్వాత ప్రకటించడమేంటి..
మంత్రి సబితా ఇంద్రారెడ్డి గారు.. రాష్ట్రంలో భారీ వర్షాలు పడతాయని మూడు రోజుల క్రితమే వాతావరణ కేంద్ర అధికారులు ప్రకటించారు. మొన్నటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా పూర్తిగా మబ్బు పట్టి రోజంతా జల్లులు పడుతూనే ఉన్నాయి. జులై 20వ తేదీ అందరు కూడా స్కూళ్లకు వెళ్లేందుకు సిద్ధమయ్యారు. చాలామంది విద్యార్థులు స్కూళ్లకు చేరుకున్న తర్వాత ఈరోజు, రేపు సెలవు అని ప్రకటించడం ఏంటి ?.. కనీసం రేపటి నుంచి సెలవులు అని ప్రకటించినా.. మీ నిర్ణయం సరైనదిగా అనిపించేది. ప్రభుత్వంలో ఉన్నవాళ్లు అప్రమత్తంగా లేకుంటే ఇలాంటి నిర్ణయాలే వస్తాయి." అంటూ ఓ నెటిజన్ తీవ్ర స్థాయిలో మండిప్డడారు.
స్కూళ్లకు వెళ్లాక ప్రకటన..రోజు పూర్తయ్యాక ఉత్తర్వులు..
వర్షాల నేపథ్యంలో జులై 20వ తేదీన విద్యార్థులంతా స్కూళ్లకు వెళ్లిపోయాక సెలవులపై ప్రకటన చేసిన ప్రభుత్వం..రోజు పూర్తయ్యాక అంటే జులై 20వ తేదీ సాయంత్రం ఉత్తర్వులు జారీ చేయడం విశేషం. అయితే జులై 20, 21 తేదీలతో పాటు రాష్ట్ర ప్రభుత్వ తీరుపై నెటిజన్లు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. తెలంగాణ ప్రభుత్వ పాలన పడకేసింది...సోయి లేకుండా ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రభుత్వాన్ని నడుపుతున్నారంటున్న విపక్షాల విమర్శలకు సర్కారు తీరు నిదర్శనంగా నిలుస్తోందంటూ బహిరంగంగానే విమర్శిస్తున్నారు.