జూన్‌ 8 వరకు పంట కొనుగోలు కేంద్రాలు కొనసాగించాలి: సీఎం కేసీఆర్

 జూన్‌ 8 వరకు పంట కొనుగోలు కేంద్రాలు కొనసాగించాలి: సీఎం కేసీఆర్

రాష్ట్రంలో పంట కొనుగోలు కేంద్రాలను జూన్‌ 8 వరకు కొనసాగించనున్నట్లు సీఎం కేసీఆర్‌ ప్రకటించారు. మొదట మే 31 వరకే కొనుగోలు కేంద్రాలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అయితే పలు ప్రాంతాల నుంచి వచ్చిన విజ్ఞప్తులతో జూన్‌ 8 వరకు కొనుగోలు కేంద్రాలు కొనసాగించాలని అధికారులను ఆదేశించారు కేసీఆర్. వర్షాలు రాకముందే రైతులు పంటలను కొనుగోలు కేంద్రాలకు తీసుకొచ్చి అమ్ముకోవాలని సూచించారు. ధాన్యం సేకరణ ఇంకా పూర్తి కాలేదని… అనేక గ్రామాల్లో ధాన్యం సేకరించాల్సి ఉందని వార్తలు వచ్చాయి. మరోవైపు ఇప్పటికే ప్రభుత్వం రికార్డుస్థాయిలో ధాన్యం సేకరణ చేసింది. దేశ వ్యాప్తంగా యాసంగి సీజన్‌ ధాన్యం సేకరణలో తెలంగాణ నంబర్‌వన్‌ స్థానంలో ఉందని భారత ఆహార సంస్థ ప్రకటించింది. ఇప్పటికే తెలంగాణ 91.07 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ లక్ష్యంగా పెట్టుకోగా సగానికి పైగా సేకరణ పూర్తి చేసిందని తెలిపింది.