71,468 ఎకరాలతో టాప్ లో వేరుశెనగ : వ్యవసాయశాఖ

71,468 ఎకరాలతో టాప్ లో వేరుశెనగ : వ్యవసాయశాఖ
  • లక్షా 71వేల ఎకరాల్లో యాసంగి సాగు
  • సర్కారుకు నివేదిక ఇచ్చిన వ్యవసాయశాఖ
  • 71,468 ఎకరాలతో టాప్ లో వేరుశెనగ
  • 15,467 ఎకరాల్లో మక్కలు వేసిన రైతులు
  • ఇప్పుడిప్పుడే షురూ అవుతున్న వరి నాట్లు

హైదరాబాద్, వెలుగు : యాసంగిలో ఇప్పటి వరకు లక్షా 71 వేల ఎకరాల్లో పంటల సాగు నమోదైంది. ఈ మేరకు వ్యవసాయశాఖ ప్రభుత్వానికి నివేదిక అందించింది.  రాష్ట్ర వ్యాప్తంగా 92,697 మంది రైతులు యాసంగిలో పంటలు సాగుచేసినట్లు అధికారులు గుర్తించారు. 89,699 ఎకరాల్లో  ఆహారపంటలు, సాగయ్యాయి. వీటిలో మిల్లెట్స్‌ 64,981 ఎకరాల్లో సాగు చేసినట్లు వ్యవసాయశాఖ తన నివేదికలో పేర్కొంది.

టాప్‌లో నాగర్‌ కర్నూల్‌ జిల్లా..

ఈ యాసంగి సీజన్​లో ఇప్పటి వరకు అత్యధికంగా నాగర్‌ కర్నూల్‌ జిల్లాలో 35,388 ఎకరాల్లో పంటలు సాగైనట్లు అధికారులు గుర్తించారు. ఆ తరువాత నిజామాబాద్‌ జిల్లాలో 31,856 ఎకరాల్లో పంటల సాగు చేశారు.  అలాగే, కామారెడ్డి జిల్లాలో 23,890 ఎకరాల్లో, వనపర్తి జిల్లాలో 23,378 , వికారాబాద్ జిల్లాలో 18,456 ఎకరాల్లో యాసంగి పంటల  సాగు నమోదైంది. మంచిర్యాల జిల్లాలో నేటికీ యాసంగి పంటల సాగు షురూ కాలేదు. పెద్దపల్లి, మెదక్‌, భూపాలపల్లి, మేడ్చల్‌, యాదాద్రి జిల్లాల్లో 50 ఎకరాలలోపే పంటలు సాగయ్యాయి. 18 జిల్లాల్లో నామమాత్రంగానే సాగైనట్లు  అధికారులు ప్రభుత్వానికి ఇచ్చిన నివేదికలో పేర్కొన్నారు. 

ఇప్పటిదాకా 4,814 ఎకరాల్లో వరి నాట్లు

యాసంగిలో వరి సాగు ఇప్పుడిప్పుడే షురూ అవుతోంది. వానకాలం ముందస్తుగా సాగు చేసిన రైతులు పంట కోసి మళ్లీ నార్లు పోసి యాసంగి సాగు షురూ చేశారు. వరి ఇప్పటి వరకు  4,814 ఎకరాల్లోనే వరి నాట్లు జరిగినట్లు అధికారులు పేర్కొన్నారు. ఈయేడు వరిపై ఆంక్షలు లేకపోవడంతో రికార్డు స్థాయిలో సాగవుతుందన్న అంచనాలున్నాయి. నాలుగేండ్లుగా యాసంగిలో వరి సాగు పెరుగుతూ వస్తోంది.  2019 యాసంగిలో 39.31 లక్షల ఎకరాల్లో వరి సాగు కాగా.. 2020లో  ఆంక్షలు లేక పోవడంతో అత్యధికంగా 52.80 లక్షల ఎకరాల్లో వరిపంట సాగైంది. యాసంగి వరి సాగులో ఇదే రికార్డు కావడం గమనార్హం. నిరుడు యాసంగి (2021)లో బాయిల్డ్‌ రైస్‌ పై వివాదం ఏర్పడిన నేపథ్యంలో వరి సాగు పెరిగితే కొనుగోళ్లు కష్టమవుతుందని భావించిన సర్కారు వరి వద్దే వద్దు అని ఆంక్షలు పెట్టింది. అయినప్పటికీ రాష్ట్ర వ్యాప్తంగా 35.84 లక్షల ఎకరాల్లో వరి సాగు జరిగింది.  ప్రత్యామ్నాయ పంటలు లేని నేపథ్యంలో ఈ యాసంగిలో వరి అత్యధికంగా సాగు చేసే అవకాశాలున్నాయి.  వానాకాలంలోనూ అత్యధికంగా 65.54 లక్షల ఎకరాల్లో వరి సాగై రికార్డు సృష్టించగా.. యాసంగిలోనూ వరి సాగు రికార్డు సృష్టించే అవకాశం ఉందని ఎక్స్‌పర్ట్స్‌ అంటున్నరు.

వరి తరువాత మక్కలే ఎక్కువ..

ప్రతి యేటా యాసంగిలో సాధారణంగా వరి, మక్క పంటలు మాత్రమే ఎక్కువగా సాగవుతాయి. ఆ తరువాత బెంగాల్‌గ్రామ్‌ (పప్పుశనగ), వేరుశనగ పంటల సాగు నమోదవుతూ వస్తోంది.  ఈ యేడు రాష్ట్రంలో సాగైన అన్ని పంటల్లో ఇప్పటి వరకు రెండు పంటలే ఎక్కువగా సాగైనట్లు అధికారులు గుర్తించారు.  వేరుశనగ 71వేల ఎకరాలకుపైగా సాగు నమోదు కాగా, మక్కలు 15,467 ఎకరాల్లో వేశారు. నిరుడు యాసంగిలో మక్కలు 5.54 లక్షల ఎకరాల్లో సాగు చేశారు. గత ఏడాది మక్కల తరువాత బెంగాల్‌గ్రామ్‌(పప్పుశనగ) 3.83 లక్షల ఎకరాల్లో సాగైంది. ఈయేడు ఇప్పటి వరకు ప్పప్పు శనగ 53,634 ఎకరాల్లోనే సాగు చేయడం గమనార్హం.

వేరుశనగ ఎక్కువేస్తున్నరు..

ఈ సీజన్‌లో  ఇప్పటి వరకు అత్యధికంగా ఆయిల్‌ సీడ్స్‌ సాగు చేసినట్లు వ్యవసాయశాఖ అధికారుల క్షేత్రస్థాయి పరిశీలనలో వెల్లడైంది. ఆయిల్‌ సీడ్‌ పంటలు 74,165 ఎకరాల్లో సాగైతే ఇందులో ప్రధానంగా  వేరుశనగ పంట 71,468 ఎకరాల్లో నమోదైనట్లు అగ్రికల్చర్‌ అధికారులు తేల్చారు. రాష్ట్రంలో 39 వేల మంది రైతులు వేరుశనగ సాగు చేసినట్లు  గుర్తించారు. నాగర్‌ కర్నూల్‌ జిల్లాలో అత్యధికంగా 29,327 ఎకరాల్లో, వనపర్తిలో 15,040 ఎకరాల్లో , ఆ తరువాత వికారాబాద్‌లో 12,847 ఎకరాల్లో వేరుశనగ సాగు  నమోదైంది.