
- రెండేండ్లుగా ఆగిన రూ.840.69 కోట్లు
- రాష్ట్ర వాటా రూ.310 కోట్లు ఇవ్వడంతో రైతులకు పరిహారం చెల్లిస్తున్న బీమా సంస్థలు
హైదరాబాద్, వెలుగు: రైతులు రెండేండ్లుగా ఎదురు చూస్తున్న ఫసల్ బీమా పరిహారానికి ఎట్టకేలకు పరిష్కారం లభించింది. ఫసల్ బీమా రాష్ట్ర వాటా కింద ఇవ్వాల్సిన పాత బాకీ ప్రీమియం రూ.310 కోట్లు రాష్ట్ర సర్కార్ చెల్లించింది. దీంతో రూ.840.69 కోట్ల పరిహారం రైతులకు అందింది. ఇప్పుడు రాష్ట్రం తన వాటా ప్రీమియం చెల్లించడంతో బీమా సంస్థలు రైతులకు పంట నష్ట పరిహారం చెల్లిస్తున్నాయి. 2018–19, 2019–20లలో రాష్ట్రం ప్రభుత్వం నిధులు ఇవ్వక ఫసల్ బీమాను పక్కన పెట్టేసింది.
రైతులు వాటా చెల్లించినా రాష్ట్ర ప్రభుత్వం ప్రీమియం కట్టలేదు. దీంతో కేంద్రం కూడా పెండింగ్పెట్టింది. ఈ నేపథ్యంలో బీమా కంపెనీలు పంట నష్టపరిహారం చెల్లింపులు నిలిపేశాయి. ఫలితంగా రైతులకు రూ.840.69 కోట్ల పరిహారం పెండింగ్ పడింది. సర్కార్ నిర్లక్ష్యంపై ఆదిలాబాద్ రైతులు కోర్టును ఆశ్రయించారు. కోర్టు ఆదేశంతో దిగి వచ్చిన రాష్ట్ర సర్కారు రూ.310 కోట్లు ప్రీమియం చెల్లించింది. కేంద్రం కూడా వాటా రిలీజ్ చేయడంతో బీమా సంస్థలు లబ్ధిదారులైన రైతులు ఖాతాల్లో నష్టపరిహారాన్ని జమ చేస్తున్నాయి.