
- జిల్లాలో 25,500 ఎకరాల్లో దెబ్బతిన్న పంటలు
- అధికంగా వరి పంటకు నష్టం
- 699 ఎకరాల్లో ఇసుక మేటలు, తొలగింపునకు ‘ఉపాధి’ కూలీలతో పనులు
కామారెడ్డి, వెలుగు: గత నెల చివరి వారంలో కురిసిన భారీ వర్షాలు, వరదలతో కామారెడ్డి జిల్లా అతలాకుతలమైంది. రోడ్లు, బ్రిడ్జిలు, చెరువులు ధ్వంసం కావడంతో పాటు భారీగా పంట నష్టం వాటిల్లింది. సుమారు 80 వేల ఎకరాలు నీట మునిగినట్లు అధికారులు అంచనా వేశారు. వరద నీరు తగ్గిన తర్వాత గ్రామాల వారీగా సర్వే నిర్వహించి, జిల్లావ్యాప్తంగా 24,809 మంది రైతులకు చెందిన 25,500 ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నట్లు అధికారులు నిర్ధారించగా, నివేదికను ప్రభుత్వానికి పంపనున్నారు. వరి పంట 16 వేల ఎకరాలు, సోయాబీన్ 7,500 ఎకరాలు, మక్క 1,000 ఎకరాలు, ఇతర పంటలు 2,000 ఎకరాల్లో దెబ్బతిన్నాయి.
భారీ వర్షాల ప్రభావం..
ఆగస్టు 27, 28 తేదీల్లో జిల్లాలో రికార్డు స్థాయిలో వర్షపాతం నమోదైంది. వాగులు పొంగి ప్రవహించడంతో పలు చెరువులు తెగిపోగా, మరికొన్ని బుంగలు పడ్డాయి. అనేక చోట్ల 3 నుంచి 4 రోజులు వరద నీరు తగ్గలేదు. దీనివల్ల పంటలు కొట్టుకుపోవటం, నేలకొరగడంతోపాటు ఇసుక మేటలు పేరుకుపోయాయి. ఎల్లారెడ్డి, కామారెడ్డి, జుక్కల్ నియోజకవర్గాలతో పాటు నాగిరెడ్డిపేట, బిచ్కుంద, మద్నూర్, లింగంపేట, మహమ్మద్‌నగర్, రాజంపేట, భిక్కనూరు, గాంధారి, తాడ్వాయి మండలాల్లో వేలాది ఎకరాల పంటలు దెబ్బతిన్నాయి.
నాగిరెడ్డిపేట మండలంలో అత్యధిక నష్టం
జిల్లాలో అత్యధికంగా నాగిరెడ్డిపేట మండలంలో వరి పంట దెబ్బతిన్నది. ఇక్కడ 2,665 ఎకరాల్లో పంటలు దెబ్బతిని, 2,389 మంది రైతులు నష్టపోయారు.
ఇసుక మేటలు భారీ వరద ప్రవాహంతో 699 ఎకరాల్లో ఇసుక మేటలు పేరుకున్నాయి. ఎక్కువగా వరి పంటలే నష్టపోయాయి. లింగంపేట, నాగిరెడ్డిపేట, కామారెడ్డి, రాజంపేట, బిచ్కుంద, నిజాంసాగర్ మండలాల్లో ఈ సమస్య ఎక్కువగా కనిపించింది. ఇసుక మేటలను తొలగించేందుకు ఉపాధి హామీ పథకం కింద కూలీలతో పనులు చేపట్టనున్నారు. ఇప్పటికే లింగంపేట మండలంలో శుక్రవారం నుంచి ఈ పనులు ప్రారంభించారు.