- ప్రాథమిక సమాచారం కూడా ఇయ్యలే.. నష్టం అంచనా వేయని వ్యవసాయశాఖ
- ఇప్పటికీ క్రాప్ డ్యామేజ్ నమోదు చేయలే.. ప్రభుత్వం చెప్పలేదంటున్న అధికారులు
- రెండు మూడేండ్లుగా ఇదే తంతు.. పంట మునిగితే రైతు మునుగుడేనా?
- కనీసం ఫసల్ బీమా కూడా అమలు చేస్తలేరు
హైదరాబాద్, వెలుగు : రాష్ట్రంలో కురిసిన భారీ వర్షాల వల్ల ఈ సీజన్‌లో సాగైన పంటలకు పెద్ద ఎత్తున నష్టం వాటిల్లింది. కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టి రైతులు వేసిన పంటలు అధిక వర్షాలకు తుడిచిపెట్టుకుపోయినా సర్కారులో చలనం లేదు. పంట నష్టం అంచనా వేసి కేంద్రానికి పంపించాల్సిన రాష్ట్ర సర్కారు తమకేం సంబంధం లేదన్నట్లు వ్యవహరిస్తోంది. ఇటీవల పార్లమెంట్‌లో కేంద్రం ప్రకటించిన పంట నష్టం జాబితాలో రాష్ట్ర ప్రభుత్వం వివరాలు ప్రకటించక పోవడంతో కేంద్రానికి నివేదిక అందలేదనట్లు స్పష్టమైంది. నెల రోజులుగా కురుస్తున్న వానలకు రాష్ట్రంలో సాగైన పంటల్లో కనీసం నష్టం జరిగిందని ప్రాథమిక సమాచారం కూడా కేంద్రానికి ఇవ్వలేదు. వ్యవసాయశాఖ కనీసం స్పందించకపోగా ఇప్పటి వరకు పంట నష్టం అంచనాలు రూపొదించాలని నిర్ణయం తీసుకోకపోవడం గమనార్హం. రైతు ప్రభుత్వంగా చెప్పుకునే సర్కారు ప్రకృతి విపత్తులతో నిండా మునిగిన రైతులను ఆదుకునే ప్రయత్నమే మొదలు కాలేదు. ఇప్పటి వరకు పంట నష్టంపై ఎన్యూమరేషన్ చేయాలని సర్కారు నుంచి ఆదేశాలు రాలేదని అధికారులు అంటున్నారు. ప్రభుత్వం నుంచి కానీ, వ్యవసాయ శాఖ నుంచి పంట నష్టం అంచనా వేయాలని ఆదేశాలు రాలేదని క్షేత్ర స్థాయి అధికారులు చెబుతున్నారు.
1500 కోట్లకుపైగా నష్టం!
రాష్ట్రంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వానలకు రాష్ట్రవ్యాప్తంగా రూ.1500 కోట్లకు పైగా విలువైన పంటలకు నష్టం వాటిల్లింది. ఈ సీజన్ లో ఇప్పటి వరకు 72 లక్షల ఎకరాల్లో పంటలు సాగు జరిగింది. జూన్ ప్రారంభం నుంచి సాగు కాగా జూన్ 15 తరువాత పంటల సాగు ఊపందుకుంది. పత్తి, మక్క, ఇతర పంటలన్నీ దాదాపు మొలక దశలోనే ఉన్నాయి. వర్షాలకు ప్రారంభ దశలో ఉన్న పంటలన్నీ పూర్తిగా దెబ్బతిన్నాయి. పెసలు, సోయా, మినుము పంటలు తుడిచిపెట్టుకుపోయాయి. వర్షాలు భారీగా కురిసిన ఆదిలాబాద్, నిజామాబాద్, నిర్మల్, మంచిర్యాల, పెద్దపల్లి, వరంగల్, భూపాలపల్లి, ములుగు, మహబూబాబాద్, భద్రాద్రి జిల్లాల్లో పంటలన్నీ ముంపుకు గురై మొలక దశలోనే మురిగిపోయాయి. మళ్లీ రెండోసారి విత్తనాలు వేసుకోలేని పరిస్థితి. రాష్ట్రంలో ఈ సీజన్‌లో 72 లక్షల ఎకరాల్లో సాగు కాగా అందులో 15 లక్షల ఎకరాలకు పైగా పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయి. రైతుకు పెట్టుబడి ఎకరానికి రూ.9 వేల నుంచి రూ.10 వేలకు పైగా ఖర్చయింది. ఇలా రూ.1500 కోట్లకు పైగా నష్టం జరినట్లు ప్రాథమిక అంచనాలు ఉన్నాయి.
మూడేళ్లుగా రైతు మునుగుడే..
గత రెండు, మూడేళ్లుగా ప్రకృతి విపత్తులు సంభవించి లక్షల ఎకరాల్లో రైతులు పంట నష్టపోతున్నా సర్కారు నుంచి పైసా సాయం అందలేదు. ప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజన పథకం 2020 నుంచి అమలు చేయడం లేదు. కొత్తగా ఎలాంటి పంట బీమా పథకాన్ని ప్రకటించలేదు. పంట బీమా అమలు చేయక, అటు ఇన్‌పుట్ సబ్సిడీ ఇవ్వకపోవడంతో రైతులు నిండా మునుగుతున్నరు. చేసిన కష్టం, పెట్టిన పెట్టుబడి ఎకరానికి రూ.30 నుంచి రూ.40 వేల వరకు నష్టపోతున్నా ఒక్క రూపాయి కూడా సర్కారు సాయం అందడంలేదు. దీంతో పంట మునిగితే రైతు మునగాల్సిన పరిస్థితి నెలకొంది.
