కాళేశ్వరం పక్కనే ఉన్నా.. పంటలెండుతున్నయ్!

కాళేశ్వరం పక్కనే ఉన్నా.. పంటలెండుతున్నయ్!
  • 20 గ్రామాల్లో సాగుకు నోచుకోని 40 వేల ఎకరాలు      
  • పోతారం ఎత్తిపోతల పథకానికి రైతుల డిమాండ్​

పెద్దపల్లి, వెలుగు: పెద్దపల్లి జిల్లా మంథని మండలంలో గోదావరి నది ప్రవహిస్తున్నా, కాళేశ్వరం బ్యారేజీలు నీళ్లతో నిండుకుండలా ఉన్నా గోదావరి పరివాహక గ్రామాల్లో పొలాలు నీళ్లు లేక ఎండిపోతున్నాయి. మంథని, ముత్తారం, రామగిరి మండలాల్లోని టేల్​ఎండ్​20 గ్రామాల్లో దాదాపు 40 వేల ఎకరాలు సాగుకు నోచుకోవడం లేదు. నీళ్లు లేక పంటలు సాగు చేసేందుకు 14 ఏండ్లుగా రైతులు నానా అవస్థలు పడుతున్నారు. గతంలో వరి సాగు చేసే రైతులంతా గత్యంతరం లేని పరిస్థితుల్లో పత్తి వేస్తున్నా గిట్టుబాటు కాక ఆర్థికంగా నష్టపోతున్నారు. తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత సీఎం కేసీఆర్​ చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా మంథని నియోజకవర్గంలోని గ్రామాలకు సాగు నీరందుతుందని ఆశించారు. కాళేశ్వరం ప్రాజెక్టు పనులు సైతం పూర్తయ్యాయి. మంథని మండలంలోనే సరస్వతి, గాయత్రి బ్యారేజీలున్నా మండలానికి మాత్రం నీరందడం లేదు. 

ఎస్సారెస్పీ కెనాల్స్ ​ధ్వంసం
గుండారం రిజర్వాయర్​ కింది ప్రాంతమైన మంథని, రామగిరి, ముత్తారం మండలాల్లోని పలు గ్రామాలకు 14 ఏండ్లుగా ఎస్సారెస్పీ నీరు అందక రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పెద్దపల్లి జిల్లా మంథని నియోజకవర్గంలోని పంట పొలాలకు ఎస్సారెస్సీ కెనాల్​ద్వారా 1980 నుంచి నీరందేది. రామగిరి మండలం నుంచి గుండారం రిజర్వాయర్​ ద్వారా దాదాపు 40 వేల ఎకరాలు సాగయ్యేవి. 2007 నుంచి ఓసీపీల విస్తరణతో గ్రామాలతో పాటు కెనాల్స్​ కూడా ధ్వంసమయ్యాయి. సింగరేణి సంస్థ కెనాల్స్​ను నిర్మించే ప్రయత్నం చేసినా అవి పూర్తి కాకపోగా పనికి రాకుండాపోయాయి. 14 ఏండ్లుగా రైతులు సాగునీటి కోసం ప్రభుత్వాలను కోరుతూనే ఉన్నారు. నియోజకవర్గంలోని 20 గ్రామాలకు సాగునీరు అందాలంటే ఎత్తిపోతల పథకం ప్రారంభించాలని రైతులు డిమాండ్​ చేస్తున్నారు. సాగు నీటి కోసం బాధిత రైతులంతా పోరుబాట పట్టారు. సింగరేణి ఓసీపీల విస్తరణ కొనసాగుతూనే ఉంటుంది కాబట్టి, ఎస్సారెస్సీ కెనాల్స్​తో పనిలేకుండా గోదావరిపై నిర్మించిన బ్యారేజ్​ల నుంచి నీరు అందించాలని, దాని కోసం పోతారం వద్ద లిఫ్ట్​ఏర్పాటు చేయాలని కోరుతున్నారు.

టేల్ ​ఎండ్ ​వరకు నీరందించాలి
ఎస్సారెస్సీ టేల్​ఎండ్​ వరకు లిఫ్ట్​ ద్వారా సాగు నీరందించాలి. ఎస్సారెస్పీ కెనాల్స్​ ధ్వంసమవడంతో వాటి ద్వారా సాగు నీరు అందే పరిస్థితి లేదు. దాదాపు 15 ఏండ్లుగా సాగునీటి కోసం మంథని నియోజకవర్గంలోని 20 గ్రామాల రైతు లు  ఇబ్బందులు పడుతున్నారు. పక్కనే గోదావరి ఉన్నా ఫలితం లేదు. మంథని మండలం పోతారం వద్ద గోదావరిపై లిఫ్ట్​ ఏర్పాటు చేసి బాధిత గ్రామాల్లోని చెరువులు, కుంటలు నింపాలి. 
- ఊదరి శంకర్, రైతు, గుంజపడుగ

సమస్యకు పరిష్కారం చూపాలె
పక్కనే గోదావరి ఉన్నా మంథని నియోజకవర్గంలోని చాలా గ్రామాలకు సాగు నీరందడం లేదు. ఎస్పారెస్పీ ద్వారా గతంలో సాగు నీరందినా, రామగిరి మండలంలో సింగరేణి ఓసీపీల విస్తరణలో కెనాల్స్​ ధ్వంసమయ్యాయి. రైతులకు సాగు నీరందాలంటే మంథని మండలం పోతారం వద్ద లిఫ్ట్​ ఏర్పాటు చేయాలి. అప్పుడే సాగునీటి సమస్య పరిష్కారమైతది.
- చందుపట్ల సునీల్​రెడ్డి, బీజేపీ మంథని నియోజకవర్గం ఇన్​చార్జి