
- భారీ వర్షాలు, వరదలతో 4 వేల కోట్ల నష్టం
- 2 లక్షలకు పైగా ఎకరాల్లో నీట మునిగిన పంటలు
- భారీ వర్షాలు, వరదలతో 4 వేల కోట్ల నష్టం
- ప్రాథమికంగా అంచనా వేసిన అధికారులు.. రిపోర్టును కేంద్రానికి పంపాలని సీఎం ఆదేశం
- ఇప్పటి వరకు 16 మంది మృతి.. షెల్టర్లలో 2 వేల మందికి ఆశ్రయం
- కొట్టుకుపోయిన రోడ్లు, కూలిన బ్రిడ్జీలు
- దెబ్బతిన్న కరెంట్ పోల్స్, ట్రాన్స్‌ఫార్మర్లు.. చెరువులు, కుంటలకు గండ్లు
- కామారెడ్డి, మెదక్, నిర్మల్, సిరిసిల్ల, నిజామాబాద్ జిల్లాల్లోనే ఎక్కువ లాస్
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలు, వరదలతో పెద్ద ఎత్తున నష్టం వాటిల్లింది. లక్షలాది ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయి. వేలాది ఇండ్లు డ్యామేజ్ అయ్యాయి. వందలాది ఇండ్లు కూలిపోయాయి. చెరువులు, కుంటలకు గండ్లు పడ్డాయి. రోడ్లు ఎక్కడికక్కడ తెగిపోయాయి. కరెంట్ లైన్లు దెబ్బతిన్నాయి. గత మూడ్రోజులుగా ఉత్తర తెలంగాణను వణికిస్తున్న వర్షాలతో కామారెడ్డి, మెదక్, నిర్మల్, సిరిసిల్ల, నిజామాబాద్ జిల్లాల్లో ఎక్కువగా నష్టం జరిగింది.
రాష్ట్రవ్యాప్తంగా దాదాపు రూ.4 వేల కోట్ల మేర నష్టం వాటిల్లినట్టు అధికారులు ప్రాథమికంగా అంచనా వేశారు. ఈ నివేదికను వెంటనే కేంద్ర ప్రభుత్వానికి పంపించి నష్ట పరిహారం కోరాలని అధికారులను సీఎం రేవంత్ ఆదేశించారు. వర్షాలు తగ్గుముఖం పట్టిన తర్వాత అధికారులు పూర్తి స్థాయిలో సర్వే చేసి నష్టాన్ని అంచనా వేయనున్నారు. కాగా, వాతా వరణ శాఖ హెచ్చరికలతో ప్రభుత్వం ముందస్తు చర్యలు చేపట్టడంతో భారీ ప్రాణ, ఆస్తి నష్టం తప్పిందని అధికారులు తెలిపారు.
వరద ప్రభావిత, ముంపు ప్రాంతాల ప్రజలను ముందే ఖాళీ చేయించి పునరావాస కేంద్రాలకు తరలించామని చెప్పారు. వరదలతో నిరాశ్రయులైన 2 వేల మందికి షెల్టర్లలో ఆశ్రయం కల్పించామన్నారు. యుద్ధ ప్రాతిపదికన రెస్క్యూ ఆపరేషన్స్ చేపట్టి వరదల్లో చిక్కుకున్నోళ్లను కాపాడామని వెల్లడించారు. వర్షాలు, వరదల కారణంగా ఇప్పటి వరకు 16 మందికి పైగా మృతి చెందినట్టు సమాచారం ఉన్నదని పేర్కొన్నారు.
ధ్వంసమైన రోడ్లు..
భారీ వర్షాల కారణంగా రాష్ట్ర వ్యాప్తంగా 1,500కు పైగా ఇండ్లు కూలిపోయాయి. మరో 2 వేలకు పైగా ఇండ్లు దెబ్బతిన్నాయి. ఈ మేరకు సర్కారుకు నివేదికలు అందాయి. ఆర్‌అండ్‌బీ, పంచాయతీరాజ్, ఇరిగేషన్, విద్యుత్తదితర శాఖల పరిధిలో భారీ నష్టం వాటిల్లింది. అనేక చోట్ల హైవేలు, రోడ్లు, బ్రిడ్జిలు ధ్వంసమయ్యాయి. దీంతో వందలాది గ్రామాలకు రాకపోకలు స్తంభించాయి. రాష్ట్ర వ్యాప్తంగా 112 చెరువులకు గండ్లు పడ్డాయి.
వందల కిలోమీటర్ల మేర ఆర్‌అండ్‌బీ రోడ్లు దెబ్బతినగా, వాటి రిపేర్లకు రూ.1,250 కోట్లు అవసరమవుతాయని ఆ శాఖ అంచనా వేసింది. బ్రిడ్జిల రిపేర్లకు మరో రూ.150 కోట్లు అవసరమని లెక్కగట్టింది. పంచాయతీరాజ్రోడ్లు, మిషన్‌భగీరథ పైపులైన్లు దెబ్బతినగా.. వాటి రిపేర్లకు రూ.380 కోట్లు అవసరమని ఆ శాఖ అధికారులు అంచనా వేశారు. కరెంట్‌స్తంభాలు కూలడం, వైర్లు తెగిపడడం, విద్యుత్ సబ్‌స్టేషన్లలోకి నీళ్లు చేరడంతో ట్రాన్స్‌కోకు భారీగా నష్టం వాటిల్లింది. రిపేర్లకు రూ.161 కోట్లు అవసరమని ఆ శాఖ అంచనా వేసింది.
కామారెడ్డి కకావికలం..
భారీ వర్షాలు, వరదలతో కామారెడ్డి కకావికలమైంది. ఈ జిల్లాలో పెద్ద ఎత్తున నష్టం వాటిల్లింది. వాగులు ఉప్పొంగి, చెరువులు, కుంటల కట్టలు తెగడంతో పొలాల్లోకి వరద చేరింది. చాలా చోట్ల ఇసుక మేటలు, కంకర రాళ్లు చేరి పంటలు దెబ్బతిన్నాయి. జిల్లాలోని 249 గ్రామాల్లో 76,984 ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నట్టు అధికారులు ప్రాథమికంగా అంచనా వేశారు.
44,077 ఎకరాల్లో వరి, 13,097 ఎకరాల్లో మక్క, 9,102 ఎకరాల్లో సోయా, 9,782 ఎకరాల్లో పత్తి, 546 ఎకరాల్లో పెసర, 287 ఎకరాల్లో మినుము, 93 ఎకరాల్లో చెరకు పంట దెబ్బతిన్నట్లు గుర్తించారు. దీంతో 54,223 మంది రైతులు నష్టపోయారు. ఇక 60కి పైగా రోడ్లు ధ్వంసమయ్యాయి. కామారెడ్డి-–ఎల్లారెడ్డి రూట్‌లో నాలుగు చోట్ల బ్రిడ్జీలు కొట్టుకుపోయాయి. లింగంపేట మండలంలో నాలుగు చెరువుల కట్టలు పూర్తిగా తెగిపోగా, పదుల సంఖ్యలో చెరువులకు బుంగలు పడ్డాయి.
మెదక్ అతలాకుతలం..
మెదక్‌జిల్లా వ్యాప్తంగా 6,341 ఎకరాల్లో పంటలు నీట మునిగాయి. హవేలీ ఘనపూర్, మెదక్, చిన్నశంకరంపేట, టేక్మాల్, రామాయంపేట మండలాల్లో వరి, పత్తి, మక్క పంటలకు భారీగా నష్టం వాటిల్లినట్లు జిల్లా వ్యవసాయ అధికారి దేవ్ కుమార్ తెలిపారు. ఏఈఓలు క్షేత్రస్థాయిలో గ్రామాల వారీగా సర్వే చేస్తున్నారని, అది పూర్తయ్యాక నష్టంపై పూర్తిస్థాయిలో అంచనా వస్తుందన్నారు. జిల్లావ్యాప్తంగా 36 చెరువులకు గండ్లు పడ్డాయి. మరో 63 చెరువులు దెబ్బతిన్నాయి.
513 ఇండ్లు పాక్షికంగా దెబ్బతిన్నాయి. 36 ఆర్‌అండ్‌బీ రోడ్లు, 60 పంచాయతీరాజ్రోడ్లు డ్యామేజ్ అయ్యాయి. వివిధ మండలాల పరిధిలో 1,344 విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. 51 కిలో మీటర్ల మేర విద్యుత్ సరఫరా లైన్దెబ్బతింది. 460 డిస్ట్రిబ్యూషన్ట్రాన్స్ఫార్మర్లు, 3 పవర్ట్రాన్స్ఫార్మర్లు డ్యామేజీ అయ్యాయి. మెదక్ పట్టణ శివారులోని పిల్లికొటాల్ 33/11 కేవీ విద్యుత్ సబ్ స్టేషన్నీట మునిగింది. జిల్లావ్యాప్తంగా రూ.9.90 కోట్ల మేర నష్టం వాటిల్లినట్లు ట్రాన్స్‌కో అధికారులు చెబుతున్నారు.
నీట మునిగిన పంటలు..
భారీ వర్షాలు, వరదలతో లక్షలాది ఎకరాల్లో పంటలు నీట మునిగాయి. నదులు, చెరువులు, వాగులు వంకలు ఉప్పొంగడంతో పాటు కొన్ని చోట్ల కట్టలు తెగడంతో పొలాల్లోకి భారీగా వరద చేరింది. దీంతో ఇసుక మేటలు వేసి, కంకర రాళ్లు చేరి పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటి వరకు దాదాపు 2.20 లక్షల ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నట్టు వ్యవసాయ శాఖ ప్రాథమికంగా అంచనా వేసింది. వరి, పత్తి, మక్క పంటలు ఎక్కువగా దెబ్బతిన్నాయి. రూ.వందల కోట్లలో పంట నష్టం జరిగిందని అధికారులు చెబుతున్నారు.
వరద తగ్గిన తర్వాత ఒకట్రెండు రోజుల్లో పంట నష్టంపై పూర్తి క్లారిటీ వస్తుందని అంటున్నారు. పంట నష్ట పరిహారంపై ప్రభుత్వం నుంచి త్వరలోనే ప్రకటన రావొచ్చని పేర్కొంటున్నారు. కాగా, కామారెడ్డి, మెదక్, సంగారెడ్డి, సిద్దిపేట, నిర్మల్, భూపాలపల్లి, ములుగు, ఖమ్మం, నిజామాబాద్, జగిత్యాల, కరీంనగర్, యాదాద్రి భువనగిరి తదితర జిల్లాల్లో పంటలు ఎక్కువగా దెబ్బతిన్నట్టు క్షేత్రస్థాయి అధికారులు గుర్తించారు.
ఒక్క కామారెడ్డి జిల్లాలోనే 70 వేల ఎకరాలకు పైగా పంట నష్టం జరిగినట్టు ప్రాథమికంగా అంచనా వేశారు. ఏడాదిన్నర కాలంగా ప్రభుత్వం ఎకరానికి రూ.10వేల చొప్పున పంట నష్ట పరిహారం అందిస్తున్నది. కేంద్ర ప్రభుత్వ నిబంధనల మేరకు 33శాతం దెబ్బతిన్న పంటలనే గుర్తించే అవకాశముంది.
పంట నష్టంపై సమగ్ర నివేదిక ఇవ్వండి: తుమ్మల
పంట నష్టంపై సమగ్ర నివేదిక తయారు చేయాలని అధికారులను వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదేశించారు. ప్రస్తుతం వర్షాలు తగ్గుముఖం పట్టాయని, అధికారులు బృందాలుగా ఏర్పడి క్షేత్రస్థాయిలో పర్యటించి పంట నష్టం అంచనా వేయాలని ఆదేశించారు. శుక్రవారం వరద ప్రభావిత ప్రాంతాల జిల్లా కలెక్టర్లతో తుమ్మల మాట్లాడారు.
గోదావరిలో వరద ప్రవాహ ఉధృతి పెరగడంతో ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్లు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. లోతట్టు గ్రామాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. ఎలాంటి ప్రాణ నష్టం, ఆస్తి నష్టం జరగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని కలెక్టర్లకు సూచించారు.