లక్షల నిధులు.. మురుగు పాలు

లక్షల నిధులు.. మురుగు పాలు

గుర్రపు డెక్క తొలగించేందుకు రూ.40 లక్షలు ఖర్చు
అయినా కంప్లీట్ కాని పని
ఫండ్స్ను పక్కదారి పట్టించిన ఆఫీసర్లు?
విచారణకు బీజేపీ, కాంగ్రెస్ డిమాండ్

ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా రూ.40 లక్షలు ఖర్చు పెట్టారు. చెరువులో ఉన్న గుర్రపు డెక్కను తొలగించేందుకు మున్సిపల్ ఆఫీసర్లు ఖర్చు చేసిన నిధులివి. ఈ పని కోసం ఇంత నిధులు ఖర్చుపెట్టడంపై అనేక ఆరోపణలు వస్తున్నాయి. ఆఫీసర్లు పెద్ద మొత్తంలో ఫండ్స్ను పక్కదారి పట్టించారనే విమర్శలు వెల్లు వెత్తుతున్నాయి. భారీగా నిధులు ఖర్చు చేసినా గోరంత పని కూడా పూర్తికాలేదు. పైగా గుర్రపుడెక్క మరింత ఏపుగా పెరిగింది. సీన్ మొత్తం మళ్లీ మొదటికొచ్చింది. తిరిగి పనులు చేపడుతామని ఆఫీసర్లు చెబుతుండగా.. మళ్లీ ఇంకెన్ని పైసలు ఖర్చు చేస్తారోనని ప్రజలు కామెంట్ చేస్తున్నారు.

మహబూబ్నగర్, వెలుగు: జిల్లా కేంద్రంలో కోట్ల రూపాయలు వెచ్చించి అభివృద్ధి పనులు జరుగుతుండగా మున్సిపల్ ఆఫీసర్లు ఫండ్స్ను పక్కదారి పట్టిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. పట్టణ సుందరీకరణలో భాగంగా చేపడుతున్న మినీ ట్యాంక్బండ్ నిర్మాణంలో భారీ అక్రమాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. చెరువులో ఏపుగా పెరిగిన గుర్రపు డెక్కను పూర్తి స్థాయిలో తొలగించి బోటింగ్కు అనుకూలంగా మార్చాలని నిర్ణయించారు. ఫిబ్రవరిలో జీహెచ్ఎంసీ నుంచి గుర్రపు డెక్క తొలగించే యంత్రాన్ని మంత్రి శ్రీనివాస్ గౌడ్ తెప్పించారు. అయితే గుర్రపు డెక్క తొలగించేందుకు ఏకంగా రూ.40 లక్షలు ఖర్చయినట్లు తేల్చడంతో అందరూ అవాక్కయ్యారు. లక్షలు వెచ్చించే పనిని డిపార్ట్ మెంట్ తరపున చేయడానికి వీలు లేదని బీజేపీ, కాంగ్రెస్ కౌన్సిలర్లు అడ్డుపడ్డారు. అయినా మంత్రి పేరు చెప్పి పనులు చేపట్టిన ఆఫీసర్లు భారీ అక్రమాలకు తెర లేపారు. ఇదిలా ఉండగా ఈ పనులు చేపట్టినప్పుడు కౌన్సిల్ లేదు. అప్పటి స్పెషల్ ఆఫీసర్ డిపార్ట్ మెంట్ తరఫున ఈ పనులు చేసేందుకు కలెక్టర్ దగ్గర పర్మిషన్ తీసుకున్నారు. ఆ తర్వాత కౌన్సిల్ కొలువు దీరింది. అంచనాలకు మించి ఖర్చు అవుతుండడంతో ఈ పనిని ఆమెదించడానికి కౌన్సిల్ ఎజెండాలో చేర్చారు. టెండర్లు లేకుండా ఇన్ని లక్షల పనులు చేయడం విడ్డూరమని, ఈ పనులపై విచారణ జరపాలని బీజేపీ, కాంగ్రెస్ కౌన్సిలర్లు డిమాండ్ చేస్తున్నారు. మినీ ట్యాంకుబండ్ను సుందరంగా తీర్చిదిద్దేందుకు మంత్రి శ్రీనివాస్ గౌడ్ కోట్ల రూపాయల నిధులు మంజూరు చేయిస్తుంటే.. ఇదే అదునుగా మున్సిపల్ ఆఫీసర్లు చేతివాటం ప్రదర్శించడంపై అధికార పార్టీ కౌన్సిలర్లు కూడా గుర్రుగా ఉన్నారు.

హైదరాబాద్ తరహాలో..
జిల్లాకేంద్రంలోని పెద్ద చెరువును హైదరాబాద్ తరహాలో ట్యాంక్ బండ్ గా మార్చేందుకు మంత్రి శ్రీనివాస్ గౌడ్ ప్రత్యేకంగా నిధులు తీసుకువచ్చారు. చెరువు కట్టను ఆధునీకరించారు. 2018 ఎన్నికలకు ముందే మంత్రి కేటీఆర్ ను తీసుకువచ్చి బోటింగ్ ను ప్రారంభించారు. పాలమూరు చెరువులో కలియ తిరిగిన కేటీఆర్ సంతోషం వ్యక్తం చేశారు. దీంతో చెరువు చుట్టూ నక్లెస్ రోడ్డు మంజూరు చేయాలని మంత్రి కోరగా.. వెంటనే కేటీఆర్ రూ.24 కోట్లతో నక్లెస్ రోడ్డును సైతం సాంక్షన్ చేశారు. ఎన్నికల తర్వాత మరోసారి మంత్రి అయిన శ్రీనివాస్ గౌడ్ చెరువు కింద భారీ పార్కు, మినీ శిల్పారామం, లేజర్ లైటింగ్ తో మహర్దశ తెచ్చారు. ఈ తరుణంలో గుర్రపు డెక్క సవాల్ గా మారడంతో దానిని తొలగించేందుకు మంత్రి ఆదేశాలతో కదిలిన అధికార యంత్రాంగం భారీ అక్రమాలకు పాల్పడిందనే విమర్శలు ఉన్నాయి.

రూ.40 లక్షలు పెట్టినా పనికాలే..
జీహెచ్ఎంసీ నుంచి మెషీన్ను తెప్పించి లక్షలు ఖర్చుపెట్టినా గుర్రపు డెక్కను మాత్రం తొలగించలేకపోయారు. జిల్లా కేంద్రంలోని డ్రైనేజీ నీరంతా ఈ చెరువులోకే వెళ్తుంది. మురుగు నీరు నిల్వకావడంతో గుర్రపు డెక్క అంతకంతకూ పెరుగుతుంది. సుమారు నాలుగు నెలలకు పైగా యంత్రాలతో డెక్కను కోసి ట్రాక్టర్లతో డంపింగ్ యార్డుకు తరలించారు. వర్షాలు పడుతుండడంతో భారీగా మురుగు నీరు చేరి డెక్క మళ్లీఏపుగా పెరుగి చెరువంతా వ్యాపించింది. ఇన్నాళ్లు పడ్డశ్రమ వృథా కావడంతో పాటు రూ.40 లక్షలు మురుగునీటి పాలయ్యాయి.

డీసెంట్ నోట్ ఇచ్చిన బీజేపీ..
మున్సిపల్ పర్మిషన్ లేకుండా భారీగా నిధులు ఖర్చు చేయడంపై బీజేపీ, కాంగ్రెస్ కౌన్సిలర్లు మండిపడుతున్నారు. ఈ వ్యవహరంపై బీజేపీ కౌన్సిలర్లు మున్సిపల్ మీటింగ్లో డీసెంట్ నోట్ ఇచ్చారు. డిపార్ట్మెంట్ తరఫున ఇంత పెద్ద పనులు చేయడం ఏంటని నిలదీస్తున్నారు. పాలమూరు కౌన్సిల్లో అధికార పార్టీ సభ్యులే ఎక్కువ ఉన్నారు. ఈ వ్యవహరంపై వారు ఆఫీసర్ల తీరును తప్పు పడుతున్నా.. మంత్రి ఏమంటారోనని భయపడుతున్నారు. చివరికి మురుగు నీరంతా కిందకు వదిలితేనే డెక్క పూర్తిగా పోతుందని నిర్ధారణకు వచ్చారు. లక్షలు ఖర్చు పెట్టి తెచ్చిన యంత్రాన్ని మూలన పడేశారు.

మురుగు నీరు ఉండటం వల్లే తొలగించలేకపోయాం
పెద్ద చెరువులో గుర్రపు డెక్క తొలగించడానికి రూ.40 లక్షలు ఖర్చయింది. జీహెచ్ఎంసీ నుంచి తెప్పించిన యంత్రంతో పనులు చేశాం. కానీ ఫలితం దక్కలే. మురుగు నీరు చేరుతుండడంతో గుర్రపు డెక్క ఇంకా పెరుగుతోంది. ముందుగా ఆ నీరంతా తోడితే డెక్క మొత్తం పోతుంది.
– సురేందర్, మున్సిపల్ కమిషనర్, మహబూబ్ నగర్

విచారణ జరపాలి
మహబూబ్ నగర్ పట్టణంలోని పెద్ద చెరువులో గుర్రపు డెక్క తొలగించే పనుల్లో అక్రమాలు జరిగాయి. దీనిపై సమగ్ర విచారణ జరపాలి. ఈ డెక్క తొలగింగచడానికి రూ.40 లక్షలు అవుతాయా?. ఆఫీసర్లు, ట్రాక్టర్ యజమానులు మాత్రమే బాగుపడ్డారు. మున్సిపల్ ఫండ్స్ అడ్డగోలుగా ఖర్చు చేశారు. ఈ వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలి.
– లక్ష్మణ్ యాదవ్, కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు

For More News..

కట్టుడు కంప్లీటైనా.. ఇండ్లు ఇస్తలేరు..

తెలంగాణలో మరో 2,924 కరోనా కేసులు నమోదు

నాకు ఆ పాత్ర చేయాలని ఎప్పటినుంచో ఉంది