కోట్లు దోచుకుని ఓట్లు కొంటున్నారు-పీసీసీ చీఫ్ ఉత్తమ్

కోట్లు దోచుకుని ఓట్లు కొంటున్నారు-పీసీసీ చీఫ్ ఉత్తమ్

సిద్దిపేట, వెలుగు: దుబ్బాక ఉప ఎన్నికల్లో ప్రశ్నించే గొంతుకైన చెరుకు శ్రీనివాసరెడ్డికి మద్దతివ్వాలని, సీఎం  కేసీఆర్​ కుటుంబ పాలనకు వ్యతిరేకంగా తీర్పు ఇవ్వాలని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్​రెడ్డి పిలుపునిచ్చారు. గురువారం కాంగ్రెస్ అభ్యర్థి చెరుకు శ్రీనివాసరెడ్డి నామినేషన్ దాఖలు చేసిన అనంతరం దుబ్బాక పట్టణంలో నిర్వహించిన సభలో ఉత్తమ్​మాట్లాడారు. ప్రాజెక్టుల పేరిట రాష్ట్రాన్ని సీఎం కేసీఆర్ దోచుకుని ఆ డబ్బులతో ఎన్నికల్లో మన ఓట్లే కొంటున్నారని మండిపడ్డారు. టీఆర్ఎస్ ఇచ్చే డబ్బులు తీసుకోవాలని.. కానీ కాంగ్రెస్ అభ్యర్థికే ఓట్లు వేయాలని కోరారు. దుబ్బాక ఉప ఎన్నికలను రాష్ట్ర ప్రజలు ఎంతో ఆసక్తిగా చూస్తున్నారని, చరిత్ర గతిని మార్చేవిధంగా తీర్పునివ్వాలని కోరారు. టీపీసీసీ వర్కింగ్​ప్రెసిడెంట్, ఎంపీ రేవంత్​రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ కోసం పోరాటం చేసిండని గద్దెనెక్కిస్తే నమ్మినవారినే కేసీఆర్​మోసం చేస్తున్నరని మండిపడ్డారు. మల్లన్న సాగర్​భూ నిర్వాసితుల పోరాట పటిమను ఆదర్శంగా తీసుకుని దుబ్బాక ఉప ఎన్నికల్లో తీర్పు చెప్పాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ అభ్యర్థి చెరుకు శ్రీనివాస్‌రెడ్డి మాట్లాడుతూ ముత్యంరెడ్డి ఆస్తులను కాదు.. ఆయన ఆశయాలను పంచుకుని మీ ముందుకు వచ్చానని, మీరంతా ఆశీర్వదించాలని కోరారు. రైతు సంక్షేమం కోసం పాటుపడిన చెరుకు ముత్యంరెడ్డిని టీఆర్ఎస్ పార్టీ అవమానించిందని, ఆయన మరణానంతరం కనీసం సంతాప సభను నిర్వహించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. దుబ్బాక ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ కు ఓటు వేయడమే  చెరుకు ముత్యంరెడ్డికి మనమిచ్చే అసలైన నివాళి అని అన్నారు. సమావేశంలో  ఎంపీ కోమటి రెడ్డి వెంకటరెడ్డి, ఏఐసీసీ కార్యదర్శి సంపత్ కుమార్, మాజీ మంత్రి షబ్బీర్ అలీ, టీపీసీసీ మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య, చెరుకు ముత్యంరెడ్డి సతీమణి లక్ష్మి మాట్లాడారు. కాగా గురువారం 18 మంది 20 సెట్ల నామినేషన్లు దాఖలు చేశారు.