కరోనా కేసులు : హైదరాబాద్ తర్వాత రెండో స్థానంలో ఇందూరు

కరోనా కేసులు : హైదరాబాద్ తర్వాత రెండో స్థానంలో ఇందూరు
  • సర్వేకు సహకరించని, స్వచ్ఛందంగా ముందుకురాని స్థానికుల

నిజామాబాద్ జిల్లాలో కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతు న్నాయి. రాష్ట్రంలోనే హైదరాబాద్ తర్వాత అత్యధిక పాజిటివ్ కేసులు జిల్లాలోనే నమోదయ్యాయి. సోమవారం మరో నాలుగు పెరగ్గా 53కు చేరాయి. ఈ పరిస్థితికి ప్రజలు ఇప్పుడున్నంత అలర్ట్గా మొదట్లో లేకపోవడమే కారణంగా కనిపిస్తోంది. కరోనా ప్రభావిత ప్రాంతాల్లో తొలుత సర్వే చేపట్టగా కొందరు ఎదురుతిరిగారు. ఢిల్లీలోని మర్కజ్ లింకున్న వ్యక్తులు స్వచ్ఛందంగా ముందుకు రాకపోవడంతో వైరస్ విస్తృతి పెరిగిందనే అభిప్రాయాలువ్యక్తమవుతున్నాయి.

మార్చి 3న కలకలం

జిల్లాలో గత నెల 3న కరోనా కలకలం చెలరేగింది. గల్ఫ్ నుంచి వచ్చిన ఇందల్వాయి మండలం ఎల్లారెడ్డి పల్లె వాసికి కరోనా సోకిందనే ప్రచారం జరిగింది. హైదరాబాద్ గాంధీ హాస్పిటల్కు అతడిని పంపగా కరోనా నెగిటివ్ అని వచ్చింది. దీంతో జిల్లాలో కరోనా వైరస్ ప్రభావం లేదని, ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆఫీసర్లు ప్రకటించారు.

గల్ఫ్ నుంచి వచ్చినోళ్ల పైనే ఫోకస్‍

కరోనాపై అప్రమత్తమైన జిల్లా యంత్రాంగం గల్ఫ్ నుంచి జిల్లాకు వచ్చిన వారిని హోం క్వారంటైన్ కు తరలించింది. జిల్లాలో మొత్తం 3,788 మందిని హోంక్వారంటైన్ చేసింది. గల్ఫ్ పై ఫోకస్ పెట్టి ఢిల్లీ మర్కజ్ తో లింకున్న వారి గురించి ఆలోచించలేదు. జిల్లాలో ఫస్ట్ పాజిటివ్ కేసు నమోదైన 62 ఏళ్ల వృద్ధుడికి ఢిల్లీ మర్కజ్ తో లింకుండడంతో అధికార యంత్రాంగం దృష్టి ఇటువైపు మళ్లింది. నిజామాబాద్ నగరంలోని ఖిల్లా ప్రాంతానికి చెందిన ఓ రిటైర్ట్ ప్రభుత్వ ఉద్యోగికి కరోనా పాజిటివ్ అని తేలడంతో మర్కజ్ లింకుపై ఆరా తీసింది. ముందుగా పాజిటివ్ కేసు వ్యక్తితో సంబంధం ఉన్న వ్యక్తులందరినీ క్వారంటైన్ కు తరలించారు.  కరోనా అనుమానిత వ్యక్తి నివసిస్తున్న ఏరియాతోపాటు చుట్టుపక్కల ప్రాంతాలను సోడియం హైడ్రోక్లోరైడ్ స్ప్రే చేశారు. ఆతర్వాత పదకొండు డివిజన్లలో ఇంటింటి సర్వేను చేపట్టారు.

సర్వే బృందాలను రానివ్వలే..

కరోనా ప్రభావిత డివిజన్లలో ఇంటింటి సర్వేకు వెళ్లిన సర్వే బృందాలకు స్థానికులెవరూ మొదట్లో సహకరించలేదు. వారిని బెదిరింపులకు గురిచేసి తరిమేశారు. భౌతికదాడులకు ప్రయత్నించారు. వారిపైకి పెంపుడు కుక్కలను కూడా వదిలారు. ఆర్అండ్బీ శాఖ మంత్రి ప్రశాంత్ రెడ్డి, కలెక్టర్ నారాయణరెడ్డి, సీపీ కార్తికేయ స్పందించి సర్దిచెప్పారు. అది ఎన్‍ఆర్‍సీ సర్వే అనుకున్నామని స్థానికులు ఆఫీసర్లకు తెలిపారు. పోలీస్ ప్రొటెక్షన్‍తో చేసినప్పటికీ మొక్కుబడిగా సర్వే సాగినట్లు తెలిసింది.

సర్వే పకడ్బందీగా జరిగితే..

నిజామాబాద్ నగరంలో ఇంటింటి సర్వే పకడ్బందీగా జరిగినా, సర్వేకు స్థానికులు పూర్తిస్థాయిలో సహకరించినా పరిస్థితి ఇలా ఉండేది కాదనేఅభిప్రాయం వ్యక్తమవుతోంది. ఢిల్లీ మర్కజ్ కు వెళ్లి వచ్చిన వారు స్వచ్ఛందంగా ముందుకు రాకపోవడం, వారిని గుర్తించే లోపే వారెంతో మందితో కాంటాక్టు కావడం జరిగిపోయాయి. ఇంట్లోని వారు కూడా నిజాలు దాచారు. దీంతో వారు చెప్పిందే సర్వే బృందాలు రాసుకుని వచ్చేశాయి.

సాంకేతికతతో ట్రేసింగ్

మర్కజ్‍కు వెళ్లి వచ్చిన వారిని, వారి ప్రైమరీ, సెకండరీ కాంటాక్ట్స్ ను గుర్తించేందుకు పోలీసులు సెల్ ఫోన్ కాల్ రికార్డును, టవర్ లొకేషన్ వివరాలను ట్రేస్ చేసినట్లు తెలుస్తోంది. దీని ద్వారా వారి మూవ్‍మెంట్ ను తెలుసుకుని వారిని ట్రేస్ చేసి క్వారంటైన్ కు తరలించినట్లు తెలుస్తోంది.