వీర జవాన్ ఇక్బాల్ సింగ్ : అసహాయ పిల్లవాడికి అన్నం తినిపిస్తూ..!

వీర జవాన్ ఇక్బాల్ సింగ్ : అసహాయ పిల్లవాడికి అన్నం తినిపిస్తూ..!

అతడో సైనికుడు. ఉగ్రవాదులు చేసిన మారణ హోమాన్ని తన కళ్లారా చూశారు. వీలైనంత సాయం చేశాడు. మరింత మంది ప్రాణాలు పోకుండా కాపాడాడు. ఆయనే సీఆర్పీఎఫ్ జవాన్, హవల్దార్ ఇక్బాల్ సింగ్.

ఫిబ్రవరి 14న పుల్వామాలో CRPF జవాన్ల కాన్వాయ్ లో ఇక్బాల్ కూడా ఓ వాహనం నడిపారు. ఆ సమయంలో ఇక్బాల్ సింగ్ చూపిన ధైర్యానికి డైరెక్టర్ జనరల్ ప్రశంసాపత్రం లభించింది. తాజాగా ఇక్బాల్ సింగ్… శ్రీనగర్ లో పోస్టింగ్ అయ్యారు.

శ్రీనగర్ లో ఆయన చూపిన మానవత్వం ఇపుడు మరోసారి ప్రశంసలు అందుకుంటోంది. పక్షవాతంతో బాధపడుతున్న ఓ పిల్లాడి ఆకలి తీర్చాడు ఇక్బాల్ సింగ్. తన లంచ్ బాక్స్ ను అతడికి ఇచ్చి.. తన చేతులతో ఆ నిస్సహాయ బాలుడికి తినిపించాడు. స్థానికులు తీసిన ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.

శ్రీనగర్ లో సైన్యం మానవత్వానికి మచ్చుతునక అంటూ ప్రశంసలు

ఉగ్రదాడిలో చావును నేరుగా చూసి వచ్చిన ఇక్బాల్ సింగ్ … తన జీవితాన్ని సేవకు అంకితం చేశారని కొందరు నెటిజన్లు అభిప్రాయపడ్డారు. దేశ రక్షణలో ధీరత్వం చూపిన ఈ సైనికుడు.. సమాజానికి మానవత్వం నేర్పడంలోనూ హీరో అయ్యాడని కొందరు అన్నారు. శ్రీనగర్ లో సైన్యం స్థానికులతో ఎంత స్నేహంగా ఉంటుందో అనేందుకు ఇదో ఉదాహరణ అని ఇంకొందరు చెప్పారు. ఇక్బాల్ సింగ్ అనే అతడి పేరులోనే మినీ ఇండియా ఉందంటూ .. అసలైన భారతీయుడు అంటూ మరికొందరు అభినందిస్తున్నారు.