మోడీ స్ఫూర్తిగా… జవాన్ల స్వచ్ఛమేడారం

మోడీ స్ఫూర్తిగా… జవాన్ల స్వచ్ఛమేడారం

జవాన్ల స్వచ్ఛమేడారం

మోడీ స్ఫూర్తిగా సీఆర్ఫీఎఫ్​ సిబ్బంది స్వచ్ఛభారత్​

50 టన్నులకు పైగా చెత్తను ఊడ్చేసిన్రు

జయశంకర్‌‌‌‌ భూపాలపల్లి,  వెలుగు: వాళ్లంతా ఎప్పుడూ చేతిలో గన్నులు పట్టుకొని తిరిగే జవాన్లు.. దేశానికి, ప్రజలకు రక్షణగా నిలబడతారు. అలాంటి వారి చేతులు చీపుర్లు పట్టుకున్నాయి. పరిసరాలను పరిశుభ్రం చేసే స్వచ్ఛభారత్‌‌ ‌‌వంటి బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టాయి. దేశ ప్రధాని నరేంద్రమోడీ స్ఫూర్తిగా జవాన్లంతా ములుగు జిల్లా తాడ్వాయి మండలంలోని మేడారం పరిసరాల్లో పారిశుధ్య కార్యక్రమాలు నిర్వహించారు. సమ్మక్క సారలమ్మ మహాజాతర సందర్భంగా పోగుబడ్డ సుమారు 50 టన్నుల చెత్తచెదారం ఊడ్చి పారేశారు.  మేడారం మహాజాతర ఈ నెల 5 నుంచి 8వ తేదీ వరకు జరిగింది. దేశవ్యాప్తంగా కోటిన్నర మందికి పైగా భక్తులు వచ్చి అమ్మవార్లకు మొక్కులు చెల్లించారు. జాతర ముగింపు రోజున భారీ వర్షం పడటంతో మేడారం పరిసర ప్రాంతాలన్నీ అధ్వాన్నంగా మారాయి. ఎక్కడ చూసినా చెత్తా చెదారం పేరుకుపోయింది. పంచాయతీరాజ్‌‌‌‌శాఖ తరఫున 1500 సిబ్బంది పనిచేస్తున్నా ఎక్కడి చెత్త అక్కడే కన్పిస్తోంది. దీంతో ఇన్ని రోజులు మేడారం భక్తుల రక్షణ కోసం పనిచేసిన సీఆర్పీఎఫ్ జవాన్లు.. మేము సైతం అంటూ పారిశుధ్య కార్యక్రమాల్లో భాగస్వామ్యం అయ్యారు.  బుధవారం సీఆర్‌‌‌‌పీఎఫ్‌‌ ‌‌‌‌డి కంపెనీ 39, ఎఫ్‌‌ ‌‌కంపెనీ 58 బెటాలియన్‌‌‌‌కు చెందిన 90 మంది జవాన్లు స్వచ్ఛభారత్‌‌ ‌‌కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. గతేడాది బీచ్‌‌‌‌లో ప్రధాని మోడీ నడుచుకుంటూ చెత్తాచెదారాన్ని ఏరి శుభ్రం చేసిన ఘటనను స్ఫూర్తిగా తీసుకొని మేడారంలో పారిశుధ్య కార్యక్రమంలో పాల్గొన్నట్లుగా సీఆర్‌‌‌‌పీఎఫ్‌‌ ‌‌బెటాలియన్‌‌‌‌ అసిస్టెంట్‌‌‌‌ కమాండెంట్‌‌ ‌‌కె.ఏసుదాస్‌‌‌‌ చెప్పారు. మేడారంలోని జంపన్నవాగు సమీపంలోని కొయ్యూరు జంక్షన్‌‌‌‌, మేడారం గద్దెల పరిసరాల్లో 50 టన్నుల చెత్తాచెదారం ఏరి కుప్పలుగా పోశారు. 3 ట్రక్కుల్లో ఆ చెత్తను నింపి డంపింగ్‌‌‌‌యార్డ్‌‌‌‌లకు పంపించారు. డి 39 బెటాలియన్  సీఆర్పీఎఫ్  డీఎస్పీ యేసుదాస్, సీఐ లక్ష్మయ్య, ఎస్సై సుబ్బరాజు, అశోక్ , ఎఫ్ 58 బెటాలియన్ డీఎస్పీ పవన్ యాదవ్, సీఐ సూర్యనారాయణతో పాటు పస్రా సీఐ శ్రీనివాస్, ఏటూరునాగారం సీఐ నాగబాబు, తాడ్వాయి ఎస్సై రవీందర్‌‌ పాల్గొన్నారు.

 

ఘనంగా తిరుగువారం పండుగ ముగిసిన మహాజాతర

మేడారం సమ్మక్క సారలమ్మ మహాజాతరలో చివరి అంకం ముగిసింది.  గిరిజన పూజారులు బుధవారం నాలుగు దేవాలయాల్లో తిరుగువారం పండుగను ఘనంగా నిర్వహించారు. దీంతో మహాజాతర సమాప్తమైంది. తిరుగువారం పండగ నేపథ్యంలో భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చి అమ్మవార్లకు మొక్కులు సమర్పించారు.  గిరిజన కుంభమేళాగా పిలవబడే సమ్మక్క సారలమ్మ మహాజాతరలో నాలుగు బుధవారాలు చాలా ముఖ్యమైనవి.  జనవరి  22న గుడిమెలిగే పండుగ, 29న మండమెలిగే పండుగ, ఫిబ్రవరి 5న సారలమ్మ రాకతో 4 రోజుల మహాజాతర ఆరంభం, ఫిబ్రవరి 12న తిరుగువారం పండగతో మహాజాతర సమాప్తం అవుతుంది. తిరుగువారం పండుగ నేపథ్యంలో బుధవారం మేడారంలోని సమ్మక్క, కన్నెపల్లిలోని సారలమ్మ, పూనుగొండ్లలోని పగిడిద్దరాజు, కొండాయిలోని గోవిందరాజులు ఆలయాలను పూజారులు శుద్ధి చేసి నైవేద్యం సమర్పించారు.  మహాజాతర సందర్భంగా అమ్మవార్లను దర్శించుకోవడానికి రాలేని భక్తులందరూ తిరుగువారం పండగను పురస్కరించుకొని బుధవారం వచ్చి మొక్కులు చెల్లించారు.

64 హుండీలు.. కోటి ఆదాయం

వరంగల్​, వెలుగు: మేడారం సమ్మక్క సారలమ్మ జాతర హుండీ లెక్కింపు హన్మకొండలోని తిరుమల తిరుపతి దేవస్థానం కల్యాణ మండపంలో బుధవారం ప్రారంభమైంది. సమ్మక్క సారక్క గద్దెల ప్రాంగణంలో మొత్తం 494 హుండీలు ఏర్పాటు చేశారు. మొదటి రోజు పోలీసులు,  సీసీ కెమెరాల పర్యవేక్షణలో 64 హుండీల్లోని నోట్లను లెక్కించారు. ఉదయం 8 నుంచి సాయంత్రం 6 గంటల వరకు సాగిన లెక్కింపులో మొత్తం రూ.1,01,50,000 ఆదాయం వచ్చినట్లు అధికారులు తెలిపారు. ఆయా హుండీల్లోని బంగారు, వెండి కానుకలను పర్యవేక్షణాధికారుల సమక్షంలో ప్రత్యేక హుండీల్లో భద్రపరిచారు. ఇంకా కాయిన్స్​ లెక్కింపు ప్రారంభం కావాల్సి ఉందని దేవాదాయశాఖ అడిషనల్​ కమిషనర్​ శ్రీనివాసరావు తెలిపారు.