
నవ్వు ఎన్నిరకాలుగా మంచిదో తెలుసు. మరి ఏడుపు?నిజానికి ఏడుపు కూడా మంచిదే!ఇంకా చెప్పాలంటే నవ్వుకంటే కూడా మంచిది!!జపాన్‌లోని క్రైయింగ్ క్లబ్ సైంటిస్టులు ఏడుపుపై చేసినరీసెర్చ్లో ఎన్నో కొత్త విషయాలు వెలుగుచూశాయి.
నవ్వడమే ఎరుగని మానవుడు భారముగా తలచు జీవనమతడు’ అంటూ పాడుకుంటారు. బాధలో ఉన్నప్పుడు నవ్వడం కష్టమే. మరి ఆ బాధ, గుండెభారం తగ్గాలంటే .. ఏడవడం ఒక్కటే దారి అని చెబుతున్నారు సైంటిస్టులు.
కన్నీళ్లకు ప్రత్యేకత
నవ్వినా, ఏడ్చినా కన్నీళ్లే వస్తాయన్నారు సినీకవి ఆత్రేయ. అయితే జపాన్ సైంటిస్టుల రీసెర్చ్లోనే కాకుండా గుజరాత్‌లోని సూరత్‌లో ఉన్న క్రైయింగ్ క్లబ్ సైంటిస్టులు కూడా ఇదే విషయాన్ని తేల్చారు. స్ట్రెస్, యాంగ్జైటీ వంటివి చుట్టుముట్టినప్పుడు ఆత్మీయులతో చెప్పుకొని ఏడిస్తే మనసు తేలిక పడుతుందని చెబుతున్నారు.
ఏడుపే ప్రాణం పోసేది..
తొమ్మిదినెలలు తల్లి గర్భంలో ఉన్న పసిబిడ్డ భూమిపై పడగానే కెవ్వుమంటూ ఏడుస్తుంది. ఎందుకో తెలుసా? తల్లిగర్భంలో ఉన్నన్నాళ్లూ మాతృమూర్తి సాయంతో శ్వాస తీసుకున్న ఆ పసిగుడ్డు.. సొంతంగా ప్రాణవాయువు తీసుకునే మొదటి ప్రయత్నమే ఏడుపు. అలా గట్టిగా ఏడవడంతోనే బిడ్డ ఊపిరి తీసుకుంటుంది. ఒకవేళ పుట్టగానే బిడ్డ ఏడవకపోతే తల్లిదండ్రులు, డాక్టర్లు కంగారు పడేది అందుకే. అవసరమైతే కొట్టి అయినా ఏడిపిస్తారు. పాప ఏడ్చిందంటే అందరూ నవ్వుతారు. అంతే, ప్రతి మనిషికి ప్రాణం పోసేది ఏడుపే.
క్రైయింగ్ క్లబ్..
లాఫింగ్ క్లబ్‌ల గురించి తెలుసు. కానీ గుజరాత్లో క్రైయింగ్ క్లబ్ కూడా ఉంది. ప్రతినెలా చివరి ఆదివారం క్లబ్ మెంబర్స్ అంతా కలిసి సామూహికంగా ఏడుస్తారు. అలా నలుగురితో కలిసి ఏడవడం వల్ల ఒత్తిడి, బాధ చేత్తో తీసేసినట్లుగా మాయమవుతాయని చెబుతున్నారు. జాబ్ స్ట్రెస్, ఫ్యామిలీ, ఫైనాన్షియల్ కష్టాల వల్ల కలిగే బాధలను తగ్గించుకునేందుకే తామంతా ఇలా ఏడుస్తున్నామంటున్నారు.
ఇప్పుడు మరింత అవసరం..
కరోనా కారణంగా ఇంట్లో లాక్ అయినవాళ్లంతా ఏదోరకమైన బాధను, ఒత్తిడిని ఎదుర్కొంటున్నారని కొన్ని రీసెర్చ్ ఇన్స్టిట్యూట్స్ తేల్చాయి. అవి తగ్గడానికి ఆత్మీయులకు వీడియో కాల్ చేసి బాధలన్నీ చెప్పుకొని ఏడవడం ఓ మంచి పరిష్కారమంటున్నారు క్రైయింగ్ క్లబ్ మెంబర్స్.