ఈహెచ్ఎస్ గైడ్ లైన్స్ రెడీ చేయండి..అధికారులకు సీఎస్ ఆదేశాలు.. ఉద్యోగుల హెల్త్ స్కీంపై రివ్యూ

ఈహెచ్ఎస్ గైడ్ లైన్స్ రెడీ చేయండి..అధికారులకు సీఎస్ ఆదేశాలు.. ఉద్యోగుల హెల్త్ స్కీంపై రివ్యూ

హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల ఆరోగ్య పథకం (ఈహెచ్ఎస్ ) విధివిధానాలను త్వరగా సిద్ధం చేయాలని అధికారులను సీఎస్  కె.రామకృష్ణారావు ఆదేశించారు. సోమవారం సెక్రటేరియెట్ లో  సీనియర్  ఐఏఎస్ అధికారులతో ఈ అంశంపై ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు. ఇతర రాష్ట్రాల్లో ప్రభుత్వ ఉద్యోగులకు అమలవుతున్న వివిధ ఆరోగ్య పథకాలను, బీమా కంపెనీల విధానాలను అధ్యయనం చేసి, సాధ్యమైనంత త్వరగా నివేదిక సమర్పించాలని సీఎస్  సూచించారు. 

రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు తమ వేతనం నుంచి కొంత మొత్తాన్ని జమచేసి, నగదురహిత చికిత్స విధానం ద్వారా తాము, తమ కుటుంబ సభ్యులు హెల్త్ కేర్  పొందడానికి సుముఖంగా ఉన్నారని  సీఎస్ కు అధికారులు తెలిపారు. ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు కలిపి మొత్తం 7,14,322 మంది ఈ పథకం ద్వారా లబ్ధి పొందుతారని, దీని కోసం సంవత్సరానికి సుమారు రూ.1300 కోట్ల అంచనా వ్యయం అవుతుందని అధికారులు వివరించారు.

 ఈ నేపథ్యంలో వైద్య, ఆరోగ్య శాఖ, ఆర్థిక శాఖ అధికారులు సమన్వయంతో పనిచేసి, ఇతర రాష్ట్రాల్లో కొనసాగుతున్న ఈహెచ్ఎస్  గైడ్ లైన్స్ ను పూర్తిగా అధ్యయనం చేసి, త్వరలో నివేదిక సమర్పించాలని సీఎస్  స్పష్టం చేశారు. ఈ సమావేశంలో హోం శాఖ ముఖ్య కార్యదర్శి రవి గుప్తా, హెల్త్  సెక్రటరీ క్రిస్టినా జెడ్  చొంగ్తూ, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్  కుమార్  సుల్తానియా, జీఏడీ ప్రిన్సిపల్సె క్రటరీ మహేశ్  దత్  ఎక్కా పాల్గొన్నారు.