చంద్రగిరి రీపోలింగ్ పై ఆరోపణలు ఖండించిన ఏపీ సీఎస్‌

చంద్రగిరి రీపోలింగ్ పై ఆరోపణలు ఖండించిన ఏపీ సీఎస్‌

చంద్రగిరిలో ఏడు గ్రామాల్లో ఎస్‌సిలు ఓట్లు వేయలేదని ఫిర్యాదు వచ్చిందని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సిఎస్‌) ఎల్‌వి సుబ్రహ్మణ్యం అన్నారు. అందరూ ఓట్లు వేసేలా చూడటం అధికారులుగా తమ బాధ్యత అని ఆయన చెప్పారు. చంద్రగిరిలో రీపోలింగ్‌పై తనను ఇతర అధికారులను తప్పుబడుతూ విమర్శలు చేయడం సరికాదని ఆయన అన్నారు. ఫిర్యాదుపై సాక్ష్యాలు చూసి నిర్ణయం తీసుకునేది ఎన్నికల సంఘమేనని సీఎస్‌ పేర్కొన్నారు. ఈ విషయంలో తనపై వచ్చిన ఆరోపణలను సిఎస్‌ ఖండిచారు. పాలన గుడ్డిగా సాగే పరిస్థితి రానివ్వకూడదని ఆయన అన్నారు.

భారీ బందోబస్తు నడుమ రీపోలింగ్‌

చంద్రగిరి నియోజకవర్గంలో రీపోలింగ్‌ నిర్వహించే పోలింగ్‌ కేంద్రాల వద్ద  భారీ బందోబస్తుతో పటిష్ట చర్యలు తీసుకుంటున్నారు. మదనపల్లె డీఎస్పీ చిదానందరెడ్డి, చిత్తూరు డీఎస్పీ రామాంజనేయులు సారధ్యంలో 13 మంది సీఐలు, 17 మంది ఎస్‌ఐలు, 50 మంది సివిల్‌ పోలీసులు, వంద మంది స్పెషల్‌ పోలీసులు బందోబస్తు నిర్వహించనున్నారు. రీపోలింగ్‌ జరిగే రోజు వరకు ఇక్కడ 144 సెక్షన్‌ అమలులో ఉంటుందని పోలీస్‌ అధికారులు తెలిపారు.

చంద్రగిరి నియోజకవర్గం  ఆర్సీపురం మండలంలోని రీపోలింగ్‌ జరిగే వెంకట్రామాపురం, కొత్తకండ్రిగ, కమ్మపల్లి, ఎన్‌ఆర్‌.కమ్మపల్లెల్లో గురువారం అర్బన్‌ ఎస్పీ పర్యటించారు. రీపోలింగ్‌ రోజు హింసాత్మక చర్యలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. రిగ్గింగ్‌కు యత్నిస్తే, జిల్లా బహిష్కరణతో పాటు పీడి యాక్ట్‌ నమోదు చేస్తామని హెచ్చరించారు.