అభయహస్తం అప్లికేషన్ల డేటా ఎంట్రీకి జనవరి 17 డెడ్​లైన్

అభయహస్తం అప్లికేషన్ల డేటా ఎంట్రీకి  జనవరి 17 డెడ్​లైన్
  • 5న జిల్లా స్థాయిలో ట్రైనింగ్ ఇస్తాం
  • ఆధార్, వైట్ రేషన్ కార్డే ప్రామాణికంగా తీసుకోవాలని సూచన

హైదరాబాద్, వెలుగు :  ప్రజాపాలనలో భాగంగా స్వీకరించిన అభయహస్తం అప్లికేషన్ల డేటా ఎంట్రీను ఈ నెల 17వ తేదీ వరకు పూర్తి చేయాలని సీఎస్ శాంతి కుమారి కలెక్టర్లను ఆదేశించారు. దరఖాస్తుల వివరాల నమోదులో ఆధార్ నంబర్, వైట్ రేషన్ కార్డులను ప్రామాణికంగా తీసుకోవాలని స్పష్టం చేశారు. ప్రజా పాలన నిర్వహణ, దరఖాస్తుల డేటా ఎంట్రీలపై కలెక్టర్లతో బుధవారం సీఎస్ టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. 

రాష్ట్రంలోని అన్ని గ్రామ పంచాయతీలు, మున్సిపల్ వార్డుల్లో నిర్వహిస్తున్న గ్రామసభలు ఇబ్బందుల్లేకుండా విజయవంతంగా నిర్వహించడంపై కలెక్టర్లను సీఎస్​ అభినందించారు. ఈ నెల 6వ తేదీన ప్రజాపాలన ముగిసిన వెంటనే అందిన దరఖాస్తుల డేటా ఎంట్రీని మండల కేంద్రాల్లో ప్రారంభించాలన్నారు. ఈ ప్రక్రియ మండల రెవెన్యూ, డెవలప్ మెంట్ అధికారుల పర్యవేక్షణలో జరగాలన్నారు.

 ప్రజాపాలన సూపర్వైజరీ అధికారిగా ఉన్న జిల్లా స్థాయి ఆఫీసర్ కూడా పర్యవేక్షించాలని సూచించారు. డేటా ఎంట్రీ చేసేందుకు జిల్లా స్థాయిలో శిక్షణ ఇవ్వడానికి రాష్ట్ర స్థాయి ట్రెయినీ ఆఫ్ ట్రైనర్లకు 4వ తేదీన శిక్షణ ఇస్తామన్నారు. జిల్లా స్థాయిలో డేటా ఎంట్రీ ఏవిధంగా చేయాలన్న దానిపై 5వ తేదీన ట్రైనింగ్ ఇస్తామని తెలిపారు. ఇందుకు గాను, జిల్లాలోని వివిధ ప్రభుత్వ కార్యాలయాల్లో ఉన్న డీటీపీ ఆపరేటర్ల సేవలను ఉపయోగించుకోవాలని తెలిపారు. 

అవసరమైతే ప్రైవేట్ ఆపరేటర్లను హైర్ చేసుకోవాలని సీఎస్ సూచించారు. మంగళవారం నాటికి దాదాపు 57 లక్షల దరఖాస్తులు అందాయని తెలిపారు. ప్రతీ నాలుగు నెలలకు ఒకసారి ప్రజాపాలన నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. దరఖాస్తు చేసుకోని వాళ్లు.. మళ్లీ అప్లై చేసుకోవచ్చని తెలిపారు.