సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ను స్వచ్ఛందంగా నిషేధించాలి

సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ను స్వచ్ఛందంగా నిషేధించాలి
  • స్టీల్, పింగాణీ వస్తువులు వినియోగించాలి: సీఎస్ శాంతికుమారి

హైదరాబాద్, వెలుగు: పర్యావరణానికి ప్రమాదకరంగా మారిన సింగిల్ యూజ్​ప్లాస్టిక్ వాడకాన్ని స్వచ్ఛందంగా నిషేధించాలని సీఎస్​శాంతికుమారి పిలుపునిచ్చారు. సింగిల్ యూస్ ప్లాస్టిక్ నిషేధంపై శనివారం సెక్రటేరియెట్ లో వర్క్ షాప్ నిర్వహించారు. ఈ సందర్భంగా శాంతికుమారి మాట్లాడుతూ.. సింగిల్ యూజ్​ప్లాస్టిక్ వస్తువులకు బదులు స్టీల్, పింగాణీ వస్తువులు వాడాలని సూచించారు. ప్రధానంగా వాటర్ బాటిళ్లు, కవర్లు, ప్లేట్లు, కప్పులు, గ్లాసులు, స్ట్రాలు ఎక్కువగా ప్లాస్టిక్ వి వాడుతున్నారని, వాటి స్థానంలో స్టీల్, పింగాణీవి వాడాలన్నారు. 

ఇది సెక్రటేరియెట్ అధికారులు, ఉద్యోగులు స్వచ్ఛందంగా పాటించి ఆదర్శంగా నిలవాలని సూచించారు. కేవలం ప్రభుత్వ ఉత్తర్వులతోనే ప్లాస్టిక్ పై నిషేధం సాధ్యం కాదని, అందరూ స్వచ్ఛందంగా సామాజిక బాధ్యతతో పాటించాలని చెప్పారు. రాష్ట్రంలోని 142 మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో 17 లక్షల మంది స్వయం సహాయక బృందాల మహిళలతో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నిషేధంపై చైతన్యం కల్పిస్తున్నామని పేర్కొన్నారు. కార్యక్రమంలో పొల్యూషన్ కంట్రోల్ బోర్డు చైర్మన్, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు రాజీవ్ శర్మ తదితరులు పాల్గొన్నారు.