నీటి సరఫరాలో అంతరాయం రావొద్దు.. ఉన్నతాధికారులతో సీఎస్ రివ్యూ మీటింగ్

నీటి సరఫరాలో అంతరాయం రావొద్దు.. ఉన్నతాధికారులతో సీఎస్ రివ్యూ  మీటింగ్

హైదరాబాద్, వెలుగు: వచ్చే నెల రోజులు రాష్ట్రంలో తాగునీటి సరఫరాను నిశితంగా పర్యవేక్షించాలని సీఎస్​ శాంతి కుమారి అధికారులను ఆదేశించారు. నీటి సరఫరాలో అంతరాయాలు రాకుండా జాగ్రత్త వహించాలని సూచించారు. సోమవారం డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సచివాలయంలో సీఎస్​ శాంతికుమారి మున్సిపల్, నీటిపారుదల, పంచాయతీ రాజ్ శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. తాగునీటి సరఫరాలో అంతరాయం ఉన్న ప్రాంతాలను గుర్తించి ప్రజలు ఇబ్బందులు పడకుండా చర్యలు తీసుకోవాలని ఆమె కోరారు. 

నీటి కొరత ఉన్న ప్రాంతాల్లో ట్యాంకర్ల ద్వారా ప్రత్యామ్నాయ తాగునీటిని సరఫరా చేయాలని ఆదేశించారు. సీజీఎంలు ప్రతిరోజూ తమ పరిధిలోని మేనేజర్‌‌‌‌లతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించి నీటి సరఫరాను పర్యవేక్షించాలని చెప్పారు.ఆ తర్వాత సీడీఎంఏ దివ్య మాట్లాడుతూ.. మంచినీటి సరఫరా పరిస్థితిని ప్రతిరోజూ పర్యవేక్షిస్తున్నామని, లీకేజీలు ఏవైనా ఉంటే వెంటనే సరిచేస్తున్నామని పేర్కొన్నారు. అనంతరం అధికారులు మాట్లాడుతూ.. నాగార్జునసాగర్ నుంచి నీటి పంపింగ్ ఇప్పటికే ప్రారంభమైందని, మే నెలాఖరు వరకు రాష్ట్రంలో తాగునీటి సరఫరాకు ఎలాంటి లోటు ఉండదని తెలిపారు. ఈ సమావేశంలో ప్రభుత్వ ముఖ్య కార్యదర్శులు దానకిషోర్, సందీప్ కుమార్ సుల్తానియా,  రాహుల్ బొజ్జా ఇతర అధికారులు పాల్గొన్నారు.