రాష్ట్రంలో 2.49 కోట్ల టన్నుల వడ్ల దిగుబడి

రాష్ట్రంలో 2.49 కోట్ల టన్నుల వడ్ల దిగుబడి

హైదరాబాద్‌, వెలుగు : రాష్ట్రంలో సాగు విస్తీర్ణం గణనీయంగా పెరిగిందని సర్కారు వెల్లడించింది. ప్రభుత్వం రైతు సంక్షేమానికి ఇస్తున్న ప్రాధాన్యతతోనే ఇది సాధ్యమైందని ఒక ప్రకటనలో వివరించింది. 2014 నాటికి రాష్ట్రంలో సాగు విస్తీర్ణం కోటీ 34 లక్షల ఎకరాలు ఉండగా.. నేడు 2 కోట్ల 3 లక్షల ఎకరాలకు పెరిగిందని తెలిపింది. 2014‌‌ =15 నాటికి రాష్ట్రంలో వడ్ల దిగుబడి68 లక్షల టన్నులు ఉండగా, 2021-=22 నాటికి 2.49 కోట్ల టన్నులకు చేరిందని వెల్లడించింది. అన్ని పంటల ఉత్పత్తి 3.50 కోట్ల టన్నులకు చేరుకుందని తెలిపింది. 2014=-15 లో పత్తి సాగు విస్తీర్ణం 41.83 లక్షల ఎకరాలు ఉండగా, 2020-=21 నాటికి 60.53 లక్షల ఎకరాలకు చేరుకున్నదని, దిగుబడి 35.83 లక్షల బేళ్ల నుంచి 60.44 లక్షల బేళ్లకు చేరుకున్నదని వివరించింది. ఏటా దాదాపు రూ.10,500 కోట్లు అగ్రికల్చర్‌ కు విద్యుత్ సబ్సిడీ అందిస్తున్నట్టు చెప్పింది.

6 కోట్ల 6 లక్షల టన్నుల ధాన్యం సేకరణ 

రాష్ట్రం వచ్చిన నుంచి నేటి వరకు రూ.1,07,748 కోట్ల విలువైన 6 కోట్ల 6 లక్షల టన్నుల ధాన్యాన్ని సేకరించి ఎఫ్‌సీఐకి అందించినట్టు సర్కారు పేర్కొంది. 8 ఏండ్లలో వడ్లు కాకుండా రూ.9,406.67 కోట్లతో ఇతర పంటలను సేకరించినట్టు తెలిపింది. గోడౌన్ల సామర్థ్యం 39 లక్షల టన్నుల నుంచి 68.28 లక్షల టన్నులకు పెంచినట్టు వివరించింది. వ్యవసాయ యాంత్రీకరణకు ఇప్పటికి మొత్తం రూ. 963.26 కోట్లు ఖర్చు చేసినట్టు చెప్పింది. వ్యవసాయ ట్రాక్టర్ల సంఖ్య 94,537 నుంచి 3 లక్షల 52 వేలకు పెరిగిందని తెలిపింది.  ట్రాక్టర్లపై రూ.273.5 కోట్ల రవాణా పన్నును మాఫీ చేయడమే కాకుండా,  రాష్ట్రం ఏర్పడకముందు ఉన్న  రూ.41.6 కోట్ల పన్నును కూడా రద్దు చేసినట్లు సర్కారు వెల్లడించింది. 2014-–15 లో 6,318 హార్వెస్టర్లు అందుబాటులో ఉండగా, ప్రస్తుతం 19,309 కి చేరాయని స్పష్టం చేసింది.

రైతుబంధు, రైతుబీమా.. 

రైతుబంధు  ద్వారా 9 విడతల్లో రూ.57,881 కోట్లు రైతుల ఖాతాల్లో జమచేసినట్టు ప్రభుత్వం వెల్లడించింది.  రైతుబీమా ద్వారా ఇప్పటివరకు 88,963 మంది రైతు కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున బీమా పరిహారం అందించినట్టు పేర్కొంది.

పెరిగిన తలసరి ఆదాయం

రాష్ట్ర ప్రజల తలసరి ఆదాయం 2014–15లో రూ.1,12,162 ఉండగా 2021–-22 నాటికి  రూ.2,78,833 కు పెరిగిందని ప్రభుత్వం పేర్కొంది.