‘కంక్లూజివ్ టైటిల్‘ పాతదే..ఆదర్శంగా నిలిచి ఆగింది!

‘కంక్లూజివ్ టైటిల్‘ పాతదే..ఆదర్శంగా నిలిచి ఆగింది!

‘కంక్లూజివ్‌‌‌‌ టైటిల్‌‌‌‌..’ భూమి యాజమాన్యానికి సంబంధించి గత కొద్ది రోజులుగా అధికారులు, రెవెన్యూ శాఖలో బాగా వినిపిస్తున్న పదమిది. భూ యాజమాన్యానికి సంబంధించి రిజిస్ట్రేషన్‌‌‌‌ శాఖలో అమలులో ఉన్న సేల్‌‌‌‌ డీడ్‌‌‌‌, రెవెన్యూ శాఖలోని ఆర్వోఆర్‌‌‌‌ స్థానంలో ఈ కంక్లూజివ్‌‌‌‌ టైటిల్‌‌‌‌ను తీసుకొచ్చేందుకు ప్రభుత్వం ఇటీవల కసరత్తు ప్రారంభించింది. భూ వివాదాల పరిష్కారానికి, రెవెన్యూ, రిజిస్ట్రేషన్‌‌‌‌ శాఖల్లో నెలకొన్న అవినీతిని అరికట్టడానికి ఇదే శాశ్వత పరిష్కారమని అధికారులు భావిస్తున్నారు. నిజానికి భూ యాజమాన్య హక్కులపై అధ్యయనానికి 1987లో కేంద్రం ప్రొఫెసర్‌‌‌‌ డీసీ వాద్వా ఆధ్వర్యంలో ఏకసభ్య కమిషన్‌‌‌‌ను ఏర్పాటు చేశాక దేశంలో  తొలిసారిగా కంక్లూజివ్‌‌‌‌ టైటిల్‌‌‌‌ గురించి చర్చ మొదలైంది. కానీ ఆయన చేసిన సిఫార్సులు ఆచరణలోరి రాలేదు. దేశంలో తొలిసారిగా కంక్లూజివ్‌‌‌‌ టైటిల్‌‌‌‌ దిశగా అడుగులు పడింది రాష్ట్రంలోనే కావడం గమనార్హం.

అప్పుడేం జరిగింది

దివంగత సీఎం వైఎస్‌‌‌‌ రాజశేఖరరెడ్డి హయాంలో ‘భూ భారతి’ పేరిట 2004లో నిజామాబాద్‌‌‌‌ జిల్లాలో ప్రారంభమైన ఈ పైలట్‌‌‌‌ ప్రాజెక్టు డ్రాఫ్ట్‌‌‌‌లో మొదటి ప్రాధాన్యాంశం కంక్లూజివ్‌‌‌‌ టైటిలే. అప్పటికే ఈ విధానం అమలవుతున్న థాయిలాండ్‌‌‌‌, కెనడా, ఆస్ట్రేలియా, బ్రిటన్‌‌‌‌ తదితర దేశాల్లో అధ్యయనం చేశాక ఈ ప్రాజెక్టుకు రూపకల్పన చేశారు. కంక్లూజివ్‌‌‌‌ టైటిల్‌‌‌‌ను ఖరారు చేసేందుకు అనుసరించాల్సిన పద్ధతులన్నీ ఇందులో పేర్కొన్నారు. మొదట భూములను సమగ్రంగా సర్వే చేయడం, ఆ తర్వాత రికార్డుల్లో ఉన్న భూమిని.. ఫీల్డ్‌‌‌‌లో ఉన్న భూమితో పోల్చి చూడడం, హద్దులను నిర్ధారించడం, ఎక్కువ లేదా తక్కువ విస్తీర్ణం ఉంటే సరిచేయడం, ఒక్కో కమతానికి కంక్లూజివ్‌‌‌‌ టైటిల్‌‌‌‌ను కేటాయించడం, యాజమాన్య హక్కులపై ఏవైనా వివాదాలు ఉంటే ప్రత్యేక ట్రిబ్యునళ్లు/కోర్టుల్లో పరిష్కరించి ఆస్తులకు సొంతదారు పేరును ఖరారు చేయడం, చివరగా మాన్యువల్‌‌‌‌గా ఉన్న ఈ డేటా మొత్తాన్ని డిజిటల్‌‌‌‌ రూపంలో నిక్షిప్తం చేయడం ఈ ప్రాజెక్టులో దశలవారీగా జరగాల్సిన పనులు. పైలట్‌‌‌‌ ప్రాజెక్టుగా ఎంపికైన నిజామాబాద్‌‌‌‌ జిల్లాలో చివరిసారిగా 1897లో  భూ సర్వే జరగగా109 ఏళ్ల తర్వాత 2006 రీ సర్వే చేపట్టారు. నేషనల్‌‌‌‌ రిమోట్‌‌‌‌ సెన్సింగ్‌‌‌‌ ఏజెన్సీ(ఎన్‌‌‌‌ఆర్‌‌‌‌ఎస్‌‌‌‌ఏ) ఆధ్వర్యంలో ప్రత్యేక ఎయిర్‌‌‌‌ క్రాఫ్ట్‌‌‌‌ సాయంతో ఈటీఎస్‌‌‌‌ పద్ధతిలో ఐదు నెలల్లో రీ సర్వేను పూర్తి చేశారు. మొత్తం 6,300 చదరపు కిలోమీటర్ల పరిధిలో ఉన్న పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లోని అన్ని రకాల భూములను సర్వే చేశారు. నాటి సీఎం రాజశేఖర్‌‌‌‌ రెడ్డి మరణం తర్వాత ఈ ప్రాజెక్టుపై నీలినీడలు కమ్ముకున్నాయి. తర్వాత వచ్చిన ప్రభుత్వాలు పట్టించుకోకపోవడంతో అర్ధంతరంగా ఆగిపోయింది.

ల్యాండ్‌‌‌‌ టైటిలింగ్‌‌‌‌కు మనదే రోడ్‌‌‌‌ మ్యాప్‌‌‌‌

దేశంలో రిజిస్ట్రేషన్‌‌‌‌ యాక్ట్‌‌‌‌ –1908 ప్రకారం సేల్‌‌‌‌ డీడ్‌‌‌‌ పద్ధతిలో భూ బదలాయింపులు జరుగుతున్నాయి. ఈ చట్టంలో ఉన్న లోపాలను సవరిస్తూ సేల్‌‌‌‌ డీడ్‌‌‌‌ స్థానంలో రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో కంక్లూజివ్‌‌‌‌ టైటిల్‌‌‌‌ను తీసుకొచ్చేందుకు కేంద్రం2010లో ల్యాండ్‌‌‌‌ టైటిలింగ్‌‌‌‌ డ్రాఫ్ట్‌‌‌‌ను రూపొందించి డిపార్ట్‌‌‌‌మెంట్‌‌‌‌ ఆఫ్‌‌‌‌ ల్యాండ్‌‌‌‌ రిసోర్స్‌‌‌‌ వెబ్ సైట్‌‌‌‌లో పెట్టింది. ‘ది ల్యాండ్‌‌‌‌ టైటిలింగ్‌‌‌‌ బిల్లు–2011’ పేరిట ఫైనల్‌‌‌‌ డ్రాఫ్ట్‌‌‌‌ను కూడా సిద్ధం చేసింది. కానీ ఈ బిల్లు చట్ట రూపం తీసుకోలేదు. ఈ డ్రాఫ్ట్‌‌‌‌కు కొనసాగింపుగా 2013లో ల్యాండ్‌‌‌‌ టైటిలింగ్‌‌‌‌కు రోడ్‌‌‌‌ మ్యాప్‌‌‌‌ సిద్ధం చేసేందుకు ఆంధ్రప్రదేశ్‌‌‌‌ రెవెన్యూ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ వినోద్‌‌‌‌ కె.అగర్వాల్‌‌‌‌ చైర్మన్‌‌‌‌గా, మహారాష్ట్ర రిజిస్ట్రేషన్ల శాఖ ఐజీ ఎస్‌‌‌‌.చొక్కలింగం, కర్నాటక సెటిల్‌‌‌‌మెంట్‌‌‌‌ కమిషనర్‌‌‌‌ వి. పొన్నురాజు, పశ్చిమ బెంగాల్‌‌‌‌ రిజిస్ట్రేషన్ల శాఖ ఐజీ బి. గంగోపాధ్యాయ, యూపీ రిజిస్ట్రేషన్ల శాఖ రిటైర్డ్‌‌‌‌ డీఐజీ ప్రభాత్‌‌‌‌ కుమార్‌‌‌‌ శర్మ సభ్యులుగా కేంద్ర ప్రభుత్వం ఓ కమిటీని నియమించింది. ఈ కమిటీ మూడుసార్లు సమావేశమై సమగ్ర నివేదిక ఇచ్చింది. అప్పటికే నిజామాబాద్‌‌‌‌లో అమలవుతున్న ‘భూ భారతి’ని దేశవ్యాప్తంగా అమలు చేయడానికి నమూనాగా తీసుకోవచ్చని కమిటీ ప్రతిపాదించింది.

ఇతర రాష్ట్రాలకు మోడల్‌‌‌‌

నిజామాబాద్‌‌‌‌లో ప్రారంభించిన భూ భారతి ప్రాజెక్టు 2009 తర్వాత నత్తనడకన సాగినప్పటికీ ఈ నమూనా రాజస్థాన్‌‌‌‌, మహారాష్ట్ర, కర్నాటక, గుజరాత్‌‌‌‌, ఒడిశా, బీహార్‌‌‌‌ ప్రభుత్వాలకు ఒక నమూనాగా మారింది. ఈ ప్రాజెక్ట్‌‌‌‌ మోడల్‌‌‌‌గా రాజస్థాన్‌‌‌‌ రాష్ట్ర ప్రభుత్వం దేశంలోనే తొలిసారిగా రాజస్థాన్‌‌‌‌ అర్బన్‌‌‌‌ ల్యాండ్‌‌‌‌ (సర్టిఫికేషన్‌‌‌‌ ఆఫ్‌‌‌‌ టైటిల్స్‌‌‌‌) బిల్లును 2016లో తీసుకొచ్చింది. అదే ఏడాది మహారాష్ట్ర ప్రభుత్వం కూడా ల్యాండ్‌‌‌‌ టైటిలింగ్‌‌‌‌ బిల్లు డ్రాఫ్ట్‌‌‌‌ను సిద్ధం చేసినప్పటికీ అసెంబ్లీలో పలు సాంకేతిక కారణాలతో ఇంత వరకు ఆమోదం పొందలేదు.  భూ భారతి మోడల్‌‌‌‌గా కర్నాటక ప్రభుత్వం ‘భూమి’ అనే ప్రాజెక్ట్‌‌‌‌ను ప్రారంభించింది. గుజరాత్‌‌‌‌లో నిర్వహించిన ఫీల్డ్ టు ఫీల్డ్ పద్ధతికి, ఒడిశా రాష్ట్రంలో శాటిలైట్ ద్వారా చేసిన సర్వేకు, బీహార్‌‌‌‌లో చేసిన ఏరియల్ సర్వేకు కూడా భూ భారతి ప్రాజెక్టు మోడల్‌‌‌‌ కావడం విశేషం. నేషనల్‌‌‌‌ ల్యాండ్‌‌‌‌ రికార్డ్సు మోడ్రనైజేషన్‌‌‌‌ ప్రోగ్రాం(ఎన్‌‌‌‌ఎల్‌‌‌‌ఆర్‌‌‌‌ఎంపీ) కింద 2008లో కేంద్ర ప్రభుత్వం తీసుకురావాలనుకున్న ల్యాండ్‌‌‌‌ టైటిల్‌‌‌‌ రిజిస్ట్రేషన్‌‌‌‌ విధానానికి  కూడా ఈ ప్రాజెక్టును ఆదర్శంగా తీసుకుంది.

2007లో డ్రాఫ్ట్‌‌‌‌ బిల్లుకు  బ్రేక్‌‌‌‌

2007–08లోనే ఆంధ్రప్రదేశ్‌‌‌‌ ల్యాండ్‌‌‌‌  అథారిటీ యాక్ట్‌‌‌‌–2007 ముసాయిదాను ప్రభుత్వం సిద్ధం చేసినప్పటికీ చట్ట రూపం దాల్చలేదు. టైటిల్‌‌‌‌ రిజిస్ట్రేషన్‌‌‌‌ను తెచ్చేందుకు వీలుగా రెవెన్యూ, రిజిస్ట్రేషన్‌‌‌‌, సర్వే, మున్సిపల్‌‌‌‌, స్థానిక సంస్థల చట్టాలకు సవరణలు చేస్తూ అసెంబ్లీలో బిల్లుపెట్టాల్సి ఉంది. ఈ బిల్లు ఆమోదం పొందాక కేంద్రం పరిధిలోని యాక్ట్‌‌‌‌ల్లో కూడా సవరణలు చేయాల్సి ఉంటుంది. ఇందుకోసం ఈ చట్టానికి రాష్ట్రపతి కూడా ఆమోద ముద్ర వేయాల్సి ఉంటుంది. అయితే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌‌‌‌లో 2007లో ఈ బిల్లు డ్రాఫ్ట్‌‌‌‌ను రూపొందించినప్పటికీ అసెంబ్లీలో ప్రవేశపెట్టకపోవడంతో చట్ట రూపంలోకి రాలేదు. దీంతో కంక్లూజివ్‌‌‌‌ టైటిల్‌‌‌‌ కల నెరవేరకుండా పోయింది.